Preventive Healthcare: ఆరోగ్యం అదృష్టంతో రాదు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:35 AM
Health Is Built by Habits Not by Luck A Call for Preventive Living
ఆరోగ్యం గొప్ప సంపద. ఆరోగ్యం అంటే వ్యాధులు లేకపోవడమే కాదు, శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు కలిగి ఉండటం. మనం హెల్తీగా ఉన్నప్పుడు కూడా నిత్యం మన శరీరాన్ని, మనస్సును జాగ్రత్తగా చూసుకోవడమే నిజమైన ఆరోగ్యం. ఆరోగ్యం ఒక పెట్టుబడి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో, అది మనకు సుదీర్ఘమైన, చురుకైన, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది.
మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దక్షిణ భారతదేశం కేంద్రంగా మారుతోంది. జాతీయ సగటు కంటే ఈ వ్యాధుల భారం ఇక్కడ ఎక్కువ. రక్తపోటు (31.8శాతం), నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (49.8 శాతం), కొరోనరీ ఆర్టరీ వ్యాధి (15శాతం) వంటివి హెచ్చుగా ఉన్నాయి. వీటిలో మనం చాలావరకు నివారించదగినవే. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, గ్లూకోజ్ జీవక్రియ దెబ్బతింటోంది. పదిశాతం కంటే తక్కువ మంది భారతీయులు మాత్రమే వ్యాయామం చేస్తున్నారు. అలాగే, రోజుకు 10.98 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసినదానికంటే 119శాతం ఎక్కువ. ఒత్తిడి, సరిపడని నిద్ర, ప్రాసెస్ చేసిన ఆహారాలతో రక్తపోటు, ఫ్యాటీ లివర్ సమస్యల తీవ్రత పెరుగుతోంది. సరైన సమయానికి నిద్రపోవడం, తినడం, మేల్కొనడం వల్ల శరీర గడియారం సక్రమంగా ఉంటుంది. 7–8 గంటల నిద్ర అవసరం. కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లతో ఇంట్లో వండిన సాధారణ ఆహారాన్ని తీసుకోవాలి. ముందుగా ఫైబర్ సమృద్ధిగా ఉన్న కీరదోస, టమోటా, క్యారెట్, బ్రోకోలీ, క్యాబేజీ వంటి కూరగాయలతో భోజనాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత గుడ్లు, చికెన్, పప్పు, చేపలు, సోయా లేదా పనీర్ లాంటి ప్రోటీన్ ఫుడ్, తదనంతరం కార్బోహైడ్రేట్లు (అన్నం లేదా గోధుమ రొట్టెలు) తీసుకోవాలి. భోజనాన్ని మజ్జిగ వంటి పులియబెట్టిన పదార్థాలతో ముగించాలి. ఈ విధానంలో అతిగా తినడం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజూ 30 నిమిషాల పాటు నడవాలి, లిఫ్టుకు బదులుగా మెట్లు వాడాలి. నడకను ఒక వ్యసనంగా మార్చుకోవాలి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు కుటుంబం, స్నేహితులతో సమయం గడపండి. ధ్యానం లేదా నచ్చిన పని చేయండి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. 40 ఏళ్లు పైబడిన మహిళలు, 50 ఏళ్లు పైబడిన మగవారు ఏడాదికి ఒకసారి బీపీ, షుగర్, బరువు పరీక్షించుకోవాలి. ఆరోగ్యం అనేది అదృష్టం వల్ల రాదు, అది మనం పాటించే చిన్న చిన్న అలవాట్ల ద్వారా నిర్మితమవుతుంది. ఈ కొత్త సంవత్సరాన్ని స్పృహతో కూడిన ఆహారం, చురుకైన జీవనం, ఆరోగ్య సంరక్షణ సంవత్సరంగా మార్చుకుందాం.
డాక్టర్ ఏ.నరేంద్రకుమార్
రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!