Share News

అభిశంసనకు సరిపడే దుర్వినియోగం!

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:58 AM

అభిశంసనకు అర్హుడు అయ్యేందుకు ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధానాధికారి ఇంకెంత అనుచితంగా వ్యవహరించాలి? ఈ ఏడాది తొలినాళ్లలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు...

అభిశంసనకు సరిపడే దుర్వినియోగం!

అభిశంసనకు అర్హుడు అయ్యేందుకు ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధానాధికారి ఇంకెంత అనుచితంగా వ్యవహరించాలి? ఈ ఏడాది తొలినాళ్లలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానాన్ని సమర్థిస్తూ ఆరు నెలల క్రితం ఇదే కాలమ్‌ (‘సీఈసీ అభిశంసన అవివేకమా?’ మార్చి 19)లో నేను అడిగిన ప్రశ్న అది. నేను పొరపడ్డాను. ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తీరు తెన్నులపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూ, వివేక్‌ జోషీల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల గురించి ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఇటీవల ప్రచురించిన ఒక పరిశోధనాత్మక కథనాన్ని చదివితే మీరూ, నేనూ ఊహించిన దానికంటే ఎక్కువగా వారు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడగలరని, పాల్పడ్డారని విశదమవుతుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈసీఐ సెప్టెంబర్‌ 26న స్వయంగా విడుదల చేసిన పత్రికా ప్రకటన (ప్రెస్‌నోట్‌) వాటిని పూర్తిగా తొలగిస్తుంది. ఈ ఈసీఐ ప్రెస్‌నోట్‌ అర్థం ఎన్నికల కమిషనర్లు తాము చేసిన తప్పులను స్వయంగా ఒప్పుకోవడమే. సీఈసీ జ్ఞానేశ్‌ను అభిశంసించేందుకు ఆ ప్రెస్‌నోట్‌లో చట్టపరమైన ఆధారాలు ఉన్నాయి. ఆ నోట్‌ను ఆమోదించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లను తొలగించేందుకు కూడా దానిలో చట్టపరమైన ఆధారాలు బలంగా ఉన్నాయి.

ఎన్నికల కమిషన్‌ అధికారాలకు సంబంధించిన రాజ్యాంగ అధికరణ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించేందుకు అనుసరించే పద్ధతినే సీఈసీని పదవి నుంచి తొలగించే సందర్భంలో పాటించాలి. అధికరణ 124(4) ప్రకారం ‘దుష్ప్రవర్తన, అసమర్థత’ అనే కారణాలు కాకుండా మరే కారణంతోనూ సీఈసీని తొలగించడానికి వీలు లేదు. సీఈసీ అభిశంసనకు ‘నేరపూరిత స్వభావాన్ని’ నిరూపించాల్సిన అవసరం లేదు. అయితే దుష్ప్రవర్తన, అసమర్థత అనేవి సాధారణ పొరపాటుకు, సదుద్దేశంతో పాల్పడిన తప్పుకు వర్తించవు. మరింత స్పష్టంగా చెప్పాలంటే సీఈసీ లాంటి అత్యున్నత పదవికి సంబంధించిన ప్రాథమిక బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ తీవ్ర అక్రమాలకు పాల్పడిన సందర్భాలలో మాత్రమే అభిశంసన ప్రక్రియ చేపట్టాలి.


ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం పూర్తి బాధ్యత వహించాలని, ఇందుకు ఆ రాజ్యాంగ సంస్థ అధికారంలో ఉన్నవారి ప్రభావాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా పనిచేయాలని అనూప్‌బరన్‌వాల్‌ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బెంగళూరు న్యాయ ప్రవర్తనా నియమాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరమున్నది. అవి: స్వతంత్రత, నిష్పాక్షికత, నిజాయితీ, సముచిత ప్రవర్తన, సామర్థ్యం, శ్రద్ధ. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు ఈ సుగుణాలు ఉన్నాయని ఎవరైనా అనగలరా? ఘోర పక్షపాతం, అనౌచిత్యం, మూకుమ్మడిగా ఓట్ల తొలగింపునకు అధికారాల దుర్వినియోగం ప్రాతిపదికన సీఈసీ అభిశంసన న్యాయబద్ధమేనని గతంలో నేను గట్టిగా వాదించాను. ఇప్పుడు సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు వ్యతిరేకంగా వాదించేందుకు వారు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన మరిన్ని చట్ట ఉల్లంఘనలను మనం ప్రస్తావించవచ్చు.

ఈసీఐ పత్రికా ప్రకటన మొదటి పేరాలోని 6వ అంశం ఇలా ఉంది: ‘ఎన్నికల సంఘం ఇకపై తన సమస్త సమావేశాలకు ముందే సంబంధిత అధికారులు అందరికీ సమావేశ అజెండాను లిఖితపూర్వకంగా తెలియజేస్తుంది. సమావేశంలో చర్చల, నిర్ణయాల వివరాలను నమోదు చేసి వాటిని అధికారికంగా విడుదల చేస్తుంది.’ విస్మయం కలిగించే విషయమిది. ఎందుకని? గత ఏడాది కాలంగా ఎన్నికల సంఘం సమావేశాలకు సంబంధించి ఎప్పుడూ ఎలాంటి అజెండాను లిఖితపూర్వకంగా తెలియజేయడం గానీ, సమావేశంలో చర్చల, నిర్ణయాల నివేదికను అందించడంగానీ జరగనే లేదన్నది ఈ ఏడాది ఏప్రిల్‌ 16న ఎన్నికల కమిషనర్‌ వివేక్‌ జోషీ లేవనెత్తిన అభ్యంతరాలలో ఒకటి అని ఎక్స్‌ప్రెస్‌ కథనం వెల్లడించిన నేపథ్యంలో పై ఉద్ఘాటనను ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటిదాకా విధుల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా జరగలేదని ఈసీఐ స్వయంగా ఒప్పుకున్నదని మనం భావించక తప్పదు. రాజ్యాంగబద్ధ సంస్థ వ్యవహరణ తీరు ఇలా ఉండడం సమంజసమేనా?

సరే, ఆయా సమావేశాలలో చర్చల వివరాలను అధికారికంగా వెల్లడిస్తే తప్ప, ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయాలకు, మరీ ముఖ్యంగా సర్‌కు సంబంధించిన వాటికి న్యాయబద్ధమైన ఆధారాలు లేవని మనం విశ్వసించక తప్పదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈసీఐ చట్టవిరుద్ధంగా వ్యవహరించింది. ‘ఏకగ్రీవం’గా నిర్ణయం తీసుకుని, జారీ చేశామని ఎన్నికల కమిషనర్లు ముగ్గురూ ఇప్పుడు ‘ముక్తకంఠం’తో చెబుతున్న సర్‌ సంబంధిత మూడు ఉత్తర్వులు చట్ట విరుద్ధమైనవే అవుతాయి. ఎన్నికల కమిషనర్లు ముగ్గురూ అప్పుడైనా, ఇప్పుడైనా ఆ ఉత్తర్వులతో ఏకీభవిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నకాదు. ఆ ఉత్తర్వులను ప్రకటించి, అమలుపరచడానికి ముందే, వాటికి సంబంధించిన నిర్ణయాన్ని ముగ్గురూ కలిసికట్టుగా ప్రతిపాదించి, చర్చించి, అంగీకరించి నమోదు చేశారా అన్నదే అసలు ప్రశ్న. ఇలా జరిగినట్టు ఆధారాలు లేనందున ఎన్నికల సంఘం రాజ్యాంగ విహితంగా వ్యవహరించలేదని మనం భావించక తప్పదు. ఒక అత్యున్నత రాజ్యాంగ సంస్థ చట్టబద్ధ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం గర్హనీయం కాదా?


ఈసీఐ పత్రికా ప్రకటన ఫామ్‌ 6లో చేసిన మార్పుల గురించి ప్రస్తావించింది. కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫామ్‌ 6లో ఎలాంటి ప్రాథమిక మార్పులు చేయలేదని ఈసీఐ పేర్కొంది. అయితే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న పౌరుడి బంధువుల వివరాలు పాత సర్‌లో ఉన్నాయో లేవో తెలుసుకునేందుకే ఒక అనుబంధ పత్రాన్ని చేర్చామని ఈసీఐ తెలిపింది. ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఈ మార్పును సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీఐ ప్రెస్‌నోట్‌ పేర్కొంది. న్యాయశాస్త్ర వ్యవహారాల వ్యాఖ్యాతలు పలువురు ఈ విషయంలో ఈసీఐతో ఏకీభవించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం తప్పుగా అన్వయించిందని న్యాయ నిపుణులు ఎత్తిచూపారు.

సర్‌ ప్రక్రియ అమలులో లేని సమయం (నాన్‌– సర్‌ పీరియడ్‌)లో అసలు ఫామ్‌ 6ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈసీఐ పత్రికా ప్రకటన పేర్కొంది. చట్టబద్ధమైన ఫామ్‌ 6లో చేసిన మార్పు ‘అనధికారికం, చట్ట విరుద్ధం’ అని ఎన్నికల కమిషనర్లు సంధూ, జోషీలు లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కమిషన్‌ సభ్యులే ఆక్షేపించిన తరువాత కూడా ఎన్నికల సంఘం సవరించిన ఫామ్‌ 6ను ఇప్పటివరకు ఉపయోగించడం చట్ట ఉల్లంఘనగా అంగీకరించడమే అవుతుందని భావించక తప్పదు.

ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు సభ్యుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ECINET వ్యవస్థ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ నేర్పాటు చేయాలని ఈసీఐ ప్రతిపాదించింది. దీని అర్థం.. చేసిన మరో తప్పును వారు అంగీకరించడమే. ఇది దిగ్భ్రాంతికరమైన అంగీకారం. 13 కోట్ల మందికి పైగా ఓటర్ల పేర్లను ఓటర్‌ జాబితాల నుంచి తొలగించేందుకు ఇప్పటివరకు ఉపయోగించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌, సాఫ్ట్‌వేర్‌ చట్టానికి అనుగుణంగా ఉన్నవేనా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేకపోతోంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం ఆ డిజిటల్‌ వ్యవస్థ చట్టానికి అనుగుణంగా లేదని ఎన్నికల కమిషనర్లు ఇరువురూ గట్టిగా భావించారు. ఓటర్‌ జాబితాలలో పేర్లను చేర్చడానికి లేదా తొలగించడానికి చట్టబద్ధమైన అధికారాలు ఉన్న ఈఆర్‌ఓలతో సహా ఫీల్డ్‌ అధికారులకు మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తామని ఈసీఐ ప్రెస్‌నోట్‌ హామీ ఇచ్చింది. అయితే ఈ వ్యవస్థ నుంచి తమను పక్కన పెట్టారని ఈఆర్‌ఓలు తదితరులు పదే పదే ఫిర్యాదులు చేశారన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. అయినా ఈసీఐ ప్రెస్‌నోట్‌ ప్రకారం విధుల నిర్వహణలో వారికి న్యాయబద్ధమైన పూర్తి అధికారాలు కాకుండా కొన్ని వెసులుబాట్లు మాత్రమే లభిస్తాయి!


ఎన్నికల సంఘం ప్రెస్‌నోట్‌లో లేని ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను: బెంగాల్‌లో ఓటర్‌ జాబితాలలో తమ పేర్లను తిరిగి చేర్పించుకోవడంలో సఫలమైన 16లక్షల మంది ఓటర్లకు వ్యతిరేకంగా అప్పీళ్లు దాఖలు చేసేందుకు అధికారం ఇచ్చింది ఎవరు? ఇది చట్ట ఉల్లంఘన అనడంలో ఎవరికీ రవ్వంత సందేహం కూడా ఉండదు. కనుకనే కాబోలు, ఈ అంశాన్ని పత్రికా ప్రకటనలో ప్రస్తావించడం తమకు మరింత కళంకం తెచ్చుకోవడమేనని ఎన్నికల సంఘం భావించి ఉంటుంది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్‌ 32(1)ని మనం తెలుసుకోవల్సిన అవసరమున్నది. ఓటర్‌ జాబితాలను రూపొందించే విధులలో పాల్గొనే ఏ ఎన్నికల అధికారి అయినా తగిన కారణం లేకుండా తన విధ్యుక్తధర్మ నిర్వహణలో తప్పు చేయడం, లోపభూయిష్ఠంగా బాధ్యతలు నిర్వహించడం నేరం కిందకు వస్తుందని ఆ సెక్షన్‌ స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా ఎన్నికల సంఘం మొత్తం –ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు– గా అటువంటి నేరానికి పాల్పడలేదా అని మీరు ప్రశ్నించుకోవాలి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలూ చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ఏఐతో మానవాళికి ముప్పే!

Updated Date - Oct 01 , 2026 | 12:58 AM