Share News

నవీన కాలానికి నవ జాతీయగీతం!

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:10 AM

సదా కొత్తదనాన్ని ఆవాహన చేసుకోవడమే జీవ ధర్మం. మన కాలానికి అవసరమైన ఒక కొత్త జాతీయ గీతాన్ని సృజించాలని యువభారతీయులకు గుల్జార్‌ పిలుపునిచ్చారు. దేశం 80వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు...

నవీన కాలానికి నవ జాతీయగీతం!

సదా కొత్తదనాన్ని ఆవాహన చేసుకోవడమే జీవ ధర్మం. మన కాలానికి అవసరమైన ఒక కొత్త జాతీయ గీతాన్ని సృజించాలని యువభారతీయులకు గుల్జార్‌ పిలుపునిచ్చారు. దేశం 80వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపుకున్న మరో మూడు రోజులకు గుల్జార్‌ 92వ ఏట ప్రవేశించారు. ‘జనగణమన’ లేదా ‘వందేమాతరం’ స్థానాన్ని భర్తీ చేసేందుకు కాకుండా సమకాలీన విభజనవాద రాజకీయాలను త్రోసిపుచ్చి, జాతిజీవనంలోని అపార వైవిధ్యాన్ని గౌరవించే ఒక అనుబంధ జాతీయ గీతాన్ని సృష్టించాల్సిన అవసరమున్నదని గుల్జార్‌ విజ్ఞప్తి చేశారు. తాము భారతీయులమనే ప్రగాఢ ఐక్యతా భావాన్ని పెంపొందించే ఒక కొత్త దేశభక్తి గీతాన్ని సృజించుకోవాలని అన్నారు. వర్తమాన భారతదేశం గొప్పదనాన్ని కీర్తించడంలో దశాబ్దాల నాటి పాత పాటలపై ఆధారపడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. సమకాలీన భారతీయ సమాజంలోని విభిన్న స్వరాలను ప్రతిబింబించేలా జాతీయ అస్తిత్వాన్ని పునర్‌ నిర్వచించుకోవాలని గుల్జార్‌ అన్నారు.

తన కొత్త గీతం ‘ఏక్‌ అకేలా హిందుస్థానీ, దో మిలే తో హిందుస్థాన్‌’ వీడియో విడుదల సందర్భంగా గుల్జార్‌ ఆ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సాంస్కృతిక వైవిధ్యం ద్వారా ఆత్మీయత, ఐక్యతా భావాన్ని శ్రోత మనసులో నెలకొల్పే ‘మిలే సుర్‌ మేరా తుమ్హారా’ లాంటి గీతమది.

గుల్జార్‌కు ప్రగాఢ అభిమానినే అయినప్పటికీ ఆయన సృజించిన ‘ఏక్‌ అకేలా హిందుస్థానీ’ ఇప్పుడు మనకు అవసరమైన కొత్త దేశభక్తి గీతం అని నేను భావించడం లేదు. అలా భావించాలని కవి కూడా కోరుకోలేదు. మన కాలానికి అవసరమైన కొత్త దేశభక్తి గీతాన్ని సృష్టించమని యువ భారతీయులను ఆయన ఆహ్వానించారు.

ఆనందప్రదమైన విషయమేమిటంటే రవీంద్రుని ‘జనగణమన’ గానీ, బంకించంద్ర ‘వందేమాతరం’ గానీ తమ ప్రేరణాత్మక గుణాన్ని కోల్పోలేదు, కోల్పోవు కూడా. ఆ అజరామర గీతాల విశిష్ట చారిత్రక ప్రస్థానాన్ని టి.ఎమ్‌.కృష్ణ తన ఇటీవలి పుస్తకం ‘We The People of India: Decoding A Nation’s Symbols’లో విపులంగా వివరించారు. నా తరం భారతీయులు ‘జనగణమన’ వినపడగానే గౌరవపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ ఆచారం కాలం గడుస్తున్న కొద్దీ కొత్త అర్థాలను సంతరించుకున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమింప చేయడంలో ఆ అధికారిక జాతీయ గీతం అశేష ప్రజలకు ఎనలేని స్ఫూర్తినిచ్చింది. బంకించంద్ర ‘వందేమాతరం’ కూడా అంతే స్ఫూర్తిదాయకమైనది. ఆకాశవాణి విన్పించే ‘వందేమాతరం’ కాకుండా ‘ఆనంద్‌ మఠ్‌’ సినిమాలోని పాటే నాకు బాగా నచ్చింది. ఈ రెండు గీతాలూ పవిత్రమైనవి, ఉత్కృష్టమైనవి, అన్ని సందర్భాలలోను ఆలాపించేందుకు యుక్తమైనవి.


దేశభక్తి గీతాల పట్ల అనురక్తి, గౌరవభావం నిండుగా వ్యక్తమైన భారతదేశంలో నేను పెరిగాను. ఇక్బాల్‌ ‘సారే జహాన్‌ సే అచ్చా, హిందుస్థాన్‌ హమారా’ను విస్మరించగలమా? స్వాతంత్ర్యోద్యమం నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన ఉదాత్తగీతమది. భారత జాతీయవాదం సంకుచితమైనదికాదు. మన పొరుగుదేశం, శత్రు రాజ్యం పట్ల వ్యతిరేక భావాలను పురిగొల్పేదికాదు. ‘జో జిసాసే మిలా సీఖా హమ్నే/ గైరోంకో భీ అప్నాయ హమ్నే’ (కలిసిన ప్రతి ఒక్కరి నుండి నేర్చుకున్నాం, అపరిచితులను కూడా సొంతవారిగా స్వీకరించాం) అన్న విశ్వ దృక్పథంతో మన జాతీయవాదం భారత్‌ను విశిష్టంగా నిర్వచించింది. 1960లు, 1970ల్లోని మా బోటి పిల్లలకు ‘ఆవో బచ్చో తుమ్హే దిఖాయే’, ‘హమ్‌ లాయేహై తూఫాన్‌ సే’ మొదలైన దేశభక్తిగీతాలు ఆదర్శవంతమైన దేశాన్ని నిర్మించాలని ప్రబోధించాయి. మంచి పౌరులుగా ఎదిగేందుకు అవి స్ఫూర్తినిచ్చాయి. ఇక్బాల్‌ అజరామర గీతంలోని ‘మజ్హబ్‌ నహీ సిఖాతా ఆపస్‌ మే బైర్‌ రఖ్నా’ (ఒకరి పట్ల ఒకరు ద్వేషాన్ని పెంచుకోవాలని మతం బోధించదు) అన్న సత్యాన్నే సాహిర్‌ సుప్రసిద్ధ సినిమా గీతం ‘తూ హిందు బనేగా నా ముసల్మాన్ బనేగా, ఇన్సాన్‌ కీ ఔలాద్‌ హై ఇన్సాన్‌ బనేగా’ (ఒక బిడ్డకు ఏ మతం ముద్ర వేయకముందే వారు మొదట మనుషులుగా జన్మిస్తారు)లో కూడా ప్రతిధ్వనించింది. ‘అప్నీ అజాదీ కో హమ్‌ హర్గీజ్‌ మిటా సక్తే నహీ’ మొదలైన పాటలు స్వాతంత్ర్యం విలువను ఉద్ఘాటించాయి, ‘సాథీ హాత్‌ బధానా’, ‘చోడో కల్‌ కీ బాతే’ మొదలైనవి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రతి భారతీయుడినీ ఆహ్వానించాయి. తోటి మనుషులకు సేవ చేయడమే దేశాన్ని ఆరాధించడమని నా బాల్యంలో మేము పాడిన దేశభక్తి గీతాలు ఉద్బోధించాయి. ఈ ఉదాత్త భావనే నేను విశ్వసించే జాతీయవాదం. 1962, 1965, 1971 యుద్ధాల చరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమా గీతాలు ‘ఆయే మేరే వతన్‌ కే లోగో’, ‘కర్‌ చలే హమ్‌ ఫిదా’ మొదలైన గీతాలు కూడా ఉదాత్త దేశభక్తిని ప్రేరేపించాయి గానీ సంకుచిత జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టలేదు. మనోజ్‌కుమార్‌ ప్రాచుర్యంలోకి తెచ్చిన దేశభక్తి కూడా నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చింది. అది నిరాడంబర దేశభక్తి. మా చిన్నతనంలో సినిమాలు చూడడానికి మా పెద్దలు అనుమతించేవారు కాదు. ప్రస్తావిత గీతాలు అన్నిటినీ తెరపై చూడడం కంటే రేడియో ద్వారానే ఎక్కువగా వింటుండేవాళ్లం.


ఇప్పటి దేశభక్తిగీతాలు నాకు అంతగా స్ఫూర్తినివ్వడం లేదు. వాటితో మమేకం కాలేకపోతున్నాను. ఆస్వాదించలేకపోతున్నాను. రాజకీయ స్పృహతో రాసిన కవిత్వం అర్థవంతమైనది. అటువంటి కవితలను తరచు చదువుతుంటాను. ప్రసిద్ధ కవి రఘువీర్‌ సహాయ్‌ వ్యంగ్య కవిత ‘అధినాయక్‌’ స్వాతంత్ర్యానంతరం కూడా సామాన్య ప్రజల దుస్థితి మారలేదని అధిక్షేపించింది. వినోద్‌ కుమార్‌ శుక్లా ‘లగ్భగ్‌ జైహింద్‌’ దేశభక్తి సూత్రాలకు, వాస్తవ మానవ శ్రేయస్సుకు మధ్య ఉన్న అంతరాన్ని బహిర్గతం చేసింది. సర్వేశ్వర్‌ దయాళ్‌ సక్సేనా, దుష్యంత్‌ కుమార్ కవితలు ప్రజల నిరాశా నిస్పృహలను ప్రభావశీలంగా వ్యక్తం చేశాయి. ఉదాత్త దేశభక్తిగీతాల కోసం నా అన్వేషణ నన్ను ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌, ఇక్బాల్‌ బానో కవిత్వానికి తీసుకువెళ్లాయి. జనప్రియ హిందీ గీతాలు, పాటలకు నా పఠనాసక్తులలో చోటు లేదు. అలా అని నేను వాటిని వినకపోలేదు. ‘చక్‌ దే ఇండియా’ నా హృదయాన్ని తాకింది. ‘సందేశే ఆతే హై’ స్ఫూర్తిదాయక గీతమే కానీ ‘కర్‌ చలే హమ్‌ ఫిదా’లా భావావేశం కలిగించేది కాదు. ‘యే జో దేశ్‌ హై తేరా’ అనుభూతించడానికి అవసరమైన ప్రవాస జీవితానుభవాలు నాకు లేవు. ‘మా తుఝే సలామ్‌’ సంగీత బాణీ అత్యాధునికంగా ఉంటుంది. అయితే ఆ చరణాలలోని భాష పాత శైలిలో ఉంటుంది. దాని సందేశం కూడా గతించిన కాలపు దేశభక్తి ప్రపూరితంగా ఉంటుంది. ఈ రీతికి ‘రంగ్‌ దే బసంతి’ కొంచెం మినహాయింపు. దేశభక్తి, ప్రభుత్వ విధేయత మధ్య తేడాను ఈ గీతం స్పష్టంగా ఎత్తి చూపుతుంది. సరే, గత ఒక దశాబ్ద కాలంలో ‘తేరీ మిట్టీ’, ‘చల్లా’ మొదలైన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. తీవ్ర జాతీయవాదాన్ని ప్రబోధించే ఆ పాటలు నా చిన్ననాటి మానవీయ జాతీయవాదానికి భిన్నమైనవి, విరుద్ధమైనవి.

కొత్త దేశభక్తి గీతాన్ని సృజించాలని యువ భారతీయులకు గుల్జార్‌ ఇచ్చిన పిలుపు సమయోచితమైనది. అయితే స్వాతంత్ర్య శతాబ్దికి వడివడిగా పురోగమిస్తోన్న భారత్‌కు అవసరమైన జాతీయ గీతాన్ని సృష్టించేందుకు సాహిత్య ప్రతిభ, సంగీత మేధస్సు మాత్రమే సరిపోవు. భారత్‌ భావనకు ఒక కొత్త నిర్వచనమిచ్చే దార్శనికత అవసరం. నేటి సంకుచిత జాతీయవాద దృక్కోణాలను విడనాడి ప్రతి పౌరుడిని గౌరవించే మానవత, సమ్మిళిత దృక్పథాన్ని కొత్త దేశభక్తి గీతం విస్పష్టంగా ఆవిష్కరించాలి. అటువంటి స్ఫూర్తిదాయక జాతీయ గీతమే భారతదేశాన్ని పునః సృష్టించగలుగుతుంది. దళితులు ఆదివాసులు, మహిళలు, మైనారిటీలతో సహా సమస్త అణగారిన వర్గాలవారు ఒక వినూత్న చైతన్యంతో తమ గళాలను విన్పిస్తున్న కాలమిది. జాగృతమవుతున్న నవభారత వాణిలో వారి గొంతుకలు ప్రతిధ్వనించకపోతే ఎలా? నవ భావ భారతం తేజరిల్లాలన్నా, విస్తరిల్లాలన్నా ఇప్పటివరకు విస్మరణకు గురైన సామాజికవర్గాల వాణికి సముచిత న్యాయం చేయాలి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 20 , 2026 | 05:11 AM