‘అస్తిత్వ’ అవస్థల్లో భారతీయులు!
ABN , Publish Date - Jul 01 , 2026 | 03:26 AM
భారతీయుడా, నీవు భారతీయ పౌరుడువేనా?! విడ్డూరమైన కాలమిది. కాకపోతే భారతీయ పౌరుడుగా గుర్తింపు విషయంలో భారతీయులు అయోమయంలో పడవలసిరావడమేమిటి? సగటు భారతీయుడు తన జాతీయత...
భారతీయుడా, నీవు భారతీయ పౌరుడువేనా?! విడ్డూరమైన కాలమిది. కాకపోతే భారతీయ పౌరుడుగా గుర్తింపు విషయంలో భారతీయులు అయోమయంలో పడవలసిరావడమేమిటి? సగటు భారతీయుడు తన జాతీయత నిర్ధారణకు న్యాయబద్ధమైన ప్రమాణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు అతడికి దిశా నిర్దేశం చేయవలసిన అధికార వ్యవస్ధ ఇప్పటి వరకు స్పష్టమైన విధి విధానాలు వెల్లడించలేదు. ఇది విచిత్ర సందర్భం కాదూ?
ఒక దేశానికి సార్వభౌమాధికారం ఎంత ముఖ్యమో ఆ దేశవాసులకు జాతీయత, పౌరసత్వం ఉండడం కూడా అంతే ముఖ్యం. మన పొరుగు దేశాలు అయిన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో అత్యంత వెనుకబడిన మారుమూల ప్రాంతాలలో సైతం పౌరసత్వం, జాతీయత విషయంలో స్పష్టమైన విధివిధానాలు అమలులో ఉన్నాయి. మరి భారత్‌లో ఆ ప్రాథమిక గుర్తింపుల విషయంలో ఒక కచ్చితమైన విధానం లేకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వానికి ప్రామాణిక ధ్రువీకరణ కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆ పెద్దమనిషి ప్రకటన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అసంఖ్యాకులను ఆందోళనకు గురిచేస్తోంది.
చట్టాలు, అధికారిక నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్, పౌరసత్వం వేర్వేరు అంశాలే అయినప్పటికీ పరస్పర అనుసంధానం ఉన్న విషయాలు. దుబాయిలోని ప్రవాస భారతీయ కుటుంబాల నవజాత శిశువులకు తల్లిదండ్రుల పాస్‌పోర్ట్‌ల ఆధారంగా వారి జాతీయతను నిర్ధారించి, పౌరసత్వాన్ని నమోదు చేస్తారు. ఆ తరువాత మాత్రమే భారత విదేశాంగ శాఖ ఆ పసి ప్రాయులకు పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తుంది. ఉదాహరణకు బహ్రెయిన్‌లో, తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రవాస దంపతులకు జన్మించిన ఒక బాలిక జననాన్ని నిర్దిష్ట కాలంలో నమోదు చేయకపోవడంతో అమె భారతీయ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం గుర్తించలేదు. తత్కారణంగా అమెకు పాస్‌పోర్ట్ జారీలో జాప్యం జరిగి, స్వదేశానికి తిరిగి వెళ్ళడంలో ఆ చిన్నారికి సమస్యలు సంభవించాయి. జాతీయతను నిర్ధారించుకున్న తరువాతనే పౌరసత్వాన్ని నమోదు చేసి, పాస్‌పోర్ట్ జారీ చేసే విధానమే ప్రపంచమంతటా అమలులో ఉన్నది. భారత్‌లో సైతం దరఖాస్తుదారుడు భారతీయుడు అని నిర్ధారించుకున్న తర్వాతే పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రమాణం కాదని విదేశాంగ శాఖ అనడం సువిశాల భారతీయ సమాజాన్ని సందిగ్ధావస్థలో పడవేసింది. సమస్త ధ్రువీకరణలలో పాస్‌పోర్ట్‌ను అత్యున్నత విశ్వసనీయ అధికారిక పత్రంగా భావిస్తారు. ఇది, దేశ జనాభాలో కేవలం 6.5శాతం మంది వద్ద మాత్రమే ఉన్నది. అయినప్పటికీ పాస్‌పోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం సహజంగానే అసంఖ్యాకులను ఉలికిపాటుకు గురిచేసింది.
జాతీయతను జాతీయ పౌరసత్వ నమోదు (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్– ఎన్‌ఆర్‌సీ) ద్వారా నిర్ధారిస్తారు. ఇందుకు జాతీయ జననాల నమోదు అవసరం. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీల స్వార్ధ ప్రయోజనాల కారణంగా ఈ ప్రక్రియ 2003 వరకు అస్తవ్యస్తంగా కొనసాగింది. కేంద్ర హోం శాఖ పరధిలోని ఈ అంశాన్ని దాని పక్షాన స్థానిక సంస్థలు నిర్వహిస్తాయి. స్థానిక స్వపరిపాలనా సంస్థలలోని ప్రజాప్రతినిధులు ఎప్పుడూ, ఎక్కడా కూడ ఈ విషయమై ప్రజలలో అవగాహన కల్పించలేదు. ప్రభుత్వాలూ సరిగా పట్టించుకోలేదు. జననాల నమోదులో చోటుచేసుకున్న అలసత్వానికి ప్రజల కంటే పాలకులే ప్రథమ దోషులు అని చెప్పక తప్పదు.
అయితే రెండు దశాబ్దాల క్రితం ఈ శోచనీయ పరిస్థితి మారింది. నాటి నుంచి జననాల నమోదు క్రమబద్ధంగా జరుగుతోంది. ప్రస్తుత యువతరంలో అత్యధికుల జననం అధికారికంగా నమోదయి ఉంది. అయితే వారి తల్లిదండ్రుల జననాల విషయంలో మాత్రం స్పష్టత లేదు. 1987కు ముందు జన్మించిన వారికి జనన సర్టిఫికెట్లు అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నది. 2004 అనంతరం జన్మించిన వారి జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు తల్లిదండ్రుల సర్టిఫికెట్లను సైతం అడుగుతోంది. దీంతో పరిస్థితి సంక్లిష్టమవుతోంది.
గ్రామీణ ప్రాంతాలలోని బడుగువర్గాలలో, ప్రత్యేకించి బాలికల అక్షరాస్యత ఇప్పటికీ అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లో జననాల ధ్రువీకరణ పత్రాలు ఉండడం అంత సులభతరం కాదు. జననల నమోదు సక్రమంగా జరిగి ఉంటే జాతీయత, పౌరసత్వం ఉనికికి సంబంధించి అయోమయ పరిస్ధితి ఉత్పన్నమయ్యేది కాదు. 1945లో న్యూఢిల్లీలో జన్మించిన పాకిస్థాన్ సైనిక పాలకుడు జనరల్ జనరల్ పర్వేజ్ ముష్రాఫ్ జనన సర్టిఫికెట్ లభించినంత సులువుగా అసలు సిసలైన భారతీయుల జనన సర్టిఫికెట్లు లభించవనేది అందరికీ తెలిసిన విషయమే. అక్షరాస్యత లేని ఆఫ్రికా ఆటవీ ప్రాంతాలలోను, అరేబియా ఎడారి కుగ్రామాల ఇసుక దిబ్బలలో గుడారాలలో నివసించె వెనుకబడ్డ తెగల ప్రజల జననాలు, మరణాలు కచ్చితమైన వివరాలతో నమోదవుతున్నాయి. మరి ఈ విషయంలో భారత్ ఎందుకు విఫలమయింది? ఆత్మపరిశీలన చేసుకోవాలి. చొరబాటుదారులకు ఎట్టి పరిస్థితులలోనూ ఏ రకమైన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకూడదు. ఈ విషయంలో మరో అభిప్రాయానికి ఆస్కారం లేదు. అయితే అసలు భారత జాతీయతకు ప్రమాణం ఏమిటి? ఈ మౌలిక, కీలక ప్రశ్నకు పాలకుల వద్ద సరైన సమాధానం లేకపోవడమే ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తోంది.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
Also Read:
టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి
డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్