చమురు రంగంలో తెలుగు సంస్థలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:59 AM
దేశ సరిహద్దులకు ఆవల ప్రపంచవ్యాప్తంగా భారత వాణిజ్య విజయం అంటే సహజంగా ఐటీ రంగ దిగ్గజ సంస్థలే గుర్తుకు వస్తాయి. ఈ సంస్థలు సకాలంలో మెరుగైన సేవలు అందించి...
దేశ సరిహద్దులకు ఆవల ప్రపంచవ్యాప్తంగా భారత వాణిజ్య విజయం అంటే సహజంగా ఐటీ రంగ దిగ్గజ సంస్థలే గుర్తుకు వస్తాయి. ఈ సంస్థలు సకాలంలో మెరుగైన సేవలు అందించి లాభాలు ఆర్జిస్తున్నాయి; భారత యువజనులకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నాయి; మరీ ముఖ్యంగా భారతీయుల ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపును సాధిస్తున్నాయి. ఈ కారణంగానే సమకాలీన భారతీయ వాణిజ్య విజయాలకు ఐటీ సంస్థలు ప్రతీకలుగా వెలుగొందుతున్నాయి. ఇటీవల కొంతకాలంగా ఐటీ సంస్థలకు అదనంగా భారతీయ ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల సంస్థలూ విదేశాలలో విజయవంతంగా విస్తరిస్తున్నాయి. ఇది శుభ పరిణామం. ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచంలో అగ్రభాగాన నిలిచే చమురు నిక్షేపాల నెలవులు అయిన గల్ఫ్ అరబ్బు దేశాలలో ఈ సంస్థలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి.
వాస్తవానికి భారతీయ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ సంస్థలకు అరబ్బు దేశాలు కొత్త కాదు. చమురు ఎగుమతి ఆరంభ కాలం (1970వ దశకం)లో టాటా గ్రూప్ భాగస్వామి అయిన అగ్రగామి కాంట్రాక్టింగ్ కంపెనీ ‘షాపుర్జీ పల్లోంజీ’ గల్ఫ్ దేశాలలో సివిల్ నిర్మాణాలను విరివిగా చేపట్టింది. ఈ ఎడారి దేశాలలో మట్టి సరిగ్గా అందుబాటులో ఉండదు. దీంతో అవసరమైన మట్టిని షాపుర్జీ పల్లోంజీ కంపెనీ భారతదేశం నుంచి నౌకలలో తీసుకువచ్చేది. అప్పుడే ఆ కంపెనీ యువ ఇంజినీరు ఎ.పి.జితేందర్ రెడ్డిని కూడా ఉద్యోగ వీసాపై గల్ఫ్‌కు తీసుకువచ్చింది. సుదీర్ఘకాలం అరబ్బు దేశాలలో ఉన్న జితేందర్ దేశానికి తిరిగి వెళ్లి పార్లమెంటుకు పోటీ చేసి ఎన్నికయ్యారు. ఎలక్ట్రో–మెకానికల్ రంగంలో ప్రముఖ భారతీయ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ పూర్తి చేసిన 65 బిలియన్ డాలర్ల విలువైన పనులలో దాదాపు సగం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ దేశాలకు చెందినవే కావడం విశేషం. ఎడారి ఉష్ణోగ్రతలో ఎయిర్ కండిషన్ ఇంజినీరింగ్ భారీ కాంట్రాక్టులను ప్రపంచ దిగ్గజ బహుళజాతి సంస్థలతో పోటీపడి ఎల్ అండ్ టీ విజయవంతంగా పూర్తిచేసింది. మారుమూల ఇసుక ఎడారుల గుండా హై వోల్టోజీ విద్యుత్ లైన్ల నిర్మాణంలో కూడా ఎల్ అండ్ టీ తన విశిష్టతను చాటింది. గల్ఫ్ దేశాలలో పైపులైను వ్యవస్థ అత్యంత కీలకమైనది. నీటి వనరులు లేని ఈ ఎడారి దేశాలలో వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర తీరం నుంచి శుద్ధి చేసిన ఉప్పు నీటిని నగరాలకు సరఫరా చేయడం, చమురును నౌకాశ్రయాల వరకు రవాణా చేయడానికి పైపులు ప్రధాన ఆధారాలు. ఈ పైపుల నిర్మాణం, సరఫరా పనుల్లో భారతీయ సంస్థలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. చమురు పైపుల నిర్మాణం, నిర్వహణలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నిపుణులు పెట్టింది పేరు.
గల్ఫ్ దేశాలు అంటే చమురు, గ్యాస్‌కు మారుపేరు. ఈ దేశాలలో ప్రతి వ్యవస్థ ఈ రంగంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుసంధానమై ఉంటుంది. నిరంతర విస్తరణ, నిర్వహణ పనులు ఉండే ఈ రంగంలో ఇప్పటి వరకు భారతీయ సంస్థలు ఏవీ కూడా పోటీపడలేదు. సాధారణంగా అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాల ఇంజినీరింగ్ సంస్థలే ఇందులో సదా అగ్రగాములుగా ఉంటాయి.
ప్రప్రథమంగా భారతీయ సంస్థలు అందునా తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థలు చమురు రంగంలో సాహసోపేతంగా అడుగుపెడుతున్నాయి. చమురు ఉత్పాదకతలో విడుదలయ్యే వివిధ రసాయనాలను వేరు చేస్తూ నికర చమురును తీయడం ఒక ముఖ్య ప్రక్రియ. ఇందుకు అవసరమైన ప్లాంట్లను సాధారణంగా పాశ్చాత్య దేశాల సంస్థలు మాత్రమే నిర్మిస్తాయి. ఈ రకమైన నిర్మాణ పనుల కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ కువైత్‌లో దక్కించుకుని ప్రపంచ ఇంజినీరింగ్ సంస్థలను ఆశ్చర్యానికి గురిచేసింది. 381 మిలియన్ డాలర్ల ఈ కాంట్రాక్టు చమురు రంగంలో భారతీయ సంస్థల ప్రాబల్యానికి ఒక తిరుగులేని నిదర్శనం. ఇంతకు ముందూ కువైత్ చమురు సంస్థ నొకదానిలో 225 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును మేఘా సంస్థే దక్కించుకుంది. సౌదీలో 300 కిలోమీటర్ల పైపు లైను ద్వారా మక్కా పుణ్యక్షేత్రానికి ఐదు లక్షల క్యూసెక్కుల మంచి నీరు సరఫరా చేసే అర్హత పొందిన సంస్థల జాబితాలో కూడా మేఘా ఉన్నది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రోగ్రెసివ్, రాంకీ, జి.యం.ఆర్ సంస్థలు గతంలో వివిధ రంగాలలో కొన్ని పనులు చేసినా కీలకమైన చమురు రంగంలో మేఘా ప్రవేశమే భారతీయ కంపెనీలకు ఒక కొత్త ప్రారంభమని చెప్పవచ్చు. భారత వాణిజ్య విజయాలలో ఇదొక ఉజ్వల అధ్యాయం. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ఐటీ సంస్థల జైత్రయాత్రను ఇంజినీరింగ్ సంస్థలూ కొనసాగించాలి.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా