Share News

ఆధునిక అరబ్‌ నిర్మాణ దక్షుడు

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:15 AM

దేశ ప్రతిష్ఠను పెంపొందించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి నిర్మాణాత్మక చర్యలతో ముందుకు వెళ్లడమే మానవీయ రాజధర్మమని నిరూపించిన అతి అరుదైన పాలకులలో...

ఆధునిక అరబ్‌ నిర్మాణ దక్షుడు

దేశ ప్రతిష్ఠను పెంపొందించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి నిర్మాణాత్మక చర్యలతో ముందుకు వెళ్లడమే మానవీయ రాజధర్మమని నిరూపించిన అతి అరుదైన పాలకులలో, ఈ నెల 12న 74 ఏళ్ల వయసులో మరణించిన ఖతర్‌ మాజీ రాజు షేక్‌ హామద్ తానీ ఒకరు. అతి చిన్న ఎడారి రాజ్యమైన ఖతర్‌‌ను అగ్రగామి ఆధునిక దేశంగా రూపొందించేందుకు సంకల్పించి, ఆ సమున్నత లక్ష్యాన్ని అనతి కాలంలో సాధించిన రాజ్య నిర్మాణ దక్షుడు హామద్‌ తానీ. భారత్‌ తన జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేసి ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించింది. హామద్‌ అంత్యక్రియలలో సమస్త దేశాల అధికారిక ప్రతినిధి బృందాలు పాల్గొనడం అంతర్జాతీయ వ్యవహారాలలో ఖతర్‌‌ ప్రాధాన్యానికి తార్కాణం.

జనాభాపరంగా తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా కంటే చిన్నదైన ఖతర్‌ ప్రపంచ పటంలో ప్రముఖంగా ఎదగడానికి హామద్‌ దూరదృష్టి, దీక్షా దక్షతలే ప్రధాన కారణం. ఖతర్‌‌ పాలనా బాధ్యతలు చేపట్టినది మొదలు అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ఆ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించారు. హామద్‌ అనుసరించిన విధానాలతో భారతీయులకూ ఖతర్‌‌లో పెద్ద సంఖ్యలో ఉపాధి లభించింది. ఇరుగు పొరుగు దేశాలు చమురు ఎగుమతులతో అపార సిరిసంపదలకు నెలవులు కాగా హామద్‌ తన దేశంలోని గ్యాస్ నిక్షేపాలపై దృష్టి పెట్టి వాటి ఆధారంగా ప్రపంచ ఇంధన విపణిలో ఖతర్‌‌కు అద్వితీయ స్థానాన్ని సాధించారు. సహజ వాయువు ఎగుమతులతో సమకూరిన ఆదాయంతో ఖతర్‌‌ వాసుల జీవన ప్రమాణాలను ఇతోధికంగా మెరుగుపరిచారు. అమెరికా, ఐరోపా వాసుల కంటే ఖతర్‌‌ అరబ్బుల జీవన స్థితిగతులే అన్ని విధాలా సుఖసంతోషాలతో ఉండేందుకు హామద్‌ పాటుపడ్డారు. సత్ఫలితాలు సాధించారు. నేడు అపూర్వ భాగ్యసీమగా ఖతర్‌‌ విలసిల్లుతోంది.

అరబ్‌ రాచరిక పాలకులు సాధారణంగా సుదీర్ఘకాలం లేదా జీవిత పర్యంతం అధికారంలో కొనసాగడం పరిపాటి. హామద్‌ అలా కాకుండా స్వల్పకాలం మాత్రమే పాలనా బాధ్యతల్లో ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న తన తండ్రిని పదవీచ్యుతుడిని చేసి సింహాసనమెక్కిన షేక్‌ హామద్.. 18 ఏళ్ల పాటు (1995–2013) పరిపాలించి, కుమారుడు షేక్‌ తమీంకు రాజుగా పట్టాభిషేకం చేసి విశ్రాంత జీవితంలోకి వెళ్లారు.


ఖతర్‌‌కు రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యాన్ని సంతరింపజేయడంతో పాటు హామద్‌ తన దేశాన్ని ఒక సైనిక శక్తిగా తీర్చిదిద్దారు. మీడియా జగత్తులోను తన దేశం ఒక సముచిత స్థానంలో ఉండాలని భావించి, ఆయన ఆ దిశగా అడుగులు ముందుకు వేసి అద్భుతాలు సాధించారు. అల్ జజీరా... అరబ్బు ప్రపంచాన్ని సమూలంగా మార్చిన టెలివిజన్ ప్రసార చానెల్‌ను నెలకొల్పడమే ఆ దిశగా ఒక విప్లవాత్మక ముందడుగు. వివిధ కారణాల వలన సమాచార మాధ్యమాలపై ఆంక్షలు అమలులో ఉండే అరబ్బు ప్రపంచంలో అల్ జజీరా ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. వార్త, వ్యాఖ్య, విశ్లేషణలో నిష్ణాతులయిన పాత్రికేయుల సమూహంగా ఆవిర్భవించిన ఈ చానెల్ ఖతర్‌‌కు ఒక విలక్షణ గుర్తింపును తీసుకువచ్చింది. ఇరాక్‌, సూడాన్, అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలలో దాడులు చేసేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు వెనుకంజ వేసేవి అంటే ఈ చానెల్ కవరేజీనే కారణమని నిస్సంకోచంగా చెప్పవచ్చు. అల్‌ జజీరా ప్రజాదరణకు అదొక తిరుగులేని తార్కాణం. ట్యూనీసియాలో సంభవించిన ఒక సంఘటనపై అల్‌ జజీరాలో ప్రసారమైన ఒక వార్త అరబ్‌ దేశాలలో జాస్మిన్ విప్లవానికి దారితీసింది. యావత్తు ప్రపంచాన్ని కవరేజీ చేసిన ఈ చానెల్‌కు వ్యవస్థాపకుడు అయిన హామద్‌ ఒక్కసారి కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ఆసక్తికరం.

ఆదాయంతో పాటు జాతీయ భద్రత కూడా అనివార్యమని భావించిన హామద్‌ తన దేశంలో ఒక భారీ సైనిక స్థావరాన్ని నిర్మించి అమెరికాకు అప్పగించారు. అమెరికా అందులో నిర్వహిస్తున్న సైనిక నియంత్రణా కేంద్రం ప్రపంచంలోని అతిపెద్ద సైనిక స్థావరాలలో ఒకటి. ఒకవైపు ఇజ్రాయెల్‌ మరోవైపు పాలస్తీనా, ఒకవైపు అమెరికా మరోవైపు తాలిబన్లతో ఏకకాలంలో సాన్నిహిత్యాన్ని కలిగివుండడం ద్వారా ఖతర్‌‌ దౌత్యపరంగా తనకంటూ ఒక విశ్వసనీయమైన స్థానాన్ని సంపాదించింది. భారత్‌–తాలిబన్ల మైత్రి కూడా ఖతర్‌‌లో మొదలయింది. క్రీడారంగంలో ఏ విధమైన అనుభవం లేకున్నా ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీల ఆతిథ్యానికి ముందుకు వచ్చి, ప్రశస్తంగా నిర్వహించి ప్రపంచాన్ని అబ్బురపరచిన దేశం ఖతర్‌‌. ఆ దేశంలోని అత్యాధునిక హామద్ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్, ఇతర ఆసియా దేశాల నుంచి ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలకు రాకపోకలు సాగించే మార్గంలో కీలక అనుసంధాన కేంద్రంగా ఉన్నది. అనతికాలంలో ప్రపంచంలోని అత్యున్నత విమానయాన సంస్థలలో ఒకటిగా ఎదిగిన ఖతర్ ఏయిర్‌వేస్ కార్యకలాపాలకు ఆ విమానాశ్రయమే కేంద్రంగా ఉన్నది. మన ఎయిర్‌ ఇండియాకు ఉన్న విమానాల కంటే ఖతర్‌‌ ఎయిర్‌వేస్‌కు ఉన్న విమానాలే ఎక్కువ. ఖతర్‌‌ను ఆధునికంగా తీర్చిదిద్ది, జాతి సంపదను ప్రజా శ్రేయస్సుకు, విశాల ప్రపంచ పురోగతికి వినియోగించడంలో తనకు తానే సాటి అని నిరూపించిన షేక్‌ హామద్ నిత్య స్మరణీయుడు.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Also Read:

ఇథనాల్‌పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా

Updated Date - Jul 15 , 2026 | 05:15 AM