Share News

ప్రవాసులకు ప్రోత్సాహకాలు ఏవీ?

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:16 AM

విదేశాలలో జీవనోపాధి పొందుతున్న భారతీయులు తమ ఆర్జనతో మాతృదేశాన్ని అనితరసాధ్యంగా ఆదుకుంటున్నారు. వివిధ సందర్భాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైనప్పుడు...

ప్రవాసులకు ప్రోత్సాహకాలు ఏవీ?

విదేశాలలో జీవనోపాధి పొందుతున్న భారతీయులు తమ ఆర్జనతో మాతృదేశాన్ని అనితరసాధ్యంగా ఆదుకుంటున్నారు. వివిధ సందర్భాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైనప్పుడు, ఇతర దేశాలతో పోల్చితే ఆ సంక్షోభాల తీవ్రత భారత్‌పై పెద్దగా ఉండకపోవడానికి కారణం ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే నిధులే. ఇది ఎవరూ నిరాకరించలేని వాస్తవం.

ప్రవాస భారతీయులలో ప్రత్యేకించి, చిన్నాచితకా పనులు చేసుకోవడానికి అరేబియా గల్ఫ్ దేశాలకు వచ్చినవారు తమ కుటుంబాలకు పంపుతున్న నిధుల వాటా ఎక్కువగా ఉంటోంది. ఇది నిజం. భారత్‌కు సమకూరుతున్న విదేశీ మారకద్రవ్యంలో సగానికి పైగా ఎడారి దేశాల నుంచి వస్తుండగా మిగిలిన సగం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

స్వదేశంలో ఉద్యోగావకాశాలు లేకపోవడంతో మెరుగైన ఉపాధికి విదేశాలకు వలస వెళ్తున్న యువ భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తదనుగుణంగా వారు తమ కుటుంబాలకు పంపిస్తున్న నిధులూ పెరుగుతున్నాయి. 2012 సంవత్సరంలో మూడు లక్షల కోట్ల రూపాయలు పంపించిన ప్రవాస భారతీయులు, 2026లో ఇప్పటిదాకా రూ.12.8 లక్షల కోట్లు పంపించినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రవాసులు పంపిస్తున్న నిధులను అధికమొత్తంలో అందుకుంటున్న రాష్ట్రాలలో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉంది.

దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురైన ప్రతిసారీ దాన్ని గట్టెక్కించింది ప్రవాస భారతీయులే. మన పాలకులు ఎందుకనో ఈ వాస్తవాన్ని బాహాటంగా అంగీకరించడం లేదు. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రవాసులు పంపే నిధుల వాటా ఇంచుమించు 3శాతం అని అధికారిక నివేదికలే వెల్లడిస్తున్నాయి. అయినా ప్రభుత్వాలు ప్రవాసుల వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు!

ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రమూ సగర్వంగా చెప్పుకునే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)తో పోల్చితే ప్రవాస భారతీయులు పంపే నిధులే ఎక్కువ. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ప్రవహించిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లు కాగా, ఆ రాష్ట్రానికి చెందిన ప్రవాసులు ఒక్క సంవత్సరంలో పంపించిన మొత్తం నిధులు 12 బిలియన్ డాలర్లు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలు ఒక బిలియన్ డాలర్లకు మించకపోగా, ప్రవాసాంధ్రులు ఒక్క సంవత్సరంలో పంపించిన నిధులు 6.6 బిలియన్ డాలర్లు.


భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటా 1శాతానికి మించి లేదని కూడా అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లో ఏ మాత్రం ఒడుదుడుకులు చోటుచేసుకున్నా ఆ ఎఫ్‌డీఐలు సైతం క్షణాలలో దేశం దాటి వెళ్లిపోతాయి. పెట్టుబడులు తీసుకువచ్చే ఒక విదేశీ కంపెనీకి మన ప్రభుత్వాలు ఎర్రతివాచీ పరిచి స్వాగతిస్తున్నాయి. అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. పన్ను రాయితీలతో పాటు భూ పందేరమూ చేస్తున్నాయి. ఏదో ఒక విదేశీ సంస్థ ప్రతినిధులు మన మంత్రులతో సమావేశమై సంప్రదింపులు జరపడం గురించిన వార్తలు ఫొటోలతో సహా నిత్యం పత్రికల్లో కనిపిస్తుంటాయి మరి.

తాత్కాలిక విదేశీ పెట్టుబడుల కంటే మూడింతలు ఎక్కువగా శాశ్వత నిధులను తీసుకువచ్చే ప్రవాస భారతీయులను మన పాలకులు సరిగ్గా పట్టించుకోవడం లేదు. అసలు వారి గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఇదేమి వైపరీత్యం! విచారకరమైన విషయమేమిటంటే దేశ ఆర్థికాభివృద్ధిలో తమ పాత్ర ఏమిటో సగటు ప్రవాసులకు సైతం తెలియదు, అటువంటి అవగాహనశక్తి వారికి లేదు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ కష్టకాలంలో విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చుకునేందుకు నానా కష్టాలు పడుతుంటాయి. భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే విదేశాలలోని భారతీయ శ్రామికులు, వృత్తి నిపుణులు మొదలైనవారు మాతృదేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని దండిగా సమకూరుస్తున్నారు. జీడీపీలో 1శాతం కూడా ఉండని విదేశీ పెట్టుబడులకు సర్వం దాసోహమంటున్న దేశీయ ప్రభుత్వాలు, మూడు శాతానికి పైగా నిధులు తీసుకువస్తున్న ప్రవాసులను నిరాదరిస్తున్నాయి. ప్రోత్సాహం దేవుడికెరుక, కనీసం ప్రవాస భారతీయ పెట్టుబడిదారుల సాధకబాధకాలనూ వినడం లేదు. వినేందుకు శ్రద్ధ చూపడం లేదు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అనే నానుడి తెలుగు ప్రవాసుల విషయంలో మరింత నిజం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 03:16 AM