Share News

ఆశ నిరాశల నడుమ ఇరాన్‌–అమెరికా చర్చలు

ABN , Publish Date - Apr 22 , 2026 | 01:51 AM

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరామం ఈ రోజు (బుధవారం 22, ఏప్రిల్)తో ముగియనున్నది. మరుసటి రోజు (గురువారం) నుంచి అరేబియా సముద్ర జలాలలో ఉత్పన్నమయ్యే పరిణామాలు ఒక్క పశ్చిమాసియాపైనే కాకుండా...

ఆశ నిరాశల నడుమ ఇరాన్‌–అమెరికా చర్చలు

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరామం ఈ రోజు (బుధవారం 22, ఏప్రిల్)తో ముగియనున్నది. మరుసటి రోజు (గురువారం) నుంచి అరేబియా సముద్ర జలాలలో ఉత్పన్నమయ్యే పరిణామాలు ఒక్క పశ్చిమాసియాపైనే కాకుండా సమస్త దేశాలపై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా యుద్ధానికి దిగిన దరిమిలా నెలకొన్న సంక్షోభ పరిస్థితులలో ఇరాన్‌, అమెరికా మధ్య శాంతి చర్చలు జరగడమే విశేషం కాగా ఆ చర్చలు రెండోసారి జరిగేందుకూ అవకాశం ఉండడం ఒక ఆశాజనకమైన విషయం. అయితే ఇస్లామాబాద్‌లో జరిగే ఈ రెండో విడత చర్చలకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని ఈ వ్యాసం రాస్తున్న సమయంలో కూడా ఇరాన్ అంటున్నది. అయినప్పటికీ, చైనా నుంచి వస్తున్న తమ నౌక నొకదాన్ని దిగ్బంధం చేసిన అమెరికాపై ఇరాన్‌ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. ఆ దిగ్బంధం సందర్భంగా మరో చమురు నౌక కూడా అరేబియా సముద్రంలో అమెరికన్ యుద్ధ నౌకలను దాటి ఇరాన్ ప్రాదేశిక జలాలలోకి సురక్షితంగా చేరుకోవడాన్ని పరిశీలిస్తే, శాంతి చర్చలకు ఆస్కారముందనే భావన కలుగుతోంది. అమెరికా సైతం తాము శాంతి చర్చలకు సంసిద్ధమని ప్రకటించింది. అయితే ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న హెచ్చరికలు, బెదిరింపులు, కవ్వింపు వ్యాఖ్యలు శాంతి చర్చల పట్ల అమెరికా చిత్తశుద్ధిని శంకిస్తున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నాయకత్వంలో అమెరికా ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు బయలుదేరిందని ఒకసారి, బయలుదేరనున్నదని మరోసారి చెప్పడం ద్వారా ట్రంప్‌ మహాశయుడు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. దౌత్య మర్యాదలకు అనుగుణంగా ఇరాన్‌ వ్యవహరిస్తుండగా, పరస్పర పొంతన లేని ట్రంప్‌ ప్రకటనల కారణాన అంతర్జాతీయ సమాజంలో అమెరికా నవ్వులపాలవుతోంది. ట్రంప్ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని నికరాగ్వా అధ్యక్షుడు ఓర్టేగా పరిహసించాడు.


ఇస్లామాబాద్‌లో రెండోసారి శాంతి చర్చలు సఫలమైనా, విఫలమైనా దాని ప్రభావం సమస్త ప్రపంచంపై పడుతుంది. ఎత్తుకు పై ఎత్తులతో జరిగే ఈ రకమైన సంగ్రామాలలో విజేతలు, పరాజితులు ఎవరనేది స్పష్టంగా చెప్పడం అంత సులువు కాదు. అయితే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధం పర్యవసానంగా ప్రపంచ సైనిక, రాజకీయ వ్యూహాలలో, మరీ ముఖ్యంగా ఇంధన, ఆర్థిక రంగాలలో పెనుమార్పులు అనివార్యమని ఇప్పటికే స్పష్టమయింది. ఈ యుద్ధం వలన పశ్చిమాసియా నుంచి చమురు ఎగుమతులకు సముద్ర మార్గాలలో ఎదురవుతోన్న అంతరాయం మూలంగా అంతర్జాతీయ విపణి మున్నెన్నడూ లేని రీతిలో ప్రతికూల ప్రభావానికి లోనవుతోంది. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం చమురు చరిత్రలోనే అతి పెద్ద సంక్షోభం అని ప్రపంచ ఇంధన సంస్థ వ్యాఖ్యానించిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. చమురు ధరల పెరుగుదలతో అమెరికాతో సహా సమస్త దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఏ దేశమూ ఈ విపత్కర పరిస్థితిని భరించగల స్థితిలో లేదు.

ఈ యుద్ధంతో అమెరికా అగ్రరాజ్య ఆధిపత్యం బీటలు వారుతోంది. మధ్యప్రాచ్య దేశాలలో అమెరికా యుద్ధాలకు అండగా నిలుస్తూ వచ్చిన నాటో దేశాలు.. ఇరాన్ విషయంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు నిక్కచ్చిగా నిరాకరిస్తున్నాయి. చిరకాల మిత్ర దేశాల ఈ వైఖరిపై అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిస్సహాయత మారుతోన్న సమీకరణలకు సంకేతం. అమెరికా ఆత్మీయ దేశం ఇజ్రాయెల్ సైతం తన సంప్రదాయక మిత్ర (యూరోపియన్‌) రాజ్యాల మద్దతును క్రమేణా కోల్పోతోంది. ఇరాన్ యుద్ధంతో బంగ్లాదేశ్ నుంచి బ్రెజిల్ దాకా అన్ని దేశాలు పెట్రోల్‌, డీజిల్, ఎరువులు మొదలు ఔషధ ఉత్పాదక రసాయనాల వరకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇది గల్ఫ్, అరబ్బు దేశాల ప్రాముఖ్యాన్ని చాటి చెబుతోంది.


ఇస్లామాబాద్‌లో మళ్లీ శాంతి చర్చలు జరుగుతాయా లేదా, జరిగినా ఫలప్రదమవుతాయా లేదా అనేది అటుంచితే చర్చలకు వేదిక కావడం ద్వారా పాకిస్థాన్ అన్ని విధాలా తన పలుకుబడిని పెంచుకున్నది. ట్రంప్ అస్మదీయుల వ్యాపార కార్యకలాపాలకు చేయూతనివ్వడం ద్వారానే శాంతి చర్చలకు పాకిస్థాన్‌ వేదిక అయిందన్నది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. అరబ్బు ప్రపంచంలో మసకబారిన తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికి ఈ శాంతి చర్చలు పాకిస్థాన్‌కు ఒక చక్కటి అవకాశం కల్పించాయి. చైనా మద్దతు, కీలక అరబ్‌ దేశాల, అమెరికా అండదండలతో పాటు ఇరాన్ తనను విశ్వసించడం కూడా పాకిస్థాన్‌కు బాగా కలిసివచ్చింది. ఏమైనా ఇరాన్ సంక్షోభం పాకిస్థాన్‌ ఉన్నతికి దోహదపడిందనేది భారత్‌కు ఒక చేదు నిజమే.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం

విజిల్ రెవల్యూషన్‌‌కు పిలుపు.. టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ

Updated Date - Apr 22 , 2026 | 01:51 AM