యుద్ధవేళ.. భారత్ ప్రయోజనాలే ముఖ్యం
ABN , Publish Date - Mar 11 , 2026 | 02:19 AM
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఉధృతమవుతోంది. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తోన్న ఈ యుద్ధం అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా...
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఉధృతమవుతోంది. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తోన్న ఈ యుద్ధం అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంపైన అంతో ఇంతో ప్రతికూల ప్రభావం చూపుతోంది.
అమెరికా విదేశాంగ విధానంలోని నిర్హేతుకతను ఈ యుద్ధం బహిర్గతం చేసింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకార వైఖరి మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. రష్యా, చైనాతో సహా అనేక దేశాలు గత పది రోజులుగా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒక వైపు ఇరాన్‌తోను, మరోవైపు గల్ఫ్ దేశాలు, అమెరికాతో ఉన్న సంబంధాలే ప్రస్తుత సందర్భంలో భారత్ దౌత్యనీతిని ప్రభావితం చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఉత్పన్నమైన ప్రతిసారీ భారత్ ఒక నైతిక సవాల్ నెదుర్కోవలసివస్తోంది. 1980 దశకంలో ఇరాన్–ఇరాక్ యుద్ధంలో భారత్ తటస్థ పాత్ర పోషించినా, సద్దాం హుస్సేన్ వైపే సానుకూలత చూపింది. అయితే సద్దాం 1990 దశకం తొలినాళ్లలో కువైట్‌ను దురాక్రమించినప్పుడు మొదలైన గల్ఫ్ యుద్ధంలో ఇరాక్‌కు వ్యతిరేకంగా నిలబడింది. అందుకు దేశ ఆర్థిక ప్రయోజనాలే ముఖ్య కారణం. ఆ యుద్ధం సందర్భంగా ఇరాక్‌పై దాడులకు ఫిలిప్పీన్స్ నుంచి గల్ఫ్‌కు వెళ్లే అమెరికా యుద్ధ విమానాలకు భారత్‌లో ఇంధనం నింపడానికి నాటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిపై పార్లమెంటు లోపల, బయట ఆ ప్రభుత్వంపై పెనుదుమారం చెలరేగింది. చమురు నిల్వలు దాదాపు అంతరించి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతున్న రోజులవి. బ్రిటన్, స్విట్జర్లాండ్‌కు 67 టన్నుల బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి రుణం తీసుకోవలసినంత అగత్యమేర్పడిన సందర్భమది. చంద్రశేఖర్ ప్రభుత్వం అలీనోద్యమ విధానాలకు విరుద్ధంగా అమెరికాకు సహాయం చేయడాన్ని నాటి ప్రతిపక్ష నేత రాజీవ్‌గాంధీ తీవ్రంగా గర్హించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింపజేసింది. ఈ పరిణామాల ఫలితంగా గల్ఫ్ దేశాల దౌత్యవేత్తలు రాజీవ్‌గాంధీని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. అప్పటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా దేశ ఆర్థిక వ్యవస్థ నిజ పరిస్థితిని ప్రతిపక్షాలకు లోపాయికారీగా వెల్లడించి గల్ఫ్ దేశాలకు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకతను వివరించారు. కొన్ని వారాల తర్వాత కువైట్ నుంచి ఇరాక్ సేనలు వెనక్కి వెళ్లిపోయే సమయానికి అమెరికా విమానాలకు భారత్‌లో ఇంధనం నింపే వెసులుబాటును కేంద్రం విరమించింది. ఆ యుద్ధం రోజుల్లో గల్ఫ్ దేశాలలో జీవనోపాధి పొందుతున్న భారతీయులు 20 లక్షల మంది దాకా ఉండేవారు. అప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందవల్సిన దుస్థితిలో ఉన్నది. నేడు భారత్ ఖజానాలో దాదాపు 750 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి.
అప్పుడైనా ఇప్పుడైనా దేశ ఆర్థిక ప్రయోజనాలే ప్రభుత్వానికి కీలకమైనవి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గల్ఫ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భాలలో అవి దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వ్యవహరించాయి. ఈ రోజు కోటి మంది భారతీయులు అమెరికా మిత్ర రాజ్యాలైన గల్ఫ్ దేశాలలో జీవనోపాధి పొందుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్నారంటే అందుకు 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణమనడం సత్యదూరం కాదు. గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులలో ఒంటెల కాపరులు మొదలు, వైద్యుల దాకా అనేక వృత్తులవారు ఉన్నారు. గల్ఫ్ దేశాలలో మన వాణిజ్య ప్రయోజనాలూ విశేషంగా ఉన్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి చమురు ఒక ప్రాథమిక అవసరం. తనకు అవసరమైన చమురులో దాదాపు 85 శాతాన్ని గల్ఫ్ దేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. రోడ్లపై వాహనాల నుంచి పంట పొలాలకు అవసరమైన యూరియా, వంటగదులలో వినియోగించే గ్యాస్, ఇతరత్రా అనేక పరిశ్రమలకు అవసరమైన సామగ్రి, రసాయానాలు ఈ చమురు నుంచే లభిస్తాయి. యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే మన దేశంలోని రెస్టారెంట్లు ఆందోళన చెందుతున్నాయంటే గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులు నిలిచిపోతే ఏర్పడే పరిస్థితిని ఊహించుకోవచ్చు. పీపా చమురు ధర ఒక డాలర్ చొప్పున పెరిగినా భారత్ అదనంగా రూ. 16 వేల కోట్లు నష్టపోతుంది. ఇది విస్మరించలేని వాస్తవం. ఐరోపా, అమెరికా, ఇంకా ఆఫ్రికా విమానయానానికి కూడా గల్ఫ్ దేశాల గగనతలం కీలకవారధిగా ఉండడంతో భారతీయ విమానయానం అతలాకుతలమైంది. ఇరాన్ చమురుపై కీలకంగా ఆధారపడ్డ చైనా, ఇరాన్ ఉత్పాదక డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్న రష్యాకు లేని తొందరపాటు భారత్‌కు ఉండకూడదు.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి..
సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం... ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ
నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు