Share News

అమెరికా.. అడకత్తెరలో పోకచెక్క

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:21 AM

‘జడలు విచ్చిన, సుడులు రెచ్చిన/ కడలి నృత్యం శమిస్తుందా?/ నడుమ తడబడి, సడలి, ముడుగక/ పడవ తీరం క్రమిస్తుందా?’ – పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ గతిని గమనిస్తుంటే ద్వితీయ ప్రపంచ యుద్ధ సంగ్రామ...

అమెరికా.. అడకత్తెరలో పోకచెక్క

‘జడలు విచ్చిన, సుడులు రెచ్చిన/ కడలి నృత్యం శమిస్తుందా?/ నడుమ తడబడి, సడలి, ముడుగక/ పడవ తీరం క్రమిస్తుందా?’ – పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ గతిని గమనిస్తుంటే ద్వితీయ ప్రపంచ యుద్ధ సంగ్రామ కాలంలో మహాకవి మానవీయ సందేహాలు మనకూ తప్పక తలపునకు వస్తాయి. అప్పుడు ఆయనలాగానే ఇప్పుడు మనమూ ‘నిజంగానే, నిజంగానే?’ అని ప్రశ్నించుకోవడం అనివార్యమవుతోంది.

‘హోర్ముజ్ జలసంధి సంక్షోభ పరిష్కారానికి– ఇజ్రాయెల్‌ను సార్వభౌమ దేశంగా గుర్తిస్తూ, దానితో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ఉద్దేశించిన అబ్రహం ఒడంబడికకు.. కీలకమైన ముస్లిం దేశాలన్నీ సామూహికంగా తమ సమ్మతి వ్యక్తీకరించాలి’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో పశ్చిమాసియాలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ట్రంప్‌ పిలుపు అరబ్‌ దేశాలకు పుండుపై కారం చల్లినట్లయింది. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు కాకుండా, ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి అరబ్బు, ముస్లిం దేశాలు సిద్ధంగా లేవు. అందుకే అబ్రహం ఒడంబడికకు అవి సానుకూలంగా లేవు. పొరుగున ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లకు ఇజ్రాయెల్‌తో మొదటి నుంచీ దౌత్య సంబంధాలు ఉన్నాయి. 2016లో ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ సహా మరికొన్ని ఇతర దేశాలు ఈ ఒడంబడిక ద్వారా యూదు దేశంతో సఖ్యతకు స్నేహ హస్తం చాచాయి. అయితే గాజాలో ఇజ్రాయెల్‌ పాల్పడిన దారుణ మారణకాండ అనంతరం ఏ అరబ్బు లేదా ముస్లిం దేశమూ ఇజ్రాయెల్‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవడం అంత సులువు కాదు. గాజాలో ఘోరాలపై అరబ్బులలో పెల్లుబికిన అగ్రహావేశాలే అందుకు కారణం.

ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా తనపై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆ దేశాలపై నేరుగా కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగమైన దుబాయిపై ప్రతి దాడులు చేసింది. గత ఫిబ్రవరి ఆఖరిరోజున ప్రారంభమై కొనసాగుతున్న ప్రస్తుత యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది దుబాయి ఎమిరేట్‌. అయినా దానికి సహచర అరబ్‌ సమాజం నుంచి ఎలాంటి సంఘీభావం లభించలేదు. ఎలాంటి సహాయమూ అందలేదు. అబ్రహం ఒడంబడికలో యూఏఈ భాగస్వామి కావడమే అందుకు ప్రధాన కారణం.


ఈ నేపథ్యంలో.. అబ్రహం ఒడంబడికలో విధిగా చేరితీరాలని గల్ఫ్, ఇరాన్‌లతో పాటు ఇతర ప్రధాన ముస్లిం దేశాలపై ఒత్తిడి చేస్తూ ఈ ఒప్పందాన్ని హోర్ముజ్ జలసంధి సంక్షోభ ముగింపునకు ట్రంప్‌ ముడివేయడంతో పరిష్కార మార్గాలు మరింతగా మూసుకుపోయాయి. శాంతి సాధన పరిస్థితులు మరీ సంక్లిష్టమయ్యాయి. అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తలు ఖతార్‌లో సమావేశమై చర్చలను ఒక కొలిక్కి తీసుకువస్తున్నారని అనుకున్న దశలో ఇజ్రాయెల్ ఒత్తిడితో ట్రంప్ ఆ ప్రకటన చేశారనేది బహిరంగ రహస్యం. అనూహ్యంగా అబ్రహం ఒడంబడికను తెరమీదకు తీసుకురావడంతో ఇప్పటి వరకు పశ్చిమాసియా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా క్రియాశీలక పాత్ర పోషించిన పాకిస్థాన్‌ సైతం వెనక్కి తగ్గవల్సి వచ్చింది. ఇరాన్‌తో యుద్ధం నుంచి వీలైనంత త్వరగా సగౌరవంగా బయటపడాలని అమెరికా ఆరాటపడుతుండగా ఆప్తమిత్ర దేశమైన ఇజ్రాయెల్ దాన్ని అడ్డుకుంటోంది. శత్రువును జయించలేక, ఆప్తుడిని అదుపు చేయలేక అమెరికా సతమతమవుతోంది. అమెరికా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఇజ్రాయెల్‌ కారణాన అరబ్బులలో అమెరికా ప్రతిష్ఠ మసకబారింది.

అమెరికాతో ఏ రకమైన శాంతి ఒడంబడిక కుదుర్చుకున్నా అందులో లెబనాన్ అంతర్భాగమని ఇరాన్ స్పష్టం చేయగా, అమెరికా – ఇరాన్ శాంతి చర్చలతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. పైగా లెబనాన్‌లో దాడులను ఉధృతం చేసింది. తద్వారా యుద్ధం కొనసాగింపునకు తాను సుముఖంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ సంకేతాలిచ్చింది. దక్షిణ లెబనాన్‌తో పాటు రాజధాని బెరూట్‌లోని కొన్ని ప్రాంతాలలో హెజ్బొల్లా ప్రాబల్యం అధికంగా ఉన్నది. మరి హెజ్బొల్లా అనేది ఇరాన్‌కు ఆప్త గెరిల్లా సాయుధ దళం. లెబనాన్‌లో దాడులకు నిరసనగా తాము చర్చల నుంచి వైదొలుగుతున్నట్లుగా ఇరాన్ ప్రకటించిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని బ్రతిమాలి తాత్కాలికంగా దాడులను నిలిపివేయించారు. అయితే ఇది తాత్కాలికమని మరచిపోకూడదు.


అరబ్బు– ఇజ్రాయెల్ వైరం కొత్తదేమీ కాదు. గల్ఫ్– ఇరాన్ ప్రచ్ఛన్న యుద్ధం కూడా కొత్తదేమీ కాదు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఇది ఒక కొత్త, ఆకస్మిక ఘటన కాగా, దాన్ని అమెరికా అబ్రహం ఒడంబడికతో ముడిపెట్టడం పిడుగుపాటు లాంటి అనూహ్య పరిణామం. అరబ్‌, ముస్లిం దేశాలకు అవమానకరమైన పరిస్థితి. ఈ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే అవకాశాలు కనిపించడం లేదు. పశ్చిమాసియాలోని రాజకీయ సమీకరణాలు, దౌత్య వ్యూహాలతో ప్రత్యక్ష సంబంధం లేని అనేక దేశాల అవసరాలు హోర్ముజ్ జలసంధితో ముడిపడి ఉన్నాయి. ఇజ్రాయెల్‌, ఇరాన్ వ్యూహ ప్రతివ్యూహాలతో అవి భారీ నష్టాలను చవిచూస్తుండగా, అమెరికా నిస్సహాయంగా చూస్తుండిపోతోంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 12:21 AM