అంతర్వేద
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:03 AM
ఎన్నటికీ ఎరకపడని ఎదలోతుల ఆవరణలో మిణుకుమనె ముత్తెపు తళుకు కవిత్వం ఏ కల్పనకందని సీకటి పందిరి కొమ్మున పూసిన మిణుగురు పూత...
ఎన్నటికీ ఎరకపడని ఎదలోతుల ఆవరణలో
మిణుకుమనె ముత్తెపు తళుకు కవిత్వం
ఏ కల్పనకందని సీకటి పందిరి కొమ్మున పూసిన
మిణుగురు పూత
గులకరాతి గూటిన వదిగిన గువ్వ పదాలకు
ఎగిసిపడే ఎన్నెల దుబ్బ ఇసుకరేనువు
రాతిమెట్ల దిగుడుబాయి మోటదరి
లేత మొలకనవ్వుల తొలకరి మండె
పాదెక్కడో తెలియని మహానంది తీర్థపు బుగ్గల నీటి ధార
చాపిన దోసిలి నిండా వగరు తేనియలొంపె
సుగంధిపాల సురభేశ్వరకోన
అలరింపులతోనో ఈసడింపులతోనో అలసటతోనో
ఆవరించిన దిగులును ఆవలకు సులువుగా నెట్టే
అంతర్వేద పయనపు తెరచాప కవిత్వం
కాలపు కవనపు నదివై సాగాలంటే
ఉన్నచోటనే ముకలమేసుకుంటే కుదరదు
నిన్ను నీవు మరిసే బయలయి పయనించాలి
గమనింపులోకి రాని మురిపాలను గాలిస్తూ నడిసిపోవాలె
కొండలపై కొలువయిన పుప్పొడిగంధాల సంపదనందుకొని
నిలుపుకునే పసితనం కాపాడుకోవాలి
నీ పదములెల్ల తడి చెమ్మ జాలువారాలంటే
ఏ కన్నీరు గాంచిన నీవు కన్నీరవ్వాలి
పసరులూరే లేతీగల పొదరింటి తోవలలో
నీవొక తుమ్మెద నాదువై కదలాడుతుంటే
ఏదో పరసవేది నీ పొడివాక్యాలకు జీవశక్తినద్దుతుంది
ముళ్లజగ్గలు కాశగడ్డి తావులు
అవలీలగా గాలించే తోవ నీదయితే
నేల గరుకుతనం సైతం నింగి మబ్బంత మెత్తనయి
నీ పాదాలను తడుముతుంది
కదిలే నీడలరూపాలేవో వడిలోకి తీసుకొని
లాలించి వేలుపట్టి నడిపిస్తాయి
పాలకొండ ఎరుక వాలులలో ఎగురకనే
జారె కస్తూరి జింకల మైకపు కదలికల అడుగులుంటె
పద్యం మాగిన ఉసిరి దీపంల వెలుగులీనుతుంది
జిద్దుతో గాలిని కవ్వించే తాటి ఫించాల వంటిమాను చెంత
కౌండిన్య ఉపాసకుడవై మోకరిల్లితే
తడబాటులేని వచనం నెలవంక నురగల
నీ దోసిలిరేఖలో పొంగుతుంది
భూమి పొరలలో వేర్ల మునివేళ్ళతో
ఏ హద్దులు లేక సాగే చెట్ల పాదాలపై
తలవంచి వాటి లోగొంతుక
సంభాషణ వింటే
నీ కవిత సరలిత ఆరామమై అలరిస్తుంది
కొండంత పాండిత్యం నీ సొంతమైన పొసరుగాలుల
పూలరేకులు ఊగినట్టు మనసూగాలంటే
నీ అల్లిక అలతి అలతి పదాల మల్లిక కూర్పయి కులుకాలి
కావ్యరాశుల తిరగవేయటం
మున్నేటి దారుల ఆరాధన విధేయమే కాని
అన్నిటిని మరసి బరువులేని
పుప్పొడి పిట్టవయి ఎగిరె
ఏమెరుకలేని నీ వెర్రిలోక గమనంలోనే
పలవరింతల పదములెన్నో జనించి
నిన్ను తుళ్లింతలాడిస్తాయి
నడకని, తెలియని పసిపాప
ముద్దారు నడక లాంటిది కద
కవనం.
గోరటి వెంకన్న
ఇవి కూడా చదవండి..
టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ
పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్