Share News

జల రాజకీయాలతో రాష్ట్రాల మధ్య చిచ్చు!

ABN , Publish Date - Jun 26 , 2026 | 02:10 AM

మహానది–గోదావరి నదుల అనుసంధానం, గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కేవలం రాజకీయలబ్ధి కోసం భయాందోళనలు సృష్టించడం సరైనది కాదు (‘నదుల అనుసంధానం...

జల రాజకీయాలతో రాష్ట్రాల మధ్య చిచ్చు!

మహానది–గోదావరి నదుల అనుసంధానం, గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కేవలం రాజకీయలబ్ధి కోసం భయాందోళనలు సృష్టించడం సరైనది కాదు (‘నదుల అనుసంధానం... తెలంగాణ హక్కులకు విఘాతం’– 13.06.2026). నదుల అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ప్రణాళిక. ఇది కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు, దేశవ్యాప్త జలవనరుల నిర్వహణలో భాగం.

మహానది–గోదావరి అనుసంధానం కేవలం రెండు నదుల కలయిక కాదు. అది దేశ జల భద్రతకు, వ్యవసాయాభివృద్ధికి, ప్రాంతీయ అసమానతల నివారణకు పునాది వేసే మహత్తర జాతీయ యజ్ఞం. వరద నీటిని వృథా కాకుండా వినియోగంలోకి తేవడం, కరువును తగ్గించడం, భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రాజకీయ భేదాలకు అతీతంగా కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మహానది నుంచి గోదావరికి ప్రవహించే జలధారలు దేశాభివృద్ధికి బాటలు వేస్తాయి. గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టును ‘ఏపీ కుట్ర’గా, తెలంగాణకు ‘జలద్రోహం’గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం హరీశ్‌రావు దివాలాకోరు రాజకీయానికి నిదర్శనం. గోదావరి–కావేరి అనుసంధానం అనేది నిన్న మొన్నటి ఆలోచన కాదు. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న జాతీయ జల విధానంలో భాగం. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న మిగులు జలాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించాలన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్రాలు, జలవనరుల నిపుణులు, ట్రిబ్యునళ్ల నిర్ణయాలు, చట్టబద్ధ అనుమతులు ఉంటాయి.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత. అట్లాగే ఆంధ్రప్రదేశ్ తనకు చట్టబద్ధంగా దక్కిన జలాలను వినియోగించుకోవడం కూడా ఆ రాష్ట్ర హక్కు. నదీ జలాల విషయంలో హక్కులు, చట్టాలుంటాయి తప్ప, ఆరోపణలు కాదు. ప్రతి ఏడాది 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకోవాలని కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ప్రయత్నాన్ని ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా చలి కాచుకొనేందుకు ఉపయోగించుకోవాలని హరీశ్‌రావు ప్రయత్నం. ప్రజలకు జల యుద్ధం కాదు, జల ప్రయోజనం కావాలి. జలాలపై అగ్ని జ్వాలలు రాజేయడం సులభం, కానీ జలాలను రైతుల పొలాల్లోకి తీసుకురావడమే నిజమైన నాయకత్వం!


కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులకు గోదావరి జలాల వినియోగ హక్కులను తెలంగాణ ఇప్పటికే పొందింది. కావేరి– గోదావరి లింక్ వల్ల తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీరు కూడా తగ్గదని కేంద్ర సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని అంటున్న హరీశ్‌రావు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి: తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పెరిగిన జల వివాదాలకు మీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేదు? వృథాగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతే తెలంగాణకు లాభమా? రైతుల పొలాలకు చేరితే నష్టమా?

మిగులు జలాలను సద్వినియోగం చేసి రైతులకు, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించడం నిజమైన జల విధానం. రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులను ప్రాంతీయ విద్వేషాలతో అడ్డుకోవడం కాదు. తెలంగాణా ప్రభుత్వం గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే నిర్మించింది. ఇంకా, గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు కూడా నిర్మించినట్లయితే 85 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకోవచ్చు. దాని ద్వారా వచ్చే 330 టీఎంసీలు పవర్ ప్రాజెక్టు కోసం డిజైన్ చేశారు. ఈ నీటిని కృష్ణాతో అనుసంధానం చేసుకోవచ్చు. తెలంగాణలో కరువు అంటూ ఉండదు. ఇప్పటి ప్రభుత్వం అయినా ఈ ప్రాజెక్టుపై ఆలోచన చేయాలి.

తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా సెంటిమెంట్‌ను రగిలించడమే లక్ష్యంగా కేసీఆర్‌ కుటుంబం జల రాజకీయం చేస్తోంది. సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలనే దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాడుకుంటాం అంటుంటే తెలంగాణకు వచ్చిన నష్టం ఏమిటో అర్థం కావడం లేదు. వృథాగా పోతున్న గోదావరి నీళ్లను తరలించడం ద్వారా పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాలు తీర్చి, రాయలసీమను కరువు రక్కసి నుంచి కాపాడాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే గోదావరి నుంచి 200 టీఎంసీలు నల్లమల ప్రాజెక్టుకు తరలించడం ద్వారా కృష్ణా నీటిపై ప్రెషర్ తగ్గుతుంది. ఆ నీటిని తెలంగాణాకు కూడా వాడుకోవచ్చని చంద్రబాబు అన్నారు. కానీ, ఇవేవీ హరీశ్‌రావుకు అవసరం లేదు. తెలంగాణలో ప్రస్తుతం జీరోగా మారిన కేసీఆర్ కుటుంబం చంద్రబాబును బూచిగా చూపెట్టి రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నది. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ఉపయోగించుకోగా మిగిలిన నీరు మాత్రమే కిందకు పోతుందన్న ఇంగితం కూడా లేకుండా హరీశ్‌రావు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇక మానుకోవాలి.

నెల్లూరు దుర్గాప్రసాద్

టీడీపీ అధికార ప్రతినిధి, తెలంగాణ

ఈ వార్తలనూ చదవండి:

పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం

వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..

Updated Date - Jun 26 , 2026 | 02:10 AM