పోలియో పీడితుల పాలిట దేవుడు
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:44 AM
ప్రముఖ ఎముకల వైద్యులు, సమాజ సేవకులు, పద్మశ్రీ పురస్కృతులు డా. ఆదినారాయణరావు మృతి ప్రజలకు తీరని లోటు. సమాజానికి, ముఖ్యంగా పోలియో వ్యాధిగ్రస్తులకు చేసిన సేవలే...
ప్రముఖ ఎముకల వైద్యులు, సమాజ సేవకులు, పద్మశ్రీ పురస్కృతులు డా. ఆదినారాయణరావు మృతి ప్రజలకు తీరని లోటు. సమాజానికి, ముఖ్యంగా పోలియో వ్యాధిగ్రస్తులకు చేసిన సేవలే ఆయనకు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డును తెచ్చి పెట్టాయి. స్థానికంగా విశాఖపట్నంలో అందించిన నిర్విరామ వైద్యసేవలే కాకుండా, దేశవ్యాప్తంగా ఆయన నిర్వహించిన శిబిరాలు, లక్షలాది శస్త్ర చికిత్సలు ఆయా బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపాయి. ఆయన గురువు, ఆంధ్రా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, ప్రముఖ ఎముకల వైద్యులు డా. వ్యాఘ్రేశ్వరుడు కేజీహెచ్‌లో పోలియో పీడితుల కోసం ఒక నూతన శస్త్రచికిత్సా విధానాన్ని కనిపెట్టారు. ఐదు, పది నిమిషాలు పట్టే ఆ విధానం పూర్తిగా నడక సాధ్యం కాని రోగులకు వరంగా మారింది. వారి నడక మెరుగైంది. అదే విధానాన్ని మెరుగుపరచి, దేశవ్యాప్తంగా శిబిరాల నిర్వహణతో విస్తృతపరచడం ద్వారా ఆదినారాయణ రావు లక్షలాది రోగులకు బతుకు భరోసానిచ్చారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక రోజు శిబిరంలో వెయ్యి సర్జరీలు జరిగేవి. అలాంటివి ఒక విడతలో ఆరేడు జరిగేవి. అన్నీ ఆయనే చేసేవారు, అలుపు లేకుండా. ఆ వయసుకి అలా చేయగలగడం ఆశ్చర్యం అనిపించేది.
నేను ఎనస్థీషియా పీజీగా ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ డా. నారాయణమూర్తి ఒకసారి ఆయనతో వెళ్ళడం కుదరక నన్ను పంపారు. నేను ఆయనతో బాటు వేలాది శస్త్రచికిత్సల్లో పాల్గొన్నాను. మంచి మానవీయ అనుభవం, అదృష్టం అది. వృత్తి పరంగానే కాకుండా సేవా, సామాజిక కోణాల్లో పాఠాలు నేర్పిన ప్రధాన ఘట్టం. ఆ తర్వాత ఇంకో విడత కూడా ఆయనతో క్యాంపులో పాల్గొన్నాను. భాషా, ప్రాంత భేదాలు లేకుండా వివిధ రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా పోలియో పీడితులు, వారి బంధువులు ఆయన్ని దేవుడిలా చూసేవారు.
డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ
ఇవి కూడా చదవండి
8 యుద్ధాలను ఆపాం.. దావోస్‌లో ట్రంప్ పాతపాట
విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత