Share News

అలల కింద అదృశ్య యుద్ధం

ABN , Publish Date - May 07 , 2026 | 02:30 AM

ఇంటర్నెట్‌ ద్వారా మనం రోజూ చేసే ప్రతి ఆన్‌లైన్ చెల్లింపు, ప్రతి వీడియో కాల్, ప్రతి ఈమెయిల్... ఇవన్నీ ఎలా వీలవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? సమాధానం ఆకాశంలో లేదు. మన పాదాల కింద కూడా..

అలల కింద అదృశ్య యుద్ధం

ఇంటర్నెట్‌ ద్వారా మనం రోజూ చేసే ప్రతి ఆన్‌లైన్ చెల్లింపు, ప్రతి వీడియో కాల్, ప్రతి ఈమెయిల్... ఇవన్నీ ఎలా వీలవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? సమాధానం ఆకాశంలో లేదు. మన పాదాల కింద కూడా లేదు. సముద్రం అడుగున ఉంది. ప్రపంచ ఖండాలను కలిపే గాజు తంతుల అదృశ్య వలయం ఒకటి అక్కడ పనిచేస్తోంది. ఆ తంతులే నేడు యుద్ధం నేపథ్యంలో పెనుముప్పులో పడ్డాయి.

ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు అనే గాజు తంతుల ద్వారా డేటా కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. కానీ ఈ కేబుళ్లు సముద్రం అడుగున, కొన్ని చోట్ల ఎనిమిది వేల మీటర్ల లోతున, బహిరంగంగా పడి ఉన్నాయి. అదే వాటి బలమూ, అదే వాటి బలహీనత కూడా.

ప్రపంచవ్యాప్తంగా ఆరు వందలకు పైగా ఇలాంటి సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలు పద్నాలుగు లక్షల కిలోమీటర్ల మేర పరుచుకుని ఉన్నాయి. అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో తొంభై ఐదు శాతం వీటి గుండానే ప్రవహిస్తోంది. బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్ ఆర్డర్లు, ప్రభుత్వ సందేశాలు, రక్షణ సమాచారం... అన్నీ ఈ తంతులపైనే ఆధారపడి ఉన్నాయి. ఉపగ్రహాల వాటా అయిదు శాతం కూడా దాటదు. లోతైన సముద్రంలో ఒక కేబుల్ తెగితే, దాన్ని వెతికి పట్టుకోవడానికే వారాలు పడుతుంది. మరమ్మతు చేసే ప్రత్యేక నౌకలు ప్రపంచంలో వేళ్లపై లెక్కపెట్టగలిగినన్ని మాత్రమే ఉన్నాయి. ఇంత పెళుసుదైన మౌలిక వ్యవస్థపై మన మొత్తం ఆర్థిక వ్యవస్థ నిలబడి ఉందని ఊహిస్తే గుండె ఝల్లుమంటుంది.

ఇరాన్‌ను అరేబియా ద్వీపకల్పం నుంచి వేరు చేసే హోర్ముజ్ జలసంధి కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఓ ఇరుకైన నీటిమార్గం. ఒకప్పుడు చమురు రవాణాకు చోక్‌ పాయింట్‌గా ఉండేది. ఇప్పుడు అది డేటా చోక్‌ పాయింట్ కూడా అయింది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, యూరప్, తూర్పు ఆఫ్రికాలను కలిపే అనేక సముద్రగర్భ కేబుళ్లు ఈ సందు గుండానో, దాని పక్క నుంచో వెళ్లక తప్పదు. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆంక్షలు, సైనిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ జలసంధి కింద పడి ఉన్న కేబుళ్లు పెద్ద టార్గెట్‌గా మారాయి.

2024 మొదట్లో ఎర్ర సముద్రంలో హౌతీ దళాలతో సంబంధం ఉన్న దాడులు అనేక సముద్రగర్భ కేబుళ్లను దెబ్బ తీశాయి. దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాలో గంటల తరబడి ఇంటర్నెట్ స్తంభించిపోయింది. ఆ తర్వాత నవంబర్‌లో బాల్టిక్ సముద్రంలో ఫిన్‌లాండ్, జర్మనీ, స్వీడన్, లిథువేనియాలను కలిపే రెండు కేబుళ్లు అనుమానాస్పదంగా తెగిపోయాయి. నాటో మిత్రదేశాలు దీన్ని ఉద్దేశపూర్వక చర్యగా, బహుశా రాజ్యం మద్దతుతో జరిగిన దాడిగా అభివర్ణించాయి.


హోర్ముజ్ ఇప్పుడు చమురు దారి మాత్రమే కాదు. డేటా దారి కూడా. అది మూసుకుపోతే ఆ ప్రాంతానికి అతీతంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలే కుదేలవుతాయి. ఇది భారత్‌కు సుదూర సమస్య కాదు. మన దేశ అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీలో దాదాపు పూర్తి భాగం సముద్రగర్భ కేబుళ్లపైనే ఆధారపడి ఉంది. మూడున్నర ట్రిలియన్ డాలర్లకు పైబడిన ఆర్థిక వ్యవస్థ, నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశానికి చెన్నై, ముంబై, కొచ్చి, తూత్తుకుడి వంటి కొద్దిపాటి తీర నగరాల్లో మాత్రమే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఉన్నాయి. వేళ్లపై లెక్కపెట్టగలిగిన ఈ చిన్న సంఖ్య శత్రువులకు కూడా బాగా తెలిసిందే.

యూరప్‌కు, మధ్యప్రాచ్యానికి, ఆఫ్రికాకు మన దేశం నుంచి వెళ్ళే అన్ని కేబుల్ మార్గాలూ అరేబియా సముద్రం గుండా, ఏడెన్ గల్ఫ్ గుండా.. హోర్ముజ్ జలసంధి సమీపం నుంచే వెళ్తాయి. అంటే అంతర్జాతీయంగా అత్యంత ఉద్రిక్త ప్రాంతాల పక్క నుంచే మన డిజిటల్ జీవనాడులు ప్రయాణిస్తున్నాయి. ఆ కారిడార్‌లో కాస్త ఆటంకం వచ్చినా చాలు, సామాన్యుడి వాట్సాప్ నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల వరకు, ప్రభుత్వ డిజిటల్ సేవల నుంచి సైనిక సమాచారం వరకు అన్నీ ప్రభావితమవుతాయి. మనం అద్భుతమైన డిజిటల్ నిర్మాణాన్ని కట్టుకున్నాం. కానీ దాని పునాది మాత్రం వివాదాస్పద జలాల గుండా వెళ్లే ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లపై ఉంది. అది ఎప్పుడూ లేనంత ప్రమాదంలో ఉంది. మరి, ఇప్పుడేం చేయాలి?

1) కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను విస్తరించాలి. ఇప్పుడు కొద్ది నగరాలకే పరిమితమై ఉన్న ఈ స్టేషన్లను తూర్పు, పశ్చిమ తీరాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లకూ తీసుకెళ్లాలి. ల్యాండింగ్ పాయింట్లు ఎక్కువగా, పంపిణీ విస్తృతంగా ఉంటే ఎక్కడో ఒకచోట అంతరాయం వచ్చినా, మొత్తం వ్యవస్థ స్తంభించదు. 2) హోర్ముజ్‌ను తప్పించుకుని వెళ్ళే ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలి. మధ్య ఆసియా గుండా భూ మార్గాన ఫైబర్ లైన్లు, దక్షిణ హిందూ మహాసముద్రం గుండా ప్రత్యామ్నాయ లోతైన నీటి కేబుళ్లు... ఇలాంటి కొత్త దారులలో భారత్ చురుగ్గా పెట్టుబడి పెట్టాలి. ఒకే గుర్రంపై మన అదృష్టాన్ని పందెం కాయకూడదు. 3) తక్కువ ఎత్తులో తిరిగే ఉపగ్రహ నెట్‌వర్క్‌ల (LEO) వ్యవస్థతో అవగాహన ఒప్పందాలు చేసుకోవాలి.


ఈ ఉపగ్రహాలు సముద్రగర్భ కేబుళ్లకు పూర్తి ప్రత్యామ్నాయం కాలేవు, నిజమే. కానీ అత్యవసర సమయంలో ప్రభుత్వ సేవలు, రక్షణ సమాచారం, ఆర్థిక లావాదేవీలు ఆగిపోకుండా చూడటానికి అవి కీలకమైన బ్యాకప్‌గా పనిచేస్తాయి. ఈ సన్నద్ధత ముందుగానే చేసుకోవాలి, సంక్షోభం వచ్చిన తర్వాత కాదు. 4) సముద్రగర్భ కేబుళ్లను దేశ కీలక మౌలిక వసతులుగా అధికారికంగా గుర్తించాలి. భారత్ ప్రత్యేక ఆర్థిక మండలంలో (EEZ) నౌకాదళం, తీరరక్షక దళం నిరంతరం గస్తీ తిరగాలి. కేబుల్ మార్గాల పక్కన అనుమానాస్పదంగా తిరిగే నౌకలపై నిఘా ఉంచాలి. 5) TRAI, టెలికాం శాఖ, నౌకాదళం, నిఘా సంస్థల సమాచారం ఒక్క చోటకు చేరే ఒక జాతీయ సముద్రగర్భ కేబుల్ భద్రతా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిదో ఎవరికీ తెలియదు. పర్యవేక్షణ లేకుండా రక్షణ ఎలా సాధ్యం? 6) క్వాడ్, జీ–20 వేదికల ద్వారా అంతర్జాతీయంగా దౌత్యపరంగా పనిచేయాలి. సముద్రగర్భ కేబుళ్ల రక్షణ కోసం ఒప్పందాలు, ప్రోటోకాళ్లను రూపొందించడంలో భారత్ ముందుండాలి.

డిజిటల్ శక్తిగా ఎదగాలనుకునే భారతదేశం ఈ కొద్దిపాటి కేబుళ్ల మీద తన మొత్తం భవిష్యత్తును మోపి నిశ్చింతగా ఉండరాదు. వేరే మార్గాలు, ఉపగ్రహ ప్రత్యామ్నాయాలు, నిఘా వ్యవస్థలు, దౌత్యపరమైన ఒప్పందాలు... అవసరం. ఇవన్నీ ఖరీదైనవే. కానీ మూడున్నర ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిమిషాల్లో స్తంభింపజేయగల ఒక డిజిటల్ బ్లాక్‌ఔట్ ఖర్చు ముందు ఇవి చాలా చిన్న ఖర్చే.

పన్నీరు వేణుప్రసాద్

మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 02:30 AM