Share News

మళ్లీ లెఫ్ట్‌నే రైట్‌ అంటున్నామా?

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:52 AM

సూర్యుని చుట్టూ భూమి ఉత్తరాయనం, దక్షిణాయనం సాగించినట్లే, సమాజాలు కూడా కొన్ని దశాబ్దాలు కుడి దిక్కుగాను, మరికొన్ని దశాబ్దాలు ఎడమ దిక్కుగాను ప్రయాణం సాగిస్తాయి.

మళ్లీ లెఫ్ట్‌నే రైట్‌ అంటున్నామా?

ఇప్పుడు ప్రపంచ గమనం మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం తరువాత ఈ మార్పులు వేగాన్ని పుంజుకున్నాయి. ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు ఓడిపోవడమే గాక అరబ్ పార్టీలు అనూహ్యంగా బలాన్ని పుంజుకున్నాయి. అమెరికాలోనూ డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్స్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఉభయ సభల్లోనూ ఆధిక్యాన్ని కోల్పోయింది. ప్రపంచం మళ్లీ ఎడమ దిక్కుకు మళ్లుతోందనడానికి ఇవి తొలి సంకేతాలు.

సూర్యుని చుట్టూ భూమి ఉత్తరాయనం, దక్షిణాయనం సాగించినట్లే, సమాజాలు కూడా కొన్ని దశాబ్దాలు కుడి దిక్కుగాను, మరికొన్ని దశాబ్దాలు ఎడమ దిక్కుగాను ప్రయాణం సాగిస్తాయి. 1989 గల్ఫ్ వార్ సమయంలో మైసూరు యూనివర్సిటీ ఎంఏ సోషియాలజీ వైవా పరీక్షలో ఒక ప్రొఫెసర్ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ‘ఆధునికత గాలులు ఎటునుంచి ఎటువైపు వీస్తున్నాయో తెలుసుకోవడానికి ముస్లిం దేశాలను, ముఖ్యంగా ఇరాన్‌ను, ఎందుకు ప్రపంచ భారమితి (బారోమీటర్‌)గా పరిగణిస్తారు?’ అన్నది ఆ ప్రశ్న. ఇరాన్ కొన్నాళ్లు మతఛాందస దేశంగా ఉంటుంది. అదే దేశం హఠాత్తుగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ రంగాల్లో ముందంజను సాధించి కొత్త రికార్డులు నెలకొల్పుతుంది. మళ్లీ మతఛాందస దేశంగానూ మారిపోవచ్చు. ఇటీవలి యుద్ధంలోనూ తొలి రోజే దేశాధినేత చనిపోయినా ఇరాన్ పౌరులు డ్రోన్లతో అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధవిమానాలను కూల్చి తోకముడిచేలా చేయటంలో పురుషులకన్నా మహిళల పాత్ర ఎక్కువ. 2014లో గణితశాస్త్రానికి సంబంధించి అత్యున్నత గౌరవమైన ‘ఫీల్డ్స్‌ మెడల్’ను అందుకున్న తొలి మహిళగా ఇరాన్‌కు చెందిన మర్యం మీర్జాఖానీ చరిత్ర సృష్టించారు. అలాగే ఒక మతాధినేత దేశాధినేతగా ఉన్న ఇరాన్ విద్యావ్యవస్థలో స్టెమ్ సైన్స్‌ విభాగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవేవీ హఠాత్తుగా వచ్చిన మార్పులు కాదు. దీనికో చరిత్ర క్రమం ఉంది. ప్రపంచంలో ఇప్పుడు వస్తున్న మార్పుల్ని అధ్యయనం చేయడానికి మనం ఓ నూట పదేళ్లు వెనక్కి వెళ్లాలి.


జారిస్టు రష్యాలో 1917లో జరిగిన అక్టోబర్‌ విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక అపూర్వమైన మలుపు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మరో సామాజిక వ్యవస్థను నిర్మించవచ్చన్న విశ్వాసాన్ని అది కలిగించింది. ఇది కేవలం రష్యాలో జరిగిన అధికార మార్పిడి కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు చరిత్రలో తొలిసారిగా ఒక శక్తిమంతమైన ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ విప్లవ ప్రభావం రష్యా సరిహద్దులకే పరిమితం కాలేదు. చైనా, క్యూబా, వియత్నాంలలో కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో విప్లవ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు ఐరోపాలో సోషలిస్టు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో వలసవాద వ్యతిరేక ఉద్యమాలు బలపడ్డాయి. జాతీయ విముక్తి పోరాటాలు, అలీనోద్యమం, కార్మికోద్యమాలు కొత్త రాజకీయ శక్తిని సంతరించుకున్నాయి. ప్రతి దేశానికీ తనదైన సామాజిక, ఆర్థిక, వలసవాద వ్యతిరేక పోరాటాల నేపథ్యం ఉంటుంది. అయినప్పటికీ పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాలకు సోవియట్ రష్యా రాజకీయ ప్రేరణను, అంతర్జాతీయ మద్దతును అందించింది. చాలా కాలం ప్రపంచ విప్లవ కేంద్రంగా కొనసాగింది.

ఆ దశలో, ప్రపంచమంతటా వివిధ స్థాయిల్లో తూర్పుగాలులు వీచాయి. ఈ ప్రభావం పెట్టుబడిదారీ దేశాలపైనా పడింది. కార్మికుల హక్కులు, ఎనిమిది గంటల పని దినం, సామాజిక భద్రత, ప్రభుత్వ ఆరోగ్య సేవలు, ప్రజా విద్య, నిరుద్యోగ భృతి, పెన్షన్లు వంటి సంక్షేమ రాజ్య భావనలు విస్తరించాయి. యూరప్‌లో సంక్షేమ రాజ్యాలు బలపడ్డాయి. అనేక దేశాల్లో కార్మికుల, సామాన్య ప్రజల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి పాలించడం ప్రభుత్వాలకు దాదాపు అసాధ్యమైపోయింది. అయితే, ఇక్కడ ఒక సైద్ధాంతిక ప్రశ్న ఉంది.


కార్ల్‌మార్క్స్‌ కమ్యూనిస్టు సమాజానికి రెండు దశలను, రెండు పంపిణీ స్థాయిలను వివరించాడు. ప్రాథమిక దశలో వ్యక్తి సమాజానికి అందించిన శ్రమకు అనుగుణంగా ప్రతిఫలం పొందుతాడు. ఉన్నత దశలో ‘ప్రతి ఒక్కరి నుంచి వారి సామర్థ్యం మేరకు; ప్రతి ఒక్కరికీ వారి అవసరాల మేరకు’ అనే నియమం పనిచేస్తుంది అన్నాడు. మార్క్స్ చెప్పిన ఈ ప్రమాణాలను సోవియట్‌ యూనియన్‌తో సహా ఏ సోషలిస్టు దేశమూ పూర్తిగా సాధించలేదు. సోవియట్‌ రష్యాలో లెనిన్‌ కాలంలో జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని సమర్థించిన విప్లవం, తరువాతి దశలో కొత్త జాతుల బందీఖానాగా మారిపోయింది. ఇతర రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు అన్నీ కలిసి 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అయిపోయింది.

1917లో మొదలయిన ప్రపంచ తూర్పు ప్రయాణం అలా ముగిసి 1990లలో పడమటి ప్రయాణం మొదలయ్యింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విజృంభించి, అమెరికా నాయకత్వంలో ఏకధ్రువ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడింది. దాంతో అమెరికా ఆలోచనాపరులు రెచ్చిపోయారు. 1992లో ఫ్రాన్సిస్ ఫుకుయామా ‘ఇక చరిత్ర ముగిసింది, చివరి మనిషి మాత్రమే మిగిలాడు’ అనేశాడు (The End of History and the Last Man). 1996లో శ్యామ్యూల్ హంటింగ్టన్ ఇంకో అడుగు ముందుకేసి ఇక క్యాపిటలిజం, కమ్యూనిజం వంటి సిద్ధాంత చర్చలకు కాలం చెల్లిందనీ, ప్రపంచంలో ఇక సాంస్కృతిక, మత యుద్ధాలే కొనసాగుతాయనీ సిద్ధాంతీకరించాడు (The Clash of Civilizations and the Remaking of World Order). సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత మారుతున్న ప్రపంచంలో అమెరికా స్థానాన్ని, ప్రయోజనాలను, ఆధిపత్యాన్ని సుస్థిరం చేయడానికి ఒక మేధో చట్రాన్ని వీళ్లు అందించారు.


శ్యామ్యూల్ హంటింగ్టన్ ప్రపంచాన్ని ఎనిమిది నాగరికతలుగా వర్గీకరించాడు. ఇవి పాశ్చాత్య, చైనా, జపాన్, ఇస్లామిక్, హిందూ, స్లావిక్ అర్థడాక్స్, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ నాగరికతలు. హంటింగ్టన్ నాగరికతల్లో అమెరికా పేరు, క్రైస్తవం పేరు ప్రత్యేకంగా వాడలేదు. అలాగే ఆఫ్రికన్ నాగరికతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉత్తర ఆఫ్రికాలో ఇస్లామిక్ నాగరికత, దక్షిణ ఆఫ్రికాలో క్రైస్తవ నాగరికతల ప్రాబల్యం ఉంటుందన్నాడు. ప్రపంచాన్ని పాశ్చాత్య నాగరికత ఏలుతుందనీ దానికి అమెరికా నాయకత్వం వహిస్తుందనేది హంటింగ్టన్‌ ప్రధాన సూత్రీకరణ. ఇజ్రాయెల్ యూదు నాగరికతకు కేంద్రమైనప్పటికీ అది పాశ్చాత్య నాగరికతలో భాగంగా అమెరికా శిబిరంలోనే ఉంటుంది. అలాగే చైనా (కన్ఫ్యూషియస్), ఇస్లామిక్ నాగరికతల మధ్య ఒక ఐక్యత కుదరవచ్చని జోస్యం చెప్పాడు. రష్యా, జపాన్, ఇండియాలను ఊగిసలాట (Swing) నాగరికతలుగా పేర్కొంటూ అవి సందర్భాన్నిబట్టి అంతర్జాతీయ సంబంధాలను మార్చుకుంటాయి అన్నాడు.

ఫుకుయామా, హంటింగ్టన్ సిద్ధాంతాల్లో ఒక బలం ఉంది. 1990ల తరువాత ప్రపంచవ్యాప్తంగా రాజకీయార్థిక విభాగాలను సాంస్కృతిక జాతీయవాదాలు అదుపు చేయడం మొదలయ్యింది. భారతదేశంలో ఇది మత రూపంలోనే గాక కులం రూపంలోనూ వ్యక్తం అవడం మొదలయ్యింది. ఒక వ్యక్తి మతాన్నిబట్టో, కులాన్నిబట్టో అతని అభిమాన రాజకీయ పార్టీని ఊహించేయగల సామాజిక స్థితి నెలకొంది. ఈ సాంస్కృతిక పరిణామాల్ని అర్థం చేసుకోలేకే అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు విఫలమయ్యాయి.


అచ్చంగా సిద్ధాంతం చెప్పినట్టే ప్రపంచం నడవదు. స్థలకాలాలను బట్టి సవరణలు, స్వల్ప మార్పులు ఉంటాయి. మొత్తం మీద ఓ నాలుగు దశాబ్దాలు ఫుకుయామా, హంటింగ్టన్ చెప్పినట్టే అమెరికా ఆకాంక్షల ప్రకారం ప్రపంచం నడిచింది.

ఇటలీ–జర్మనీ అక్ష రాజ్యాలుగా ఏర్పడి రెండో ప్రపంచ యుద్ధాన్ని మొదలెట్టాయి. ఆసియా ఖండం నుంచి జపాన్ ఆ శిబిరంలో చేరింది. పశ్చిమ నాగరికతకు చెందిన అమెరికా–ఇజ్రాయెల్ ఒక కూటమిగా ఏర్పడి ఇరాన్ మీద యుద్ధానికి బయలుదేరుతున్నవేళ ఆసియా ఖండం నుంచి ఇండియా వాటితో సాన్నిహిత్యాన్ని ప్రకటించడం నాటి జపాన్‌ను గుర్తు చేస్తున్నది. ఇది నేరుగా కూటమిలో చేరడం కాదు. శాంతి, ఆవిష్కరణలు, శ్రేయస్సు కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మాత్రమే.

జబ్బు పెరిగితే అదే మందుగా మారిపోతుందని ఒక వైద్యశాస్త్ర సూత్రం వుంది. ఇప్పుడు ప్రపంచ గమనం మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం తరువాత ఈ మార్పులు వేగాన్ని పుంజుకున్నాయి. ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు ఓడిపోవడమే గాక అరబ్ పార్టీలు అనూహ్యంగా బలాన్ని పుంజుకున్నాయి. అరబ్ పార్టీల సహకారంతోనే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. అటు అమెరికాలోనూ డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్స్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఉభయ సభల్లోనూ ఆధిక్యాన్ని కోల్పోయింది. ట్రంప్‌కు మిగిలింది దేశాధ్యక్షునిగా వీటో పవర్ మాత్రమే. మరో విశేషం ఏమంటే ఇజ్రాయెల్‌లో అరబ్ పార్టీల బలం పెరిగినట్టే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ముస్లింలు, ఆఫ్రో– అమెరికన్లు, వామపక్షీయుల బలం పెరిగింది. ప్రపంచం రొటేషన్‌లో భాగంగా మళ్లీ ఎడమ దిక్కుకు మళ్లుతోందనడానికి ఇవి తొలి సంకేతాలు.

డానీ

సమాజ విశ్లేషకులు

ఇవి కూడా చదవండి..

ట్రైన్ డ్రైవర్ క్యాబిన్‌లోకి వెళ్లేందుకు యువతి యత్నం.. ఘటనపై ఆర్పీఎఫ్‌ విచారణ

‘అక్వాన్’ తుపాను: 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 31 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు

Updated Date - Nov 20 , 2026 | 01:23 AM