‘గిగ్’ కార్మికుల రక్షణే నేటి సామాజిక న్యాయం
ABN , Publish Date - May 27 , 2026 | 12:59 AM
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్ల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) చట్టం కొన్ని కీలక సంస్కరణలకు నాంది పలికింది. ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం కార్మికులు...
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్ల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) చట్టం కొన్ని కీలక సంస్కరణలకు నాంది పలికింది. ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే ప్రమాద బీమా అందుతుంది. సెక్షన్ 12 ప్రకారం ‘ఆటోమేటెడ్ మానిటరింగ్’ అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే హక్కు కార్మికులకు లభిస్తుంది. అలాగే యాజమాన్యాలు ఏకపక్షంగా కార్మికులను తొలగించకుండా కనీసం ఏడు రోజుల ముందు రాతపూర్వక నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
భారత గిగ్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోంది. ఎకనామిక్ సర్వే 2025–26 ప్రకారం, గిగ్ కార్మికుల సంఖ్య 2024–25 నాటికి సుమారు 12 మిలియన్లకు పెరిగింది. ఈ సంఖ్య 2029–30 నాటికి 23.5 మిలియన్లకు, 2047 నాటికి 62 మిలియన్లకు చేరుకోవచ్చు. ఈ శ్రామికశక్తిలో మహిళలు సుమారు 28శాతం మంది ఉండగా, దాదాపు 40శాతం మంది నెలకు రూ.15వేల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 2029–30 నాటికి ఈ రంగం సేవల విలువ రూ.2.35 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా.
కానీ ఈ అంకెల వెనుక, తగిన భద్రతా చర్యలు, సమగ్ర బీమా లేకుండా ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్న కార్మికవర్గం ఉంది. ఏప్రిల్ 7 అర్ధరాత్రి హైదరాబాద్‌లో శివ, సందీప్ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు డెలివరీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. కుటుంబాలపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో వారు రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఒక కారు డ్రైవర్ వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టగా ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరిలో, ఢిల్లీలో వేకువజామున 3:30 గంటలకు 25 ఏళ్ల హేమ్ శంకర్ ఈ–స్కూటర్‌ను కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో మరణించాడు. ఆ ఆర్డర్లు ఇచ్చిన వినియోగదారులకు ‘ఆర్డర్ క్యాన్సిల్ అయింది’ అని ఒక మెసేజ్ మాత్రమే వచ్చి ఉంటుంది. తమ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలోనే డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడన్న చేదు నిజం వారికి తెలియకపోవచ్చు.
2025 నవంబర్‌లో అమల్లోకి వచ్చిన ‘సోషల్ సెక్యూరిటీ కోడ్–2020’ గిగ్ కార్మికులను ఒక ప్రత్యేక తరగతిగా గుర్తించింది. దీని ప్రకారం సంస్థలు తమ వార్షిక టర్నోవర్‌లో 1–2 శాతం సామాజిక భద్రతా నిధికి జమ చేయాలి. అయితే, ముసాయిదా సోషల్ సెక్యూరిటీ కోడ్ నిబంధనల ప్రకారం ఈ ప్రయోజనాలు పొందాలంటే కనీసం 90 రోజులు పనిచేయాలన్న నిబంధన ఉంది. జనవరిలో నోయిడాలో 18 ఏళ్ల డెలివరీ బాయ్ అంకుష్ విధుల్లో చేరిన తొలిరోజే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. డెలివరీ ఏజెంట్‌గా చేరిన మొదటి రోజు నుంచే ఎలాంటి షరతులు లేకుండా నగదు రహిత అత్యవసర వైద్యం అందించేలా నిబంధనలు తక్షణమే మార్చాలి. ముఖ్యంగా, తెలంగాణ చట్టం సెక్షన్ 8(బి) ప్రకారం ‘సంక్షేమ బోర్డు’కు ఈ నిబంధనలు నోటిఫై చేసే అధికారం ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న సమయంలోనూ గిగ్ కార్మికులు గంటలపాటు రోడ్లపైనే గడుపుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నై నగరంలో గిగ్ కార్మికుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన ఏసీ లాంజ్‌ల తరహాలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నీడ, తాగునీరు, ఛార్జింగ్, మరుగుదొడ్ల సదుపాయాలతో కూడిన విశ్రాంతి కేంద్రాలను నిర్మించడం యాజమాన్యాలు, ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. వీధి కుక్కలు, సరైన వెలుతురు లేని భవనాలు లాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు కస్టమర్లు ముందుగానే యాప్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం ఉండాలి. అలాగే కార్మికులకు ఆర్డర్‌ను తిరస్కరించే హక్కు ఉండాలి. ఈ సమస్యల పరిష్కారానికి యాప్‌లలో తక్షణమే కొన్ని మార్పులు తీసుకురావాలి.
ముఖ్యంగా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఆర్డర్ చేసేటప్పుడు రాత్రి పూట అత్యవసర సమ్మతిని తప్పనిసరి చేయాలి. ‘ఈ డెలివరీ కోసం ఒక వ్యక్తి రాత్రి పూట రోడ్డుపై ప్రయాణించాలి, ఇది రేపు ఉదయం డెలివరీ చేయవచ్చా’ అనే ఆప్షన్ వినియోగదారులకు స్పష్టంగా కనిపించాలి. అలాగే ఉదయానికి ఆర్డర్ షెడ్యూల్ చేసుకునే వినియోగదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. రాత్రి పూట చేసే ఆర్డర్లకు ప్రత్యేక సర్‌ఛార్జ్ వసూలు చేసి, ఆ నిధిని కార్మికుల బీమాకు, రిఫ్లెక్టివ్ సేఫ్టీ జాకెట్లు అందించేందుకు వాడాలి.
మన గుమ్మం వద్దకు డెలివరీ బ్యాగ్ వేసుకుని వచ్చేది ఎవరో కాదు, నిరుద్యోగం వల్ల కుటుంబ భారాన్ని మోస్తూ ఆత్మగౌరవంతో సొంత కాళ్లపై నిలబడాలని తపించే మన విద్యావంతులైన యువతే అనే దృక్పథం సమాజంలో రావాలి. మనమే నాలుగు అడుగులు ముందుకేసి డెలివరీని స్వీకరించడం, డెలివరీ చేతికి అందగానే చిరునవ్వుతో ‘థాంక్స్’ చెప్పడం, ఒక గ్లాసు చల్లటి నీళ్లు అందించడం... వారి అలసటను దూరం చేస్తాయి. శివ, సందీప్, హేమ్ శంకర్ కేవలం గణాంకాలు కారు. మెరుగైన భవిష్యత్తు కోసం కలలు కన్న యువకులు. వారిని విస్మరించడం ఏ మాత్రం తగదు. ఎందుకంటే మరో ఆర్డర్ మన ఇంటికి వస్తూనే ఉంటుంది, మనం మేల్కోకపోతే మరో విషాదం కూడా అలాగే పునరావృతమవుతుంది.
శ్రీనివాస్ మాధవ్
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ