Share News

ఘనకీర్తి

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:55 AM

మనిషై పుట్టినాక గొప్పగా చెప్పుకునే ఘట్టం ఏదో ఒకటి.. ఒకటుండాలి వేదికెక్కినప్పుడో నలుగురు కూడినప్పుడో...

ఘనకీర్తి

మనిషై పుట్టినాక

గొప్పగా చెప్పుకునే ఘట్టం ఏదో ఒకటి.. ఒకటుండాలి

వేదికెక్కినప్పుడో

నలుగురు కూడినప్పుడో

నీకంటూ చెరగని చరిత్రను చెప్పుకునే బతుకు ఉండాలి.

లేని మాటలు కాదు

ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు

పదిమందిలో నిటారుగా నిలబడి చెప్పుకునే

ఓ ఘనమైన నిజం నీ జీవితానికి ఉండాలి.

బలిసినోడిని ఎదిరించిన ధిక్కారమో

బరిగీసి పదిమందికై పిడికిలెత్తిన రణమో

నీ పేరు చెప్తే హడలెత్తే క్షణమో ఒకటి ఉండాలి.

జనాలకై పోరాటం చేసినట్లో

జైలులో మగ్గినట్లో

రోడ్లమీద లాఠీ దెబ్బలు తిన్నట్టో

ఏదో ఒక ఉద్యమ స్పర్శ ఉంటేనే నీకు విలువ.

అడవుల్లో అన్నలకై సద్దులు మోసిన జ్ఞాపకమో

పోలీసులు తరుముతుంటే గడ్డివాములో

తలదాచిన నెనరో

ఏదో ఒక యుద్ధ కాలాన్ని

నీ ఒడిలో మూట కట్టుకోవాలి.

పొద్దున్నే లేచి

గడియారం ముల్లులా పనిజేయడం కాదు

ఓ గంటైనా

నీ పేజీని ప్రత్యేకంగా రాసుకోడానికి ఉపయోగించుకోవాలి.

నాలుగు బాటల నడుమ

విగ్రహాలు ఉట్టిగానే నిలబెట్టరు

జయంతి, వర్ధంతులకు పనిలేక దండలేసి దండంబెట్టరు

సమాజానికి భుజమై ఉన్నప్పుడే

ఘనమైన చరిత్ర లిఖిమవుతుంది.

అవనిశ్రీ

99854 19424

ఈ వార్తలూ చదవండి

దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి

రాత్రి నూడిల్స్‌ తిని.. తెల్లారేలోపు శవాలుగా..!

Updated Date - Oct 19 , 2026 | 04:55 AM