జెన్‌జీ ఉద్యమాన్ని నీరుగార్చలేరు!
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:29 AM
ఈ దేశంలో జరుగుతున్న జెన్‌జీ ఉద్యమానికి లేని ఉద్దేశ్యాలను, లక్ష్యాలను ఆపాదించి విద్యార్థుల న్యాయమైన అసంతృప్తిని డీలెజిటిమైజ్ చేయడానికి ఒక విఫల ప్రయత్నం చేశారు వ్యాసకర్త అరవిందరావు...
ఈ దేశంలో జరుగుతున్న జెన్‌జీ ఉద్యమానికి లేని ఉద్దేశ్యాలను, లక్ష్యాలను ఆపాదించి విద్యార్థుల న్యాయమైన అసంతృప్తిని డీలెజిటిమైజ్ చేయడానికి ఒక విఫల ప్రయత్నం చేశారు వ్యాసకర్త అరవిందరావు (20 ఆగస్టు 2026న ఆంధ్రజ్యోతిలో తాను రాసిన వ్యాసంలో). ఉద్యమం వెనుక బుద్ధిజీవులున్నారని, ‘దేశాన్ని బలహీనపరచడం, అంతర్గతంగా విచ్ఛిన్నం చేయడమే’ వారి ఎజెండా అని రాశారు. ప్రధాని మోదీ ‘దిమాగీ నక్సల్స్’కు ఇది నిర్వచనం, కొనసాగింపు. అంతేగాక ‘రాజకీయ పార్టీలు విద్యార్థుల వీపులపై స్వారీ చేసి ప్రభుత్వాన్ని దించాలని ఆశపడుతున్నాయి’ అన్నారు. ఈ వాదనల నిరూపణకు చైనాను ఉదహరించారు. ఇంకా అన్యాయంగా, అసందర్భంగా దీనికి పూర్తి వ్యతిరేకమైన బెర్నార్డ్ షాను వాడారు.
పేపర్ లీక్‌లు, పరీక్ష మోసాలు పరిశీలిస్తే.. 2005–2026 మధ్యకాలంలో 21 రాష్ట్రాలలో 220 సంఘటనలు నమోదయ్యాయి. ఇందులో 2015కు ముందు 72 కేసులు నమోదు కాగా, 2015 తర్వాత 148 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలు అన్ని ప్రభుత్వాల హయాంలలోనూ జరిగాయి. కానీ బీజేపీ, దాని మిత్రపక్షాల పాలనలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొత్తం 220 కేసులలో ఎన్డీఏ పాలనలో 128 కేసులు (58శాతం), కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పాలనలో 55 కేసులు (25 శాతం) నమోదయ్యాయి. 2015 తర్వాత బీజేపీ వాటా ఇంకా పెరిగింది. నమోదైన 148 కేసులలో 99 కేసులు (67 శాతం) ఎన్డీఏ పాలనలోనే చోటుచేసుకున్నాయి.
‘పేపర్ లీక్‌లు కావడం కాంగ్రెస్ హయాంలో అతి సాధారణమైన విషయం’ అని వ్యాసకర్త వ్యాఖ్యానించారు. కానీ గణాంకాలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 2015కు ముందు నమోదైన కేసుల్లో కేవలం 12 కేసుల్లోనే సీబీఐ శిక్ష వేయించగలిగింది. కానీ, 2015 తర్వాత 148 కేసులలో కేవలం ఒక్క కేసులోనే నేరం రుజువై శిక్ష పడింది. అది కూడా చండీగఢ్‌లోనే. సీబీఐకి 2015 తర్వాత కనీసం 17 కేసులు దర్యాప్తునకు అప్పగించారు. అందులో శిక్ష నమోదు రికార్డు సున్నా! అదే సమయంలో 11 కేసులలో ఈడీ పనితీరు శూన్యం. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం కుప్పకూలిపోయింది. అంచెల కుల సమాజంలో పరీక్ష వ్యవస్థలకు ఉండే సమానత్వ సామర్థ్యం దెబ్బతిని, సాధికారతే ప్రశ్నార్థకం అయింది.
యూజీసీ నెట్–2024 పేపర్ లీక్ ఘటనలో నేను కూడా బాధితుడినే. ఈ ఏడాది కూడా ప్రశ్న పత్రంలో అక్షరదోషాల వల్ల మూడు పేపర్లను రద్దు చేశారు. ఇంతటి తీవ్ర సంక్షోభానికి సమాధానం అడగవలిసిన వ్యవస్థలు ఈ దేశ విద్యార్థులకు నిరాశను మిగల్చడమే కాక ‘బొద్దింకలు’ అని అవమానపరిచాయి. దిగజారిన రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను, జవాబుదారీతనాన్ని తట్టి లేపి, తిరిగి తన న్యాయమైన స్థానంలో పునరుద్ధరించడం కోసమే ఈ ఉద్యమం. ఎంత దాడి జరిగినా విద్యార్థి ఉద్యమం మాత్రం సమాజాన్ని మానవీకరించే దిశగా, వ్యవస్థలను ప్రజాస్వామీకరించి కాపాడుకునే దిశగానే సాగుతుంది.
పి. ఆనంద్
పీహెచ్‌డీ విద్యార్థి, పుదుచ్చేరి
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి