పిడకల వేటకూ దొరకని జెన్–జీ
ABN , Publish Date - Jul 30 , 2026 | 02:17 AM
జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనను ఎలా చూడాలి.. అనే దానిమీద ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నట్టున్నాయి. మార్పు మనం కోరుకున్న రీతిలో, మోతాదులో, కోరుకున్న పద్ధతిలో...
జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనను ఎలా చూడాలి.. అనే దానిమీద ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నట్టున్నాయి. మార్పు మనం కోరుకున్న రీతిలో, మోతాదులో, కోరుకున్న పద్ధతిలో ఉంటే తప్ప చాలా మందికి తృప్తి కలగదు. అంగీకరించకపోయినా ఆ ధోరణిని దాని మూలాలను అర్థం చేసుకోవచ్చు. ఎంత గొప్ప రిలీఫ్ అనే ఫీలింగ్ వల్ల ఇప్పుడు ఏర్పడ్డ పాజిటివ్ వైబ్ పలుచనబడే సన్నివేశాలు మరిన్ని వస్తాయి. డాన్స్ వీడియోలతో కాస్త అటూ ఇటూగా అయిపోవచ్చు. రేపో మాపో మందు బాటిళ్ల విజువల్స్ కూడా ముందుకు రావచ్చు. ఆపైన ఎవరో ఇంకెవరితోనో, ఇంకేదో రకంగా ఉన్న విజువల్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దెబ్బతిన్న బలవంతుడు ఊరికే ఉండడు. పైగా చేతినిండా బలగం ఉన్నప్పుడు. ఆ శిబిరం సంగతి వదిలేయండి. ‘ఆ డాన్సులు గట్రా ఏంటండీ, చేయకపోతే బాగుండేది’ అనే దగ్గర సన్నాయి నొక్కులతో బయలుదేరతారే.. వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే డాన్స్ దగ్గరే వీడియోలు ఆగవు కాబట్టి. ఇప్పుడు జైకొట్టినోళ్లే అప్పుడు కాస్త స్వరం మార్చి– ‘అప్పుడే అనుకున్నాం.. ఐడియాలజీ, నిర్మాణం లేకపోతే ఇలాగే...’ అంటూ ఆ రూట్లో ముక్కులు చీదే అవకాశం ఉంటుంది కాబట్టి. ఐడియాలజీ, నిర్మాణం అసలు అవసరం లేదు అనట్లేదు కానీ, నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్టమైన విశ్లేషణ అవసరం. మన బీకరులోనే అన్నీ ఇమడవు.
మోదీ మీద కోపం వల్ల ఎవరో ఒకరు ఏదో రకంగా మెడలు వంచారనే సంబరం వల్ల ఆమోదం తప్పితే, ఇతరత్రా మనం కోరుకున్న శాస్ర్తీయ పద్ధతుల్లో వారెవరూ లేరు అనే చింత, చింతన చాలా మందిలో ఉంటాయి. మనవల్ల కానిది పిల్లకాయలు చేశారు అనే ఉత్సాహాన్ని శాస్ర్తీయ శర్మీయ ఆలోచనా పద్ధతుల త్రాసు అటూ ఇటూ చేస్తా ఉంటది. అక్కడ కాస్త మాట్లాడుకోవాల్సి ఉంది.
‘‘Your children are not your children.
They are the sons and daughters of Life's longing for itself.’’
ఇది పూర్తిగా మరో తరం. దాని కోపం, ప్రేమ, ద్వేషం, ఆనందం వేరే రూపాల్లో వ్యక్తం అవుతుంది. తొలి మూడు సెకన్లలో నువ్వు కండ్లలో కండ్లు పెట్టి నిలపలేకపోతే తప్పుకునిపోతుంది, తప్పించుకునిపోతుంది. ఈ బోరింగ్ బ్యాచ్‌తో నాకెందుకు అని. దిసీజ్ ఇన్‌స్టా జనరేషన్. కండెన్సెడ్, షార్ప్, ఆంబిషస్ అండ్ ఇండిపెండెంట్!
ధిక్కారం అన్నివేళలా మనం కోరుకున్న పద్ధతుల్లోనే ఉండదు. అసలు మనం కోరుకున్న పద్ధతి అనేది ఎంత అప్డేటెడ్ అనేది వేరే చర్చ. అంతిమంగా ప్రజలకు కనెక్ట్ కావడం కదా దేనికైనా దారి. ఆ దారి మనకు తెలీకపోయిందని చరిత్ర చెబుతున్నది కదా, కాస్త తలవొగ్గి వినడం కూడా నేర్చుకోవాలె. ఈ నేల, దాని మీద కదలికలు మనకు కొన్నిసార్లు నేర్పుతాయి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలె!
ఇంతకీ వాళ్లేం సాధించారు? భయం అనే పొరను ఛేదించారు. నిరంకుశ పాలకుడితో తలపడుతున్నప్పుడు అదే కదా అతి పెద్ద అడ్డంకి, చైనా వాల్. అదిగో వీళ్లు తమ హ్యూమర్‌తో అట్లా ఈకలాగా తీసిపారేశారు. అది కదా విజయమంటే! ఒక దళితుడి నేతృత్వంలో వేలాది మధ్యతరగతి పిల్లలు కులమతాలకు అతీతంగా ఒక్కటై నినదించారు. ఆడారు, పాడారు. అంతకంటే గొప్ప దృశ్యం ఏం కావాలి. అంబేడ్కర్‌కు కూడా సాధ్యపడని అపూర్వ దృశ్యం. ఆయన దళిత నాయకుడిగానే, ఇంకా చెప్పాలంటే మహర్ల నాయకుడిగానే తనువు చాలించాల్సి వచ్చింది. దీనర్థం.. అంబేడ్కర్ కంటే ఈ కుర్రాడు అభిజిత్ దీప్కే గొప్ప నాయకుడనికాదు. అట్లా దురార్థం తీయకూడదు. ఈ సన్నివేశంలో అతను లేవనెత్తిన డిమాండ్, లేవనెత్తిన తీరు, సందర్భం అన్నీ కలిసి వచ్చాయి. ఎలా వచ్చినా ఒక దళితుడి నాయకత్వాన అంతమంది సవర్ణ విద్యార్థులు పోగవడం ఎప్పుడు చూస్తారండీ! అంతకంటే ఏం చూడాలి మనం!
ఆ రెంటినీ మించింది తిరిగొచ్చిన విశ్వాసం. ఈ మట్టిలో ఇంకా బలముందని పంటలు పండలేనంతగా నాశనం కాలేదని, శ్రుతి–లయ సరిగ్గా కలవాలే కానీ ఇక్కడింకా రాగాలు పలకగలవని చూపించారు కదా! అదెంత గొప్ప ఊరట, అందరికీ! ఎండిపోయిందని దిగాలు పడిన చెట్టుకు మళ్లీ పూతపూయడం కాదూ! స్టడీ చేయాల, తెలుసుకోవాల. తెలియజెప్పడం అనేది మాత్రమే అలవాటైన వారు విద్యార్థులుగా మారితే తప్ప కొన్ని అర్థం కావు. దిసీజ్ నాన్ ఐడియలాజికల్, నాన్ స్ట్రక్చరల్, నాన్ ‘సీరియెస్’, నాన్ డిస్క్రిప్టివ్ మూవ్‌మెంట్ అండ్ మోమెంట్. అసలది స్టార్ట్ అవ్వడమే సెటైరికల్‌గా స్టార్ట్ అయ్యి, అంతే సెటైర్‌తో బలాన్ని ఎదుర్కొని నిలిచి గెలిచిన మూమెంట్. ఇందులో ఏ పిడకల వేటకూ ఆస్కారం దొరకదు. ఎట్లా పోట్లాడారో అట్లాగే సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. అంతిమంగా అందరమూ ఆ డబ్బాలో సెనిక్కాయలు తెచ్చుకుని తింటున్న కుర్రాడి దగ్గరికి, పనిలో దుర్మార్గమైన యాతన ఎదుర్కొంటూ రోదిస్తూ, మనల్ని ఏడిపిస్తూ మాట్లాడుతున్న కార్మికుడి దగ్గరకు రావాల్సి ఉంటుంది. అది ఇంత త్వరగా స్టార్ట్ అయ్యేది కాదు, ముగిసేది కాదు. అది అంతిమ సత్యమే కానీ, ఈ జంతర్ మంతర్ చాటిన సత్యం చిన్నదేమీకాదు. అది చాలా వాటికి ఊపిరినిచ్చింది. దాన్ని చిన్నబుచ్చక్కర్లేదు. అంతిమంగా ఉపాధ్యాయుల పాత్రలోంచి విద్యార్థుల పాత్రలోకి మారాల్సిన సన్నివేశం ఇది. కనెక్షన్ అనే సింగిల్ పాయింట్ స్టడీ ఇప్పటి అవసరం.
క్రిష్ణమూర్తి
ఇవి కూడా చదవండి
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!
విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా