Share News

జమ్మూ–కశ్మీర్‌లో వాగ్దాన వంచన

ABN , Publish Date - Jul 28 , 2026 | 01:09 AM

జమ్మూ–కశ్మీర్‌కు రాష్ట్ర హోదా నిరుడు కురిసిన హిమసమూహమేనా? భారత రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేసి, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసిన చరిత్రకు 5 ఆగస్టు 2026న ఏడు సంవత్సరాలు...

జమ్మూ–కశ్మీర్‌లో వాగ్దాన వంచన

జమ్మూ–కశ్మీర్‌కు రాష్ట్ర హోదా నిరుడు కురిసిన హిమసమూహమేనా? భారత రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేసి, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసిన చరిత్రకు 5 ఆగస్టు 2026న ఏడు సంవత్సరాలు పూర్తవుతాయి. రానున్న ఈ ఏడవ వార్షికం సందర్భంగా జమ్మూ–కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించేందుకు ఆ కేంద్ర పాలిత ప్రాంత అధికార పక్షం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) ఈ నెల 20న న్యూఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్‌సీకి పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (కశ్మీర్ లోయలో ప్రభావ ప్రాబల్యాలు ఉన్న పార్టీ) నుంచి తోడ్పాటు లభించలేదు. ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలు ఎన్‌సీ నిరసన పట్ల ఉదాసీనత చూపాయి. అసలు ఈ జూలై 20న న్యూఢిల్లీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడమే వివేకవంతమైన నిర్ణయం కాదు. ఎందుకంటే అదే రోజున కాక్రోచ్‌ జనతా పార్టీ పిలుపు మేరకు విద్యార్థులు, యువజనులు ఢిల్లీ వీధులలో పోటెత్తారు. పోలీసులు వారి పట్ల పాశవికంగా ప్రవర్తించారు. ఆ రోజు మీడియా దృష్టి అంతా ఈ నిరసన ప్రదర్శన, పోలీసులు దానిని అణచివేసిన తీరుపైనే కేంద్రీకృతమై ఉన్నది.

జూలై 20 నిరసనతో జమ్మూ–కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ మళ్లీ ప్రజల్లో పెద్ద చర్చనీయాంశమవుతుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆశించింది. అయితే ఆ నిరసన ప్రభావ శూన్యంగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఆ అపరిష్కృత డిమాండ్‌ దేశం ముందు ఒక అతి ముఖ్యమైన ప్రశ్నగా ఉన్నది. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించి వేయడమనేది ప్రప్రథమంగా జమ్మూ–కశ్మీర్ విషయంలోనే జరిగింది. ఆగస్టు 5, 2019న ఇది సంభవించినప్పుడు కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను సాధ్యమైనంత త్వరలో పునరుద్ధరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మాటను అందరూ విశ్వసించారు. అయితే ఏడు సంవత్సరాలు గడిచినా ఆ వాగ్దానం ఒక మాటగా మాత్రమే మిగిలిపోయింది. ఈ దురదృష్టకర పరిణామం ఆ ప్రాంత ప్రజలకే కాకుండా ప్రజాస్వామికవాదులైన సమస్త భారతీయులకూ దిగ్భ్రాంతి, వ్యాకులత కలిగిస్తోందనడంలో సందేహం లేదు.


కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయమై కేంద్ర ప్రభుత్వ వాగ్దానాల వివరాలను ఏప్రిల్‌ 2024లో కశ్మీర్ టైమ్స్‌ అనే స్వతంత్ర వెబ్‌సైట్‌ ప్రచురించింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణ 370ని రద్దు చేసిన రెండు నెలలకు (అక్టోబర్‌ 2019లో) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పోలీసు అధికారుల సమావేశంలో మాట్లాడుతూ, ‘సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని’ చెప్పారు. అదే ఏడాది డిసెంబర్‌లో రామ్‌ మాధవ్‌ (ఆనాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి) కశ్మీర్‌కు ‘త్వరలోనే’ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అవుతుందని ఉద్ఘాటించారు. ఫిబ్రవరి 2021లో ‘కశ్మీర్‌కు తగిన తరుణంలో పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. అక్టోబర్‌ 2021లో కశ్మీర్‌ను సందర్శించిన అమిత్‌షా ‘రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి నిస్తామని ఉద్ఘాటించారు. జనవరి 2022లో అమిత్‌షా ఇలా చెప్పారు: ‘నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభమయింది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కశ్మీర్‌లో పరిస్థితులు యథాస్థితికి వచ్చిన వెంటనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చాను.’ పదమూడు నెలల అనంతరం ప్రభుత్వ అనుకూల టీవీ చానెల్‌ నొకదానికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ‘అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టంగా చెప్పాను’ అని అమిత్‌షా అన్నారు.

2022లో జమ్మూ–కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. జమ్మూ ప్రాంతంలో ఆరు కొత్త నియోజకవర్గాలు ఏర్పడగా కశ్మీర్ లోయలో ఒకటి మాత్రమే అదనంగా ఏర్పడింది. 2024 సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. నాలుగు నెలల ముందే ఉధాంపూర్‌–దోడాలో ఆ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్నికల అనంతరం కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్యర్థి పక్షాల ఓట్లు చీలిపోయి తమకు లబ్ధి చేకూరుతుందని మోదీ, అమిత్‌షాలు విశ్వసించారన్నది స్పష్టం. అయితే వారి విశ్వాసం వమ్మయింది. ఇండియా కూటమి గెలుపును అడ్డుకోవడంలో వారి వ్యూహాలు విఫలమయ్యాయి. మొత్తం 90 నియోజకవర్గాలలో 49 ఇండియా కూటమికి దక్కాయి. వీటిలో 42 నేషనల్‌ కాన్ఫరెన్స్‌ గెలిచిన స్థానాలు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల తీర్పును గౌరవించేందుకైనా కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై చిత్తశుద్ధి చూపారా? లేదు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తప్పక ఇస్తామని మార్చి 2025లో అమిత్‌షా న్యూఢిల్లీలో అన్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో కూడా ‘తగిన సమయం’లో కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.


ఈ హామీలలో ఏ ఒక్కదానినీ నెరవేర్చలేదని మరి చెప్పనవసరం లేదు. ఆ వాగ్దానాలలోని భాషను నిశితంగా పరిశీలించండి. ఉద్దేశపూర్వకంగానే అది అస్పష్టంగా, సందిగ్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ‘సాధారణ పరిస్థితులు’, ‘త్వరలో’, ‘సరైన సమయంలో’, ‘తగిన తరుణంలో’– వీటిల్లో ఏ ఒక్కటైనా ఎట్టకేలకు ఆసన్నమయిందని ఎవరైనా ఎలా నిర్ణయించగలరు? కశ్మీర్‌కు న్యాయబద్ధమైన పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరణను జాప్యం చేసేందుకే పాలకులు ఇలా మాట్లాడుతున్నారనేది స్పష్టం.

2019 ఆగస్టు నుంచీ జమ్మూ–కశ్మీర్‌ ప్రజల ప్రజాస్వామిక హక్కులను న్యూఢిల్లీ పాలకులు పూర్తిగా అలక్ష్యం చేస్తున్నారు. ఈ జూలై తొలి రోజుల్లో అనంతనాగ్‌లో ఉగ్రవాద దాడిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒకరు చనిపోయారు. ఆ ఘటనకు బాధ్యులు అనే ఆరోపణతో 2500 మందిని అరెస్ట్‌ చేశారు! కశ్మీర్‌లో ప్రజాస్వామిక హక్కులపై మోదీ ప్రభుత్వానికి ఇసుమంత గౌరవం కూడా లేదనడానికి ఇంతకంటే మరో తార్కాణమేముంటుంది? ఒక వ్యక్తి దుర్మరణానికి ఇన్ని వేల మందిని నిందితులుగా పరిగణించడం న్యాయమేనా? ఇంతమంది పౌరులను ఒక వ్యక్తి హత్య కేసులో అనుమానించడానికి.. భారత రాజ్యాంగానికి ఏ వ్యాఖ్యానం సమ్మతిస్తుంది? రాజ్యాంగపరమైన ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. ఎందుకంటే అది స్పష్టంగా పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, సందేహం లేదు.

2024 అసెంబ్లీ ఎన్నికలలో 64శాతం మంది ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకున్నారు. కశ్మీర్‌లో ఇది రికార్డు స్థాయి పోలింగ్‌. జమ్మూ–కశ్మీర్‌ ప్రజలు బహుళ–పార్టీ ప్రజాస్వామ్యాన్ని గట్టిగా కోరుకుంటున్నారని, కనుకనే మున్నెన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారని స్పష్టమవుతుంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ ప్రజా తీర్పును ధిక్కరిస్తోంది, అపహసిస్తోంది. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తిరస్కరిస్తోంది.


1950–2019 సంవత్సరాల మధ్య జమ్మూ–కశ్మీర్ భారత గణతంత్ర రాజ్యంలో ఒక పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉన్నది. అదేకాలంలో భారత్‌లో అంతర్భాగాలుగా ఉన్న తొమ్మిది హిమాలయ ప్రాంతాలు రాష్ట్ర ప్రతిపత్తిని సాధించుకున్నాయి. అప్పటివరకు ఆ ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడమనేది ఆచరణీయం కాని విషయంగా భావించేవారు. ఆ రాష్ట్రాలు: అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరం, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌. గమనార్హమైన విషయమేమిటంటే ఈ తొమ్మిది రాష్ట్రాలలోను జమ్మూ–కశ్మీర్‌లో కంటే తక్కువ జనాభా ఉన్నది. నిజానికి పలు హిమాలయ రాష్ట్రాలలో చాలా చాలా తక్కువ జనాభా మాత్రమే ఉన్నది. అయినా ఆ ప్రాంతాలన్నీ రాష్ట్ర ప్రతిపత్తిని పొందాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన వాటి ప్రభుత్వాలు నిజమైన అధికారాలు చలాయిస్తున్నాయి. మరి జమ్మూ–కశ్మీర్‌లో ఆగస్టు 2019 నుంచి ప్రజాస్వామికంగా ఎన్నికవ్వని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఒక వైస్రాయిలా పరిపాలిస్తున్నాడు. న్యూఢిల్లీ పాలకులకు విధేయంగా వ్యవహరిస్తున్నాడు. ఇదేమి ప్రజాస్వామ్యం? కశ్మీర్ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యానికి అర్హులు. మరి వారెందుకు వివక్షకు గురవుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడం కష్టమేమీ కాదు. ఆ ఎనిమిది హిమాలయ రాష్ట్రాలు ఏ ఒక్క దానిలోనూ ముస్లింలు మెజారిటీగా లేరు. జమ్మూ–కశ్మీర్‌లో మాత్రమే ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి ఔదలదాల్చిన హిందుత్వ భావజాలం ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే పరిగణిస్తున్నది. ఈ మతమైనారిటీలు అధిక సంఖ్యాకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సిందేనని నిర్దేశిస్తున్నది. భారత గణతంత్ర రాజ్య పూర్తిస్థాయి పౌరులుగా వారిని ఎంచదు, గౌరవించదు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణను కేంద్రం నిరాకరిస్తూనే ఉన్నది. ఒక సహేతుకమైన డిమాండ్‌ను అదే పనిగా తిరస్కరించడం జాతి శ్రేయస్సుకు ఎలా దోహదం చేస్తుంది? ఆ తిరస్కరణ హానికరమైన మెజారిటీవాద పాలనా విధానాలను బలపరుస్తూ భారత రిపబ్లిక్‌ సమైక్యత, సమగ్రతకు ఆటంకమవుతోంది.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Also Read:

చికెన్‌ 65 అనే పేరు ఎలా వచ్చింది?

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

Updated Date - Jul 28 , 2026 | 01:09 AM