Share News

నాలుగు స్తంభాలూ కూలుతున్నాయి!

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:51 AM

మహాత్మాగాంధీ తన జీవితంలో చివరి మూడు దశాబ్దాలు బ్రిటిష్‌ వలసపాలన నుంచి భారత్‌కు స్వాతంత్ర్యం సాధించడంలో గడిపారు. ‘స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి?’ అన్న...

నాలుగు స్తంభాలూ కూలుతున్నాయి!

మహాత్మాగాంధీ తన జీవితంలో చివరి మూడు దశాబ్దాలు బ్రిటిష్‌ వలసపాలన నుంచి భారత్‌కు స్వాతంత్ర్యం సాధించడంలో గడిపారు. ‘స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి?’ అన్నదానిపై ఆయన తన భావనలను ఆ కాలంలో అరుదుగా రాశారు, మాట్లాడారు. అయితే 1922 మార్చిలో స్వరాజ్‌కు ఆయన ఒక చిన్న, సంక్షిప్త నిర్వచనాన్ని ప్రతిపాదించారు. నేడు మనం మళ్లీ దానిని గుర్తు చేసుకుని, స్ఫూర్తి పొందవలసిన అవసరమున్నది. అస్పృశ్యత నిర్మూలన, ఖద్దర్‌ ఉత్పత్తి, హిందూ–ముస్లిం సమైక్యత, అహింసా సాధన అనేవి ఆయన ఆశించిన స్వరాజ్‌కు పునాదులుగా ఉన్నాయి. స్వరాజ్‌ సౌధం ఎల్లప్పుడూ ఆధారపడి ఉండే నాలుగు మూల స్తంభాల్లో ఒక్కదాన్ని తొలగించినా మొత్తం సౌధమంతా కూలిపోతుంది.

స్వరాజ్‌ స్వరూప స్వభావాలకు ప్రాతిపదికలు అయిన ఆ నాలుగు ముఖ్య అంశాలను మరింతగా వివరంగా చూద్దాం. ‘అస్పృశ్యత నిర్మూలన’ను విశాలార్థంలో సామాజిక న్యాయంగా నేడు మనం భావించవచ్చు. కులపరమైన అసమానతలే కాకుండా జెండర్‌ అసమానతలను సమూలంగా తొలగించడమే సామాజిక న్యాయం. కాంగ్రెస్‌లోని ఇతర సవర్ణ నాయకులు నెహ్రూ, పటేల్‌, బోస్‌ వలే కాకుండా భారత స్వాతంత్ర్య సాధనకు అస్పృశ్యతా దురాచారం ఎలా అవరోధమవుతుందో గాంధీకి నిశిత, సమగ్ర అవగాహన ఉంది. అస్పృశ్యత ఒక ‘పాపం’ అని, దానిని పాటిస్తున్నవారు ‘హిందూ ధర్మ వినాశకులు’ అని ఆయన నిరసించారు. మహిళా విముక్తి విషయమై కూడా గాంధీ పరిపూర్ణ శ్రద్ధ వహించారు. 1917లో వెలువరించిన ఒక ప్రసంగంలో గాంధీ ఇలా అన్నారు: ‘మహిళలు పురుషుల సహవాసులు, మానసిక సామర్థ్యాలలో సమానులు. పురుషుని సమస్త కార్యకలాపాలలో పాల్గొనే హక్కు ఆమెకు ఉన్నది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విషయంలో పురుషునికి ఎంత హక్కు ఉన్నదో మహిళకూ అంతే సమాన హక్కు ఉన్నది’. వలస పాలకులకు వ్యతిరేకంగా గాంధీ నిర్వహించిన సత్యాగ్రహాలు అన్నిటిలోనూ మహిళలు కీలకపాత్ర వహించారు.

గాంధీ మహాత్ముని సాంఘిక సంస్కరణల అజెండాకు పరిమితులు ఉన్నాయి. అస్పృశ్యులను గౌరవప్రదంగా పిలిచేందుకై ‘హరిజన్‌’ అనే పదాన్ని ఆయన సృష్టించారు. ఇప్పుడు దాని స్థానంలో ‘దళిత్‌’ అనే పదం వాడుకలోకి రావడం ఒక వివేకవంతమైన కాలానుగుణ్య మార్పు. సంప్రదాయ ఆర్థిక వ్యవస్థలో మహిళలు పాల్గొనడంపై గాంధీ అభిప్రాయాలు సందిగ్ధ స్వభావంతో ఉండేవి. అయినప్పటికీ కుల దౌష్ట్యాలను, జెండర్‌ వివక్షను వ్యతిరేకించడంలో, వాటిని రూపుమాపే కృషిలో తన సమకాలీన జాతీయవాదులు అందరికంటే ఆయన చాలా అభ్యుదయాత్మకంగా ముందుండేవారు.


ఖద్దర్‌ తయారీకి మహాత్ముడు ఇచ్చిన విశేష ప్రాధాన్యం గురించి చూద్దాం. గాంధీ కాలంలోనూ, ఆనాటి నుంచి ఈనాటి దాకా ఖద్దర్‌ తయారీ అంటే చులకనభావం వ్యక్తమవుతోంది. ఖద్దర్‌ను అంగీకరించడం అంటే ఆర్థికాభివృద్ధిని పెంపొందించే పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాలను తిరస్కరించడంగా పరిగణన అవుతుంది. అయితే స్వతంత్ర భారతదేశం ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి బాట అనేక సమస్యల (సంపద కేంద్రీకరణ, గౌరవప్రద, అర్థవంతమైన ఉపాధి అవకాశాల కొరత, పర్యావరణ విధ్వంసం)కు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఆర్థిక భావాలకు ఇప్పటికీ కొంత ప్రాధాన్యత ఉంది. ఆయన నిర్వహించిన ఖద్దర్‌ ఉద్యమం శ్రమ గౌరవానికి, స్థానిక స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చింది. ప్రకృతిని, సహజ వనరులను విచక్షణాయుతంగా ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యమో ఆయన తరచూ రాస్తుండేవారు. అనేక విధాలుగా గాంధీ ముందస్తు పర్యావరణవాది. వాయు, జల కాలుష్యాన్ని, భూసార క్షీణతను అరికట్టేందుకు, వాతావరణ మార్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు గాంధీ భావాలు, ఆచరణలు మనకు ఎంతైనా తోడ్పడగలవు.

గాంధీ స్వరాజ్‌కు మూడో మూల స్తంభం ‘హిందూ–ముస్లిం ఐక్యత’. జాతి నిర్మాణంలో మత సామరస్యం ప్రాధాన్యాన్ని ఆయన దక్షిణాఫ్రికాలో తన జీవితానుభవాల నుంచి గ్రహించారు. బొంబాయిలోనే న్యాయవాదిగా గాంధీ రాణించి ఉంటే ఆయన క్లయింట్‌లు, స్నేహితులు దాదాపుగా అందరూ హిందువులు అయివుండేవారు. అయితే బొంబాయిలోను, రాజ్‌కోట్‌లోను న్యాయవాదిగా ఆయన విఫలమయ్యారు. గుజరాతీ ముస్లిం వ్యాపారస్థుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఆయన దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ నగరానికి వెళ్లారు. అక్కడ ఆయన ఒక సాంఘిక సేవాకర్తగా పరిణమించారు. ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి ఆయన విశేష కృషి చేశారు. ఈ కృషిలో పార్సీలు, ముస్లింలు, తమిళులు ఆయనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. దృఢమైన జాతీయవాదాన్ని అభివృద్ధిపరచడంలో మతపరమైన, భాషాపరమైన బహుళత్వాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో గాంధీ తెలుసుకున్నారు. 1908లో జోహాన్స్‌బర్గ్‌ జైలులో ఉన్న సమయంలో ఆయన ఇలా రాశారు: ‘దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భారతీయులలో హిందువులు, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు, బెంగాలీలు, గుజరాతీలు, పంజాబీలు అనే తరతమ తేడాలు లేవు. మేమందరమూ భారతీయులమే. భారతదేశం కోసం పోరాడుతున్నాం’. జైలు నుంచి విడుదలైన తరువాత జోహాన్స్‌బర్గ్‌లోని భారతీయుల నుద్దేశించి గాంధీ మాట్లాడుతూ, ‘రెండు కళ్లు (హిందువులు, ముస్లింలు) నిరపాయంగా ఉంటే మీరు వర్ధిల్లుతారు... ఉభయ మతాలవారు సమైక్యంగా ఉంటే భారత్‌కు మీరే పాలకులు అవుతారు’ అని ఉద్ఘాటించారు. భారత్‌కు తిరిగివచ్చిన తరువాత ఆయన అవే సునిశ్చిత విశ్వాసాలతో పనిచేశారు. మత సామరస్యానికి ఎంతగానో కృషి చేసినా దేశ విభజనను నివారించడంలో గాంధీ విఫలమయ్యారు. 1947 ఆగస్టు తరువాత భారతదేశంలో ఉండిపోయిన ముస్లింలకు హిందువులతో పాటు సమాన హక్కులు లభించేందుకు ఆయన కృతనిశ్చయంతో పనిచేశారు. మైనారిటీల హక్కులను సంరక్షించేందుకై 1947 సెప్టెంబర్‌లో కలకత్తాలోను, 1948 జనవరిలో న్యూఢిల్లీలోను ఆయన నిరాహారదీక్షలు నిర్వహించారు. ఈ రెండు దీక్షల మధ్య కాలంలో 1947 నవంబర్‌ 15న న్యూఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ మౌలిక లక్ష్యాలకు పార్టీ సభ్యులందరూ కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. హిందూ–ముస్లిం ఐక్యతకు కృషి చేయడం కాంగ్రెస్‌ స్వతస్సిద్ధ స్వభావమని, గత ఆరు దశాబ్దాలుగా అందుకు కాంగ్రెస్‌ చేస్తున్న కృషిని మరింత సమగ్రంగా కొనసాగించాలని ఆయన కోరారు.


గాంధీ స్వరాజ్‌ నాలుగో మూల స్తంభమైన అహింసా సాధన గురించి చూద్దాం. గాంధీ అహింసా ప్రవక్త. ప్రజా జీవితంలో అహింసా పద్ధతులకు ఆయన ప్రాధాన్యమిచ్చారు. తన తుది శ్వాస వరకు అహింసను మనసా వాచా కర్మణా ఆచరించారు. దక్షిణాఫ్రికాలోని భారతీయుల హక్కుల కోసం చేస్తున్న కృషిలో భాగంగా గాంధీ 1909 వేసవికాలంలో లండన్ నగరానికి వెళ్లారు. ఆ రోజుల్లోనే భారతీయ యువకుడు ఒకరు ఒక బ్రిటిష్‌ ఉన్నతాధికారిని తుపాకీ కాల్పులతో హతమార్చాడు. ఈ ఘటన గాంధీని భీతావహుడిని చేసింది. ఆయన ఇలా రాశారు: ఇటువంటి హింసాత్మక చర్యలతో బ్రిటిష్‌ వారు భారత్‌ నుంచి నిష్క్రమించినా వారి స్థానంలో దేశ పాలకులు అయ్యేది ఎవరు? ఈ ప్రశ్నకు ఏకైక సమాధానం: హంతకులు. ఆ హంతకులు శ్వేత జాతీయులైనా లేక నల్ల జాతీయులైనా వారి పాలన నుంచి భారత్‌ ప్రయోజనం పొందదు, పొందలేదు’.

లండన్‌ ఘటన సంభవించిన రెండు దశాబ్దాల అనంతరం భారత్‌లో యువ విప్లవకారుల ‘హింసారాధన’ను గాంధీ ఎదుర్కోవలసి వచ్చింది. శ్వేత జాతీయులైన అధికారులను హతమార్చడమే దేశం నుంచి బ్రిటిష్‌ వారిని వెళ్లగొట్టేందుకు ఏకైక మార్గమని ఆ యువ విప్లవకారులు విశ్వసించారు. ‘ఒంటరిగా పాల్పడే సాహసోపేత చర్యల వల్ల ఒక పరాధీన దేశం స్వాతంత్ర్యం పొందలేదని’ ఆ యువ విప్లవకారులకు గాంధీ నచ్చచెప్పారు. స్వేచ్ఛా మందిరం నిర్మాణానికి వేలాది స్త్రీ పురుషుల, యువజనుల, వృద్ధుల సంఘటిత నిర్మాణాత్మక ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు. దేశ స్వాతంత్ర్యం లేదా సమాజంలో మార్పు కోసం ప్రాణాలు అర్పించడానికి వెనుకాడని యువ విప్లవకారుల ధైర్య సాహసాలను ఆయన అంగీకరించారు. అయితే సాయుధ విప్లవాలతో ప్రపంచం విసుగు చెందిందని గాంధీ అభిప్రాయపడ్డారు. అహింసాయుత పోరాటం ద్వారా ప్రభావవంతమైన మార్పును సాధించవచ్చని మహాత్ముడు అన్నారు.


స్వరాజ్‌కు గాంధీ విశిష్ట నిర్వచనమిచ్చి వంద సంవత్సరాలకు పైగా గడచిపోయింది. మరి ప్రస్తుత కాలంలో ఆ భావన, నాలుగు మూలస్తంభాలు ఎలా ఉన్నాయి? స్వతంత్ర భారతదేశ రాజ్య వ్యవస్థ విధులు, బాధ్యతల విషయమై గాంధీ స్వయంగా ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే పాలనా పద్ధతులను విమర్శించేవారిని సంవత్సరాల తరబడి జైలులో ఉంచడానికి ప్రస్తుతం అమలులో ఉన్న శిక్షార్హమైన చట్టాలు, వాటి దుర్వినియోగంపై ఆయన తప్పకుండా దిగ్భ్రాంతి చెందేవారు. దేశ ప్రజల్లో మతపరమైన విభేదాలు సృష్టించేలా ఉంటున్న హోంమంత్రి, ప్రధానమంత్రి, అసోం, యూపీ, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రసంగాలు, వ్యాఖ్యలకు ఆయన తప్పకుండా భీతావహుడు అయ్యేవారు. పూర్తిగా అహింసాయుత పద్ధతులకు కట్టుబడి సూత్రబద్ధంగా సాగుతున్న ఉద్యమాలు, మరీ ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలు, రైతుల పోరాటాలు, పర్యావరణ ఉద్యమాలు, ఇటీవలి విద్యార్థుల ఆందోళనలను ఆయన తప్పక అభినందించేవారు. దళితులు, మహిళలు, మైనారిటీలకు సమానహక్కులు, సమత్వ, సుస్థిర ఆర్థికాభివృద్ధి నమూనా, మనసా, వాచా, కర్మణా అహింసను ఆచరించడం– స్వేచ్ఛకు ఇవే అత్యంత ఆవశ్యకమైన నిబంధనలుగా మిగిలి ఉన్నాయి. వర్తమాన భారతదేశంలో గాంధీ స్వరాజ్‌ నాలుగు మూల స్తంభాలలో ప్రతి ఒక్కటీ బలహీనపడిపోయింది. ప్రభుత్వ చర్యల వల్లే కాకుండా అనేక సందర్భాలలో పౌరుల చర్యల వల్ల కూడా మరింత బలహీనపడ్డాయి. గాంధీ ఊహించిన స్వరాజ్‌ నిర్మాణం ఇంకా కూలిపోనప్పటికీ అది ఎంత మాత్రమూ బలంగా, స్థిరంగా లేదు.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

ఇవీ చదవండి:

స్కూల్‌ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!

Updated Date - Oct 02 , 2026 | 04:51 AM