ఢిల్లీ పాలనలో ఆప్ చెరగని ముద్ర!
ABN , Publish Date - May 02 , 2026 | 12:47 AM
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించడం మూడు రకాల ప్రతిస్పందనలను పురిగొల్పింది. మొదటిది– ఫిరాయింపుదారులపై ఏహ్యత. వారు సిగ్గూ శరమూ లేని...
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించడం మూడు రకాల ప్రతిస్పందనలను పురిగొల్పింది. మొదటిది– ఫిరాయింపుదారులపై ఏహ్యత. వారు సిగ్గూ శరమూ లేని అవకాశవాదులు అనే ఈసడింపు బాగా వ్యక్తమయింది. రెండోది– ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుపట్టడం. పార్టీలో సర్వాధినేతగా వెలిగిపోయేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే వ్యక్తిపూజను ప్రోత్సహిస్తున్నారని, తత్కారణంగా సమర్థులైన పలువురు నాయకులు ఆప్ నుంచి వెళ్లిపోవలసి వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మూడోది– వివేచనాపరులైన హిందూత్వ వ్యతిరేకులు ఎవరూ అసలు ఆప్‌కు ఓటు వేయరనే అనే వాదనను ముందుకు తీసుకువచ్చింది. ఆప్ ఆవిర్భావానికి దారితీసిన అవినీతి నిర్మూలనా ఉద్యమం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతుతోనే జరిగినందున ఆప్‌ను సమర్థించడమేమిటని ఆ వాదన చేస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పదే పదే తానూ హిందూ మతస్థుడినేనని బహిరంగంగా చాటుకోవడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మత వివక్షకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో రోజుల తరబడి శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలకు.. కేజ్రీవాల్ సంఘీభావం తెలుపకపోవడాన్ని కూడా పలువురు ఆక్షేపించారు.
ఈ విమర్శలు అన్నిటిలోనూ సమంజసత్వమున్నది, సందేహం లేదు. నైతిక విశ్వాసాలు, భావజాల నిబద్ధతతో కాకుండా ఆర్థిక ప్రలోభాలు, అవినీతి ఆరోపణలపై సంభావ్య దర్యాప్తులకు భయపడే ఈ ఫిరాయింపులు జరిగాయనేది స్పష్టం. ఆప్ విపత్కర పరిస్థితి ఈ వ్యాస రచయితకు ఒక విధమైన విచారాన్ని కలిగిస్తోంది. ఆలోచనాత్మకమైన విచారమది. ఆప్ తన పదమూడు సంవత్సరాలకు పైగా అస్తిత్వంలో భారత ప్రజాస్వామ్యాన్ని ప్రగాఢం చేసే మేలు పనులు కొన్ని చేసింది. ఇది విస్మరించకూడని వాస్తవం.
ఆప్‌ను ప్రశంసించేందుకు మరొక ప్రముఖ కారణం కూడా ఉన్నది. ఢిల్లీలో అధికారంలో ఉండగా పాలనా వ్యవహారాలలో ఆ పార్టీ ప్రభుత్వం అమలుపరచిన సంస్కరణలు. పాఠశాల విద్యలో ఆ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలిచాను. 2015లో ఆప్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాల విద్యారంగానికి నిధుల కేటాయింపును ఇతోధికంగా పెంచింది. ప్రభుత్వ పాఠశాలలోని సదుపాయాలను మెరుగుపరిచేందుకు పూనుకుంది. కొత్త పాఠశాలల నేర్పాటు చేసింది. ఉన్న పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించింది. తరగతి గదుల్లో బోధనా సదుపాయాలను నవీకరణ చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సహేతుకంగా మరిన్ని అధికారాలు కల్పించింది. వారు తమ విచక్షణ ప్రకారం వినియోగించేందుకు నిధులు సమకూర్చింది. విద్యాశాఖ అధికారులపై ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటును ప్రధానోపాధ్యాయులకు కల్పించింది.
ప్రభుత్వ పాఠశాలలకు మరింత స్వతంత్ర ప్రతిపత్తిని సమకూర్చడంతో పాటు అభ్యసన ఫలితాలు బాగా మెరుగుపడేలా ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించడమే ఆప్ ప్రభుత్వ విద్యా సంస్కరణల లక్ష్యం. ‘బాల బాలికలందరికీ పఠనం, లేఖనం, అంకగణితంలో గట్టి పునాదులు నిర్మించడమే లక్ష్యంగా బోధనా కార్యక్రమాలను రూపొందించారని’ యామినీ అయ్యర్ తన పరిశోధనా గ్రంథం ‘Lessons in State Capacity from Delhi's Schools’ లో రాశారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు బాలల అభ్యసన స్థాయిని బట్టి తరగతులను మూడు విధాలుగా పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా రూపొందించిన బోధనా కార్యక్రమాలను అమలుపరిచేందుకు మెంటార్ టీచర్లు అనే కొత్త ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఎంపిక చేసి నియమించారు. వేసవి సెలవుల్లో బాలలకు పుస్తక పఠన మేళాలు నిర్వహించారు. కొత్త పాఠ్య పుస్తకాలను రూపొందించారు. జీవిత సత్యాలను బోధించే కథల ఆధారిత ‘హ్యాపీనెస్ కరిక్యులమ్’ను రూపొందించి అమలుపరిచారు. ఈ పాఠాలపై విద్యార్థుల సామూహిక చర్చలను ప్రోత్సహించారు.
ఆప్ అధికారంలోకి వచ్చిననాటికి ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయి ఉందని, అయినా దానిని కొత్త దిశలో మెరుగ్గా ముందుకు నడిపించడంలో ఆప్ సర్కార్ సఫలమైందని యామిని ప్రశంసించారు. ఈ సంస్కరణల సాఫల్యానికి ప్రధాన కారకుడు విద్యామంత్రి మనీష్ సిసోడియా. విద్యారంగంపై సిసోడియా దృక్పథంలో నాలుగు విశిష్ట గుణాలు ఉన్నాయని ఆయనతో కలిసి పనిచేసిన విద్యావేత్త ఒకరు నాకు చెప్పారు. వాటిలో మొదటిది– ఉపాధ్యాయుల పట్ల గౌరవ భావం; బోధనా వృత్తి ప్రాముఖ్యత, పవిత్రత పట్ల సంపూర్ణ అవగాహన. రెండోది– పాఠశాలలు, తల్లిదండ్రుల మధ్య ప్రగాఢ సంబంధాలను పెంపొందించేందుకు సిసోడియా ఇచ్చిన అగ్ర ప్రాధాన్యం. మూడోది– బాలల అభ్యసనంపై దృష్టిని కేంద్రీకరించాలని పాఠశాలలను ప్రేరేపించడం. చదువులో వెనుకబడినవారికి అవకాశాలు కల్పించి వారి ఎదుగుదలకు తోడ్పడాలని ఉపాధ్యాయులకు పదే పదే చెప్పేవారు. నాల్గవది– పాఠ్య ప్రణాళికలను, సమస్త విద్యా బోధన ప్రక్రియను మానవతా దృక్కోణంలో రూపొందించేందుకు సిసోడియా నిరంతర కృషి. విద్య పట్ల ఆయన దృక్పథం ప్రజా కేంద్రితమైనది. పాఠశాల వ్యవస్థతో ప్రమేయమున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బాలల శ్రేయస్సుకు అగ్ర ప్రాధాన్యమిచ్చేది.
సిసోడియాలోని మరొక విలక్షణతను కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను. అది: వినయశీల ఉత్సుకత. విద్వజ్ఞులు, విద్యారంగంలో కృషి చేస్తున్న ఎన్జీఓలు చెప్పే విషయాలను శ్రద్ధగా విని, పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారి సలహాలు తీసుకుని పాటించడమనేది మన రాజకీయవేత్తలలో చాలా అరుదు. ఇటువంటి విశిష్ట గుణం సిసోడియాలో ఉన్నది. ఆయన అందరికీ అందుబాటులో ఉంటారు. ఎటువంటి భేషజాలకు పోకుండా ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటారు. తగిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. సిసోడియా క్రమబద్ధంగా పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించేవారు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే విద్యా వ్యాసంగాలపై అభిరుచి ఉండి, విద్యారంగ పరిస్థితులను మెరుగుపరచడంపై నిబద్ధత ఉన్న అధికారుల బృందం నొకదాన్ని ఆయన సమీకరించారు. దురదృష్టవశాత్తు 2020 తరువాత ఈ విద్యా సంస్కరణల పురోగతి కుంటుపడింది. కోవిడ్ ఉపద్రవం ఇందుకొక పాక్షిక కారణం కాగా, ఆ ఏడాది ఆప్ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు మళ్లీ అధికారం అప్పగించడంతో ఆ సర్కార్‌పై కేంద్రం వ్యతిరేకత మరింత తీవ్రమయింది. పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో విద్యామంత్రితో కలిసి ప్రశస్త కృషిచేసిన పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను 2022లో అరెస్ట్ చేశారు. 2023లో సిసోడియా సైతం జైలుకు వెళ్లారు; 2024లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌నే అరెస్ట్ చేసి జైలులో నిర్బంధించారు. ఆప్ పట్ల కేంద్ర ప్రభుత్వ రాజకీయ శత్రుత్వం, కక్షసాధింపు వైఖరి కారణంగానే ఈ పరిణామాలు సంభవించాయి. ఫలితంగా, భ్రష్టుపట్టిన ప్రభుత్వ విద్యా వ్యవస్థను మౌలికంగా మెరుగుపరిచేందుకు ఆప్ సర్కార్ చేపట్టిన దార్శనిక విద్యా సంస్కరణలు మందగించాయి.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజారోగ్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచేందుకు ఆప్ ప్రశస్త కృషి చేసింది. 2019లో ఢిల్లీ ఐఐటీ పరిశోధకుల బృందం నివేదిక ఒకటి ఇలా పేర్కొంది: ‘ఆప్ సర్కార్ నెలకొల్పిన మొహల్లా క్లినిక్‌లు మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య భద్రతా సదుపాయాలు అందుబాటులో ఉండడంతో పాటు వ్యయాలు.. కాయకష్టంపై బతికే సామాన్య పౌరులు భరించదగిన స్థాయిలో ఉంటున్నాయి. పట్టణ పౌర సదుపాయాలు అధ్వానంగా ఉన్న ప్రాంతాలలో ఈ క్లినిక్‌లను నెలకొల్పడం వల్ల ఆరోగ్యసేవలను చాలా సమీపంలో సత్వరమే పొందడం పేదలకు సాధ్యమవుతోంది.’
కేంద్ర ప్రభుత్వ నిర్విరామ వ్యతిరేకత నడుమ ఆప్ సర్కార్ ఆరోగ్య భద్రత, విద్యా రంగాలలో సంస్కరణలను అమలుపరిచింది. పంజాబ్‌లో ఆప్ అధికారానికి వచ్చిన పిమ్మట ఈ వ్యతిరేకత మరింత తీవ్రమయింది. ఆప్ ఎదుగుదలను అదుపు చేయకపోతే ఉత్తరాది రాష్ట్రాలలో తమ ప్రాబల్యానికి ఆ పార్టీ అవరోధమవుతుందని బీజేపీ భయపడింది. ఆ కారణంగానే ఆప్ అగ్ర నాయకులను అరెస్ట్ చేసి, వారిని అప్రతిష్ఠ పాలు చేసేందుకు పూనుకున్నది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనూ ఆప్ పోటీదారుగా లేదు. ప్రధాన పోటీదారుల్లో ఒకటైన బీజేపీ హిందూ స్వాభిమానం, అధికారంలోకి వస్తే తాము అమలుపరిచే నగదు సహాయక పథకాల గురించి మాట్లాడింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకెలు బెంగాలీల, తమిళుల ఆత్మగౌరవం, నగదు పంపిణీ రూపేణా సమకూర్చే సంక్షేమ పథకాల గురించి మాట్లాడాయి. ఎన్నికల ప్రచారంలో ఈ పార్టీలు ఎక్కడా పాఠశాల విద్యా వసతుల మెరుగుదల, ఆరోగ్య భద్రతా సదుపాయాల గురించి మాట్లాడనే లేదు. ప్రజలకు దీర్ఘకాలిక సుఖసంతోషాలను ఖాయం చేసేవి ఏమిటి? తక్షణ ఖర్చులకు ఒక వేయి రూపాయలు ఉదారంగా అందుబాటులో ఉంచడం లేదా మరొకరి ధార్మిక విశ్వాసాలను తక్కువ చేస్తూ సొంత మతాన్ని కీర్తించుకోవడమా?! వాటి కంటే బాలల భావి జీవితానికి దృఢమైన పునాదులు వేసే ప్రశస్త పాఠశాలలు, ఆరోగ్యానికి భద్రత కల్పించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే చాలా చాలా ముఖ్యం కాదూ?
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ