చారిత్రక బాధ్యతగా గాంధీ సందేశ యాత్ర
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:35 AM
ఇటీవల నేను శ్రీలంకలోని శాంకరీదేవి శక్తిపీఠాన్ని, సీతమ్మ వాటికను సందర్శించాను. ట్రింకోమలీ పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా దర్శించాను...
ఇటీవల నేను శ్రీలంకలోని శాంకరీదేవి శక్తిపీఠాన్ని, సీతమ్మ వాటికను సందర్శించాను. ట్రింకోమలీ పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా దర్శించాను. అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు గాంధీ జయంతిని తామంతా పండుగలా జరుపుకుంటామని వారు చెప్పిన మాటలు విని, భావోద్వేగానికి లోనయ్యాను. పరాయిదేశంలో గాంధీ పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు నా మనస్సు పులకరించింది.
200 ఏళ్ళ బ్రిటిష్ వలస పాలనలో బానిసత్వం అనుభవించిన భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు ప్రజలందరినీ ఐక్యం చేసిన మహానాయకుడు గాంధీ. ఆ స్ఫూర్తితో ఆనాటి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కోట్లాది కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఒకటి. మా పెదనాన్న దివంగత శ్రీరామరెడ్డి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు. ఆ కాలంలో హిందూపురానికి గాంధీ వచ్చినప్పుడు, మా తండ్రి దివంగత కావేరప్ప... నీలకంఠాపురం గ్రామం నుంచి కాలినడకన హిందూపురానికి వెళ్ళి గాంధీ సందేశాన్ని విని, ఆ స్ఫూర్తితో గ్రామంలో దళితులను దేవాలయ ప్రవేశం చేయించాడు. గాంధీ ఆలోచనల స్ఫూర్తితో మా (ఉమ్మడి) కుటుంబంలో ఇప్పటికి సుమారు పది కులాంతర వివాహాలు జరిగాయి. మా కుటుంబం చేపడుతున్న ప్రతి సేవా కార్యక్రమం వెనుక గాంధీ స్ఫూర్తి ఉంది.
ఈ రోజు భారతదేశంలో మనమంతా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామంటే అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులతో పాటు గాంధీ నాయకత్వం కూడా ప్రధాన కారణం. అశేష ప్రజాకర్షణ, సమ్మోహనశక్తి, త్యాగనిరతితో స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను కదిలించిన ఆయన నాయకత్వానికి ముగ్ధుడైన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీని మహాత్మునిగా సంబోధించాడు. తనను మహాత్ముడిగా ఆరాధించవద్దని చెప్పిన వినమ్రనేత గాంధీ. సుభాష్ చంద్రబోస్ ఆయనను ‘జాతిపిత’గా అభివర్ణించాడు. దక్షిణాఫ్రికా నల్లజాతి యోధుడు నెల్సన్ మండేలా, అమెరికా మానవ హక్కుల యోధుడు మార్టిన్ లూథర్‌కింగ్ వంటి నాయకులు గాంధీ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొంది, తమ దేశాల్లో ప్రజల హక్కుల కోసం ఉద్యమించారు. ‘‘రక్తమాంసాలు కలిగిన ఇలాంటి మనిషి ఒకరు నిజంగా ఈ భూమిపై నడయాడారని భవిష్యత్ తరాలు నమ్మకపోవచ్చు’’ అంటూ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అన్నాడంటే గాంధీ ఎంతటి చారిత్రక పురుషుడో అర్థమవుతుంది. అలాంటి గాంధీని నాథూరామ్‌గాడ్సే 1948, జనవరి 30న ఢిల్లీలో తుపాకితో కాల్చి చంపాడు.
స్వాతంత్య్రోద్యమంతో ఏ మాత్రం ప్రమేయంలేని కొందరు, కుటిల రాజకీయాల కోసం గాంధీ జీవితంపై అసత్యాలతో, వక్రీకరణలతో ఒక పథకం ప్రకారం వ్యతిరేక ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. గాంధీ త్యాగాలను, ఆలోచనలను కించపరుస్తూ, అవహేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆయనపై కొందరు బాహాటంగా విద్వేషాన్ని వెదజల్లే దుస్థితి నేడు దాపురించింది. గాంధీని, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఆనాటి త్యాగమూర్తులను అవమానించడమంటే మన దేశాన్ని, మన స్వాతంత్య్ర పోరాట చరిత్రను అవమానించుకోవడమే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం ఆవేదన కలిగిస్తోంది. ఏ ప్రభుత్వం ఉన్నా గాంధీ పేరును భవిష్యత్ దార్శనిక పథకాలకూ, మరిన్ని సంస్థలకూ విస్తరించి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందివ్వాలి. అంతేగానీ ఉన్న పేర్లను తొలగించకూడదు.
గాంధీ స్ఫూర్తితో ఆయన తరువాతి తరం దేశం కోసం, సమాజం కోసం చాలా మేరకు నిజాయితీగా, సేవాదృక్పథంతో పనిచేసింది. ఇప్పుడు గాంధీ గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ మాత్రం ప్రభావం కాలేని కొత్తతరం దేశంలో ఉన్నది. ఇది సహజ పరిణామమే. దేశంలో నేడు ప్రభావశీలకంగా ముందుకొచ్చిన ప్రతికూల విద్వేష భావజాలం, నేటి తరానికి స్వాతంత్య్రోద్యమ వాస్తవ చరిత్రను కాకుండా వక్రీకరణలతో కూడిన చరిత్రను నూరిపోయడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఎంత వికృతంగా మారిందంటే జాతిపిత పైనే తప్పుడు ప్రచారం చేసేటంతగా. ఉదాహరణకు– గాంధీ బ్రిటిష్ ఏజెంట్ అనీ, పాకిస్థాన్ ఏర్పాటుకు కారకుడనీ, ముస్లింల పక్షపాతి అనీ, హిందువుల వ్యతిరేకి అనీ... ఇలా ఇష్టానుసారం ప్రతికూలశక్తులు ప్రచారం చేస్తున్నాయి. అమాయక యువత ఆ అవాస్తవాలను నమ్మి తమ మెదళ్లలో తప్పుడు భావాలను నింపుకుంటోంది.
సత్యం, సత్యాగ్రహం, అహింస, మానవత, ప్రేమ, పరమత సహనం, జాతీయ ఐక్యత, సర్వోదయ, స్వదేశీ, అంటరానితనం నిర్మూలన, నైతిక విలువలు, గ్రామస్వరాజ్యం, స్త్రీ పురుష సమానత్వం, తదితర సిద్ధాంత, కార్యాచరణలతో యావత్తు దేశాన్ని మేల్కొలిపి సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దిన మహాఋషి గాంధీ. ఆయన ఆలోచనలను నేటితరానికి, భవిష్యత్ తరాలకూ అందించాల్సిన చారిత్రక బాధ్యత గాంధీ అభిమానులందరిపై ఉంది.
మహాత్మాగాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 28, 29, 30 తేదీలలో నీలకంఠాపురం గ్రామం నుంచి హిందూపురం (గాంధీచౌక్) వరకూ మూడు రోజులపాటు ‘మహాత్మాగాంధీ సందేశయాత్ర’ పేరుతో పాదయాత్ర చేయాలని సంకల్పించాను. రాజకీయాలకు అతీతంగా చేపట్టే ఈ యాత్రలో శాంతి, సామరస్యం, మానవత, సమతలను కోరుకునే వారంతా సంఘీభావాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.
డా. ఎన్.రఘువీరారెడ్డి
మాజీ మంత్రి
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ సమావేశానికి మరోసారి శశి థరూర్ డుమ్మా.. ఈ సారి కారణమేంటంటే..
యాసిడ్ దాడి కేసుల్లో నిందితుల ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు.. ప్రశ్నించిన సుప్రీం