డెబ్భై ఎనిమిది ఏళ్ల తర్వాతా ఇష్టానుసారంగా కట్టుకథలు!
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:44 AM
భారతదేశంలో సుప్రసిద్ధ ఆధునిక చరిత్రకారులలో ఒకరైన ప్రొఫెసర్ మృదులా ముఖర్జీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)...
భారతదేశంలో సుప్రసిద్ధ ఆధునిక చరిత్రకారులలో ఒకరైన ప్రొఫెసర్ మృదులా ముఖర్జీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అధ్యక్షురాలిగా సేవలందించారు. తన భర్త ఆదిత్య ముఖర్జీ, ప్రసిద్ధ చరిత్రకారుడు బిపిన్‌చంద్రతో కలసి జాతీయోద్యమ చరిత్రపై ప్రామాణిక గ్రంథం రాశారు. నేడు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధేయ విలువలపై ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు.
గాంధేయ విలువలు ఇప్పటికీ ఉపకరిస్తాయా?
జవాబు: మన దేశాన్ని, మన సమాజాన్ని మత ప్రాతిపదికన విభజిస్తున్న శక్తులను ఓడించడానికి గాంధేయ విలువలు మాత్రమే ఉపయుక్తమవుతాయి. గతంలో కంటే ఇవాళ వాటి ప్రాధాన్యం, ప్రాముఖ్యం మరింత పెరిగింది. మతసామరస్యాన్ని పెంపొందించడం కోసం గాంధీజీ తుదిశ్వాస వరకూ పోరాడారు. దాని కోసమే ప్రాణాలు సైతం అర్పించారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి మహాత్ముడి కంటే ఉత్తమమైన ఉదాహరణ మరొకటి లేదు. ఆయన గొప్ప దైవభక్తుడు. అయినప్పటికీ, పూర్తి లౌకికవాది. అన్ని మతాలు సమానమని, మతాలన్నీ ఒకే చెట్టు కొమ్మలనీ నమ్మారు. ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, సిక్కులు... ఇలా అన్ని మత సమూహాలలోనూ గాంధీజీకి ఆత్మీయులు, ప్రాణ మిత్రులున్నారు.
మనం గాంధీని ఏ మాత్రం అర్థం చేసుకున్నాం?
భారతీయులుగా మనం ఇప్పటి వరకూ అర్థం చేసుకున్నదానికంటే ఇంకా బాగా బాపూజీని తెలుసుకోవాలి. వర్తమానంలో అది మరీ అవసరం. బాపూజీ పోరాట యోధుడు మాత్రమే కాదు, అహింసాత్మక పోరాట వీరుడు. ఆయన పోరాటాలు వైవిధ్యమైనవి, విభిన్నమైనవి. బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు, అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. మతపరమైన వివక్షలను, అసమానతలను తీవ్రంగా నిరసించారు. మహిళలను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సుమారు 110 సంవత్సరాల కిందటే కౌలుదారుల హక్కుల కోసం పోరాడారు. చంపారన్ ఉద్యమం అదే. అప్పుడే అహ్మదాబాద్‌లో కార్మికుల హక్కుల కోసమూ ఉద్యమించారు. తరువాత సంవత్సరం ఖేడా రైతు సత్యాగ్రహం చేపట్టారు. ఏకకాలంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ప్రతికూలతలపై అహింసా మార్గాన గాంధీ చేపట్టిన ఇటువంటి అనేకానేక పోరాటాలను గమనిస్తే... అవన్నీ విప్లవాత్మకమైనవే. ముఖ్యంగా ఆ ఉద్యమాలన్నీ లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద భావాల పునాదిగా కొనసాగాయి. సఫలమయ్యాయి కూడా. ఇతర దేశాలలోనూ మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, సీజర్ చావెజ్ లాంటి నాయకులు ఎంతోమంది గాంధీ బోధించిన సత్యం, అహింస, సత్యాగ్రహ మార్గాలను ఆశ్రయించారు. తద్వారా అనూహ్యమైన విజయాలు సాధించారు.
హత్యకు గురైన 78 ఏళ్ల తరువాత కూడా ఆయనపై ఎందుకీ విద్వేష ప్రచారాలు?
ఎందుకంటే, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమానత్వం, దయ, కరుణ, సౌభ్రాతృత్వం, సుహృద్భావం తదితర విలువలకు ఆయన ప్రతీక. ఆ విలువలను నాశనం చేయాలనుకునే అధికార శక్తులకు బాపూజీ కూడా ప్రధాన శత్రువుగానే కనిపిస్తారు. కనుకనే, మహాత్ముడిపై ఇష్టానుసారంగా కట్టుకథలు అల్లి ప్రచారంలో పెడుతున్నారు. గాంధీజీపై ద్వేషాన్ని రగిలించడం ద్వారా భారతీయ సమాజంలో విద్వేషాన్ని పెంపొందించడమే ట్రోలర్ల ప్రధాన లక్ష్యం.
భగత్‌సింగ్ జీవితంలో గాంధీ పాత్ర ఏమిటి?
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల ప్రాణాలు కాపాడడానికి మహాత్ముడు శాయశక్తులా ప్రయత్నించారు. ఉరిశిక్ష రద్దు చేయాలని, కనీసం వాయిదా వేయాలని కోరారు. అందుకు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఒప్పుకోలేదు. భగత్‌సింగ్ తన చివరి రోజుల్లో సాయుధ పోరాటమార్గాన్ని వ్యతిరేకించారు. బాంబులు విసరడం, పిస్టళ్లతో కాల్చడం వల్ల ప్రయోజనం లేదని తన రచనల్లోనూ ప్రస్తావించారు. హింసాత్మక సంస్కృతికి తాను వ్యతిరేకమని ప్రకటించారు. ప్రజా ఉద్యమాలు అహింసాయుత మార్గంలో నిర్మితమవ్వాలని భగత్‌సింగ్ ఆకాంక్షించారు.
తనతో విభేదించిన వ్యక్తులను గాంధీజీ శత్రువులుగా పరిగణించేవారన్న ఆరోపణలో వాస్తవం ఎంత?
అందులో లేశమాత్రం కూడా నిజం లేదు. ప్రత్యర్థులను సైతం మిత్రులుగా భావించిన గొప్ప ప్రజాస్వామికవాది గాంధీజీ. విమర్శకులను సైతం సరికొత్త ఆలోచనలను అందించే శ్రేయోభిలాషులుగానే ఆయన భావించారు. వ్యక్తిని, వ్యక్తి అభిప్రాయాలను వేర్వేరుగా చూశారు. ‘తప్పును వ్యతిరేకించు, తప్పు చేసిన వ్యక్తిని కాదు’ అన్నది ఆయన సిద్ధాంతం. ‘బ్రిటీషు వారిని ద్వేషించవద్దు. తెల్లజాతీయులను, క్రైస్తవులను వ్యతిరేకించవద్దు. కేవలం బ్రిటీషు వలస పాలనను మాత్రమే నిరసించండి’ అని జాతీయోద్యమంలో భారతీయులకు బాపూజీ పిలుపునిచ్చారు.
అంబేడ్కరిస్టులు, వామపక్షవాదులు గాంధీజీని అర్థం చేసుకున్నారా?
లేదు, వారు గాంధీజీని పూర్తిగా అర్థం చేసుకోలేదు.
గాంధీపై అంబేడ్కర్ విమర్శలనో?
వాటిని ఒక దృక్పథంగా మాత్రమే చూడాలి. అంతేతప్ప, అదే అంతిమ సత్యం కానక్కర్లేదు.
నేటి సమాజంలోని విద్వేష సంస్కృతిని నిలువరించే శక్తి గాంధేయవాదానికి ఇంకా ఉందంటారా?
కచ్చితంగా ఉంది. గాంధేయవాదాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరిస్తే అసహనాన్ని, ద్వేష భావాలను నియంత్రించడం సాధ్యమే. నేటితరం గాంధీ ఒరిజినల్ రచనలు చదవాలి. గాంధీపై బీఆర్ నందా, లూయి షిషర్, కృష్ణ కృపలానీ వంటివారు రాసిన పుస్తకాలు చదవాలి. ఆయన చేపట్టిన ఉద్యమాలను, మరీ ముఖ్యంగా, చివరి రోజుల్లో మతతత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఈ తరం అధ్యయనం చేయాలి.
ఇంటర్వ్యూ: కారుసాల వెంకటేశ్
ఇవీ చదవండి:
స్కూల్ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!