Share News

ఆశుకవితా నిధి ‘గాడేపల్లి’

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:40 AM

తెలుగు నేలపై గొప్ప గొప్ప కవులెందరో ఉన్నారు. వారిలో గాడేపల్లి వీరరాఘవశాస్త్రి ఒకరు. అయితే చాలామంది కవులని ఈ తరం వారు మరచిపోతున్నారు. వీరరాఘవశాస్త్రి మార్కాపురం జిల్లాలోని...

ఆశుకవితా నిధి ‘గాడేపల్లి’

తెలుగు నేలపై గొప్ప గొప్ప కవులెందరో ఉన్నారు. వారిలో గాడేపల్లి వీరరాఘవశాస్త్రి ఒకరు. అయితే చాలామంది కవులని ఈ తరం వారు మరచిపోతున్నారు. వీరరాఘవశాస్త్రి మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం, గడ్డమీదపల్లి అనే పల్లెటూరులో 1891, ఏప్రిల్‌ 30న జన్మించారు. వీరిది పండిత వంశం. కడుబీద కుటుంబంలో జన్మించారు. వీరు తండ్రిగారి వద్ద, రాళ్లభండి నృసింహశాస్త్రి, మేడవరం సుబ్రహ్మణ్యశర్మ, భారతుల నృసింహశాస్త్రిల వద్ద శిష్యరికం చేసి, అనేక గ్రంథాలను అభ్యసించారు.

గద్వాల నుంచి చెన్నపట్టణం వరకు ఆంధ్రదేశం అంతటా సంచారం చేసి అనేక అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తొలుత మార్కాపురంలో ఆంధ్రపండితునిగా పనిచేశారు. గద్వాల సంస్థానం ప్రధాన కవిగా నియమితులయ్యారు. ఆశు రచనలో తిరుపతి వేంకట కవులంతటి వారని ప్రతీతి. వీరు అనేక గ్రంథాలు రచించారు. అహోబల మహాత్మ్యము, త్రిపురాంతక మహాత్మ్యము, మార్కండేయ చరిత్ర ముద్రితములు. ఇంకా అనేక ఘంటా శతకములు రాశారు. రామభూపతి శతకము, దీనకల్పద్రుమ శతకము, విశ్వేశ్వర శతకము, చెన్నకేశవ శతకము, వేంకటేశ్వర శతకము, సోమేశ్వర శతకము... ఇవికాక ఆర్యవిద్యాప్రబోధిని, భగవద్గీత, ముకుందమూల, పింగళ (హరికథ), సత్య వరలక్ష్మి ధ్రువచరిత్ర, సత్యనారాయణ స్థల పురాణము, సాంబలక్షణ, హైమవతి పరిణయము, భూగంగాస్తుతి, మార్కండేయ నాటకము, సీతా కళ్యాణము (ద్విపద), కుమార సుబ్రహ్మణ్య చరిత్ర, మెదకు సంస్థానాధీశుల చరిత్ర, హరివంశము, ఐరావత వ్రతకథలు రచించారు. పత్రికలలో అనేక విషయాలనూ కూలంకుష విమర్శతో పెక్కు వ్యాసాలు రాశారు.

వీరి అష్టావధానాలు, శతావధానాలు 78కి పైగా లభ్యమవుతున్నాయి. దుష్కర ప్రాసలతో కూడిన అనేక సమస్యలను అలవోకగా పూరించేవారు. ఈయన కొప్పరపు కవుల సమకాలీనుడు. వారిని ఓ సందర్భంలో ఓడించాడు కూడా. పటుతర ధారణాపటిమగల వారని గాడేపల్లి వారిని గూర్చి బుక్కపట్టణము శ్రీనివాసచార్యులు అన్నారు. అష్టావధానాలు, శతావధానాలు మంచినీళ్ల ప్రాయంగా చేసేవారని సహజ పాండిత్య వంశోద్భవులని సమకాలీన కవులు కొనియాడారు.

వీరు చెప్పిన 84 చరణాల ఉత్పలమాలిక అద్భుత నడకలో సాగుతుంది. వీరు ఆశువుగా చెప్పిన లభ్యమైన పద్యాలు సేకరించి ముద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి ‘చమత్కార కవిత్వము’ అనే పుస్తకాన్ని అచ్చు వేయించారు. గాడేపల్లివారు 54 సంవత్సరాలు జీవించి 1945, మార్చి 5న తనువు చాలించారు.

తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్

కవి, శాసన పరిశోధకులు

(నేడు గాడేపల్లి వీరరాఘవశాస్త్రి జయంతి)

ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 12:40 AM