నిస్వార్థ ప్రజాసేవకుడు కొమ్మిడి నరసింహారెడ్డి
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:07 AM
నిష్కళంక కాంగ్రెస్ నాయకుడిగా జీవితాంతం ప్రజాసేవ చేసిన కొమ్మిడి నరసింహారెడ్డి ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో అవస్థపడిన ఆయన తన 82వ ఏట జూలై 7న నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు...
నిష్కళంక కాంగ్రెస్ నాయకుడిగా జీవితాంతం ప్రజాసేవ చేసిన కొమ్మిడి నరసింహారెడ్డి ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో అవస్థపడిన ఆయన తన 82వ ఏట జూలై 7న నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
భువనగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. వ్యక్తిగతంగా ఆయన ముక్కుసూటితనం, నిజాయితీ వల్ల ప్రజల్లో ‘అన్న’గా పేరు పొందారు. ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డితో రాజకీయ విభేదాల మూలాన ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. మాజీ శాసనసభ్యుడిగా కాంగ్రెస్‌లో నిలదొక్కుకోగలిగారు.
బీబీనగర్ దగ్గర బ్రాహ్మణపల్లిలో పుట్టి పెరిగిన నరసింహారెడ్డి కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది. ఆయన సోదరుడు కోదండరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా ఉన్నారు. 1948 తర్వాత కేంద్ర ప్రభుత్వ పోలీసు (మిలిటరీ) యాక్షన్ అణచివేత చర్యలలో అమరుడయ్యారు. ఆయనతో పాటు మరికొందరు ఎన్‌కౌంటర్ కాగా, బ్రాహ్మణపల్లిలో ఆ అమరుల విగ్రహాలకు ప్రతి సంవత్సరం నివాళి అర్పిస్తున్నారు.
నరసింహారెడ్డితో నాకు 1998 తర్వాత పరిచయం. మరో మిత్రుడు నల్లు నరసింహారెడ్డి కొమ్మిడివారికి చేదోడు వాదోడుగా చివరిదాకా నిలిచారు. తెలుగులో ఉద్యమ సాహిత్యం పట్ల వారిద్దరికీ అవగాహన ఉండేది. రాజకీయాలలో క్రియాశీలకంగా లేని కాలంలో కొమ్మిడివారు స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) ద్వారా ప్రజల అవసరాలకు సహాయంగా నిలిచారు. కొందరు అవకతవకల మూలాన న్యాయపరంగా కోర్టు కేసులను కూడా ఎదుర్కొన్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఏనాడూ అక్రమార్జనకు పాల్పడలేదు. తనకున్న పొలాలను, హైదరాబాద్‌లో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్ముకొని కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు, ఇద్దరు కుమారులను చదివించారు. చనిపోయే నాటికి ఆయనకు సొంత ఇల్లు లేదు. బ్రాహ్మణపల్లిలో శిథిలమైన ఇల్లు మిగిలింది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంలో కూడా ఆయన సతీమణి సుకన్య ధైర్యంగా ఆయనకు తోడుగా ఉండేవారు. మూడు సంవత్సరాల క్రితం ఆమె మరణించారు.
కొమ్మిడి నరసింహారెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించేవారు. కాంగ్రెస్‌లో ఏ ఒక్క శిబిరానికీ చెందకుండా, మాజీ శాసనసభ్యుడిగా తమ వంతు కృషి చేశారు. విద్యుచ్ఛక్తి సమస్యలపై భువనగిరిలో ఆయన కొన్ని రోజుల పాటు నిరాహారదీక్ష చేసి ప్రజానుకూల సంస్కరణలకు తోడ్పడ్డారు. వ్యక్తిగతంగా ప్రజాజీవితంలో– సామాజికంగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆయన ఆలోచించేవారు. ఆ దిశలో ఆయన ‘ప్రజాచైతన్య వేదిక’ను స్థాపించారు. జిల్లాలలో ప్రజాసదస్సులు నిర్వహించారు. నిజాం నాటి తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసి, చిన్న పుస్తకాలు ప్రచురించారు. ఆ ప్రజాచైతన్య వేదిక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. ముఖ్యంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఐజీపీ పోలీసు అధికారి థామస్ ప్రసంగం ప్రత్యేకమైనది. నాగార్జునసాగర్ నిర్మాణం సందర్భంలో సిమెంటు కొనుగోలులో సాగిన అవినీతి, అలాగే ఇతర రాజకీయ నాయకుల అక్రమాలు, తదితర అంశాలను థామస్ నిర్భయంగా వెల్లడిస్తూ ‘TELL ALL’ ‘అన్నీ చెప్పాలి’ అనే శీర్షికన గ్రంథం రచించారు. ఆ రోజుల్లో ఆ గ్రంథం చర్చనీయాంశమైంది. తర్వాత ఆయనపై నిరంతరం పోలీసు నిఘా ఉండేది. నరసింహారెడ్డికి థామస్‌తో మంచి స్నేహం. ఆనాటి ప్రెస్‌క్లబ్ సదస్సుకు నేనే అధ్యక్షత వహించాను.
నరసింహారెడ్డితో కొనసాగిన మూడు దశాబ్దాల స్నేహాన్ని నేను మరచిపోలేను. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలున్నా, రాజకీయాలలో నిజాయితీని ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తపనతో జీవించారు. ఆయనకు స్నేహాంజలి అర్పిస్తున్నాను.
నిఖిలేశ్వర్
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్