Share News

విదేశాల్లో చదివిన వీరు డాక్టర్లు కారా?

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:19 AM

విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన భారతీయులను ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ (ఎఫ్‌ఎంజీలు) అంటారు. వీరు భారతదేశంలో వైద్య వృత్తిని చేపట్టేందుకు అర్హత పొందాలంటే...

విదేశాల్లో చదివిన వీరు డాక్టర్లు కారా?

విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన భారతీయులను ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ (ఎఫ్‌ఎంజీలు) అంటారు. వీరు భారతదేశంలో వైద్య వృత్తిని చేపట్టేందుకు అర్హత పొందాలంటే, వర్తించే నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణులై, నిర్దేశిత ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలి. వీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్న్స్‌గా పనిచేస్తున్నప్పటికీ, భారతదేశంలో ఎంబీబీఎస్‌ చదివిన ఇంటర్న్‌లతో పోలిస్తే చాలా తక్కువ స్టైపెండ్ (నెలకు రూ.5వేలు మాత్రమే) పొందుతున్నారు. ‘ఒకే విధమైన వైద్య సేవలు అందిస్తున్నప్పుడు స్టైపెండ్‌లో తేడా ఉండకూడదు. మాపై వివక్షకు స్వస్తి చెప్పాలి. భారతదేశంలో ఎంబీబీఎస్‌ చదివిన ఇంటర్న్స్‌కు చెల్లిస్తున్నట్లుగానే మాకూ నెలకు రూ.29,792 చెల్లించాలి. అంతేగాక, ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన స్టైపెండ్ బకాయిలను చెల్లించాలి’ అని డిమాండ్ చేస్తూ, ఇటీవల కోఠిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా సైతం నిర్వహించారు.

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న వైద్యులపై అరెస్టుల పేరుతో ఒత్తిడి తీసుకురావడం, వారి సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం అంటే ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయడమే. పోలీసుల చర్యలను ‘ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ’ తీవ్రంగా ఖండిస్తున్నది. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తున్న వైద్యుల గొంతును నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యస్ఫూర్తికే విరుద్ధం. ఎఫ్‌ఎంజీ వైద్యుల డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. స్థానిక ఎంబీబీఎస్‌ ఇంటర్న్స్‌కు చెల్లిస్తున్న స్టైపండ్‌నే ఎఫ్‌ఎంజీలకూ అమలు చేయాలి.

డి. విజయేందర్‌రావు

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 04:19 AM