Share News

రాజ్యాంగబద్ధంగా ఐదు ఆర్థికహక్కులు

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:08 AM

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నది ఒక ప్రధాన చర్చగా మారింది. ప్రతిపక్షాలు తమ ఆరోపణలకు రుజువుగా– సుప్రీంకోర్టు కొన్ని కేసుల విషయంలో ఇస్తున్న తీర్పులను...

రాజ్యాంగబద్ధంగా ఐదు ఆర్థికహక్కులు

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నది ఒక ప్రధాన చర్చగా మారింది. ప్రతిపక్షాలు తమ ఆరోపణలకు రుజువుగా– సుప్రీంకోర్టు కొన్ని కేసుల విషయంలో ఇస్తున్న తీర్పులను, ఎలక్షన్ కమిషన్ వ్యవహారశైలిని, విపక్ష నేతలపై ఈడీ చేస్తున్న దాడులను పేర్కొంటున్నాయి. అయితే రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని వీటికి పరిమితం చేస్తే అది పాక్షికమే. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో వ్యక్తమవుతున్న నిర్లక్ష్యాన్ని, దానికి గల కారణాలను పరిశీలించకపోతే రాజ్యాంగంపై దాడి సమగ్రంగా అర్థం కాదు.

‘‘జనవరి 26, 1950 నుంచి మనం వైరుధ్యభరితమైన సమాజంలోకి అడుగుపెట్టబోతున్నాం’’ అని రాజ్యాంగసభలో అంబేడ్కర్‌ హెచ్చరించారు. ‘‘మన సామాజిక, ఆర్థిక జీవనంలో ఎన్నో వ్యత్యాసాలు, అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతల కారణంగా ఒక వ్యక్తి– ఒక ఓటు– ఒకే విలువ అనే సూత్రం నిరాకరించబడుతున్నది. ఈ విలువను ఇలాగే చాలాకాలంపాటు నిరాకరిస్తూపోతే మనం కష్టపడి తెచ్చుకున్న రాజకీయ ప్రజాస్వామ్యాన్ని చేజేతులా ప్రమాదంలో పడవేసుకున్నట్టే’’ అని ఆయన అన్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే అంబేడ్కర్‌ చెప్పినట్టుగా తరతరాలుగా కొనసాగుతున్న అసమానతలను తొలగించాలి. రాజ్యాంగ ఆశయం కూడా ఇదే.

అందుకే రాజ్యాంగంలోని పీఠిక ప్రతి పౌరుడికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని హామీ ఇస్తూ హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని లక్ష్యంగా ప్రకటించింది. అంటే సామాజిక న్యాయాన్ని రాజ్యాంగపు మౌలిక లక్ష్యంగా ప్రకటించింది. ఈ మౌలిక లక్ష్యంలో భాగంగా ప్రతి పౌరుడూ గౌరవంగా జీవించాలని ఆర్టికల్ 21 ప్రతిపాదిస్తున్నది. ప్రజల శ్రేయస్సును పెంపొందించేందుకు సామాజిక వ్యవస్థను మార్చాలని; వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించడానికి ప్రయత్నించాలనీ ఆర్టికల్ 38(1), (2) చెబుతున్నాయి. అక్కడే ఆగకుండా ఇంకా ముందుకువెళ్లి సహజ వనరులపై యాజమాన్యం, నియంత్రణ ప్రజలకు కలిగించాలనీ సంపద, ఉత్పత్తి సాధనాలను వికేంద్రీకరించేలా ఆర్థిక వ్యవస్థను నిర్వహించాలనీ ఆర్టికల్ 39(బి), (సి) ఆదేశిస్తున్నాయి. ఈ రకంగా పౌరుల మధ్య అసమానతలు లేని సమాజాన్ని అవి నిర్దేశిస్తున్నాయి. అందుకే ఈ రాజ్యాంగ అవతరణతో దీర్ఘకాలిక విప్లవం ప్రారంభమైందని మార్క్సిస్టు ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పేర్కొన్నాడు. నిజమే, రాజ్యాంగం కంటే ముందునాటి సమాజంతో పోల్చినప్పుడు ఈ రాజ్యాంగం విప్లవ స్వభావాన్ని కలిగి ఉన్నదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆచరణలో జరిగిందేమిటి?


ఏం జరిగిందంటే– టాటా–బిర్లా ప్లాన్ అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం ఆదేశించిన దానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉనికిలోకి వచ్చాయి. 1960లోనే ప్రణాళిక విధానం ద్వారా పోగుపడిన సంపద ఎవరిపరమైనదన్న ప్రశ్న ఎదురయింది. ఇందుకు ప్రొఫెసర్ పీసీ మహలనోబీస్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. భారతదేశంలో ఇంతవరకు అమలైన ప్రణాళికలు ప్రైవేటు పెట్టుబడికి, మరీ ముఖ్యంగా అందులో భారీ ప్రైవేటు పెట్టుబడిదారుల అభివృద్ధికి దోహదపడ్డాయని, అందువల్ల సంపద కేంద్రీకరణ పెరిగిందని ఆ కమిటీ తేల్చింది. దీన్ని నిరోధించాలని ఎమ్‌ఆర్‌టీపీ చట్టాన్ని 1970లో తీసుకువచ్చారు. అయినప్పటికీ ఆ చట్టం పారిశ్రామిక కుటుంబాల దగ్గర సంపద పోగుపడే విధానాన్ని నిరోధించలేక, చిత్తుకాగితంగా మిగిలిపోయింది. మరీ ముఖ్యంగా 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చిన తర్వాత కనీవినీ ఎరగని స్థాయిలో సంపద పోగుపడటం, అసమానతలు మరింత పెరగటం కనబడుతుంది.

1990 నాటికి దేశంలోని 10 పారిశ్రామిక కుటుంబాల ఆస్తులు రూ.42 వేల కోట్లు ఉంటే, 2007 నాటికి ఒక్క ముకేశ్‌ అంబానీ ఆస్తే రూ.1లక్ష 44వేల కోట్లకు పెరిగింది. ఈ రకంగా టాటా–బిర్లాలు పోయి అంబానీ–అదానీల చరిత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో.. సమాజంలో పైభాగంలో ఉన్న ఒక శాతం మంది దగ్గర 40 శాతం సంపద పోగుపడింది. అదే పైభాగంలో ఉన్న 10 శాతం వారి దగ్గర 65 శాతం సంపద ఉంటే, కింది భాగాన ఉన్న 50 శాతం ప్రజల దగ్గర కేవలం 3 నుంచి 6 శాతం సంపద మాత్రమే ఉంది. ఇక మధ్యలో ఉన్న 40 శాతం మంది ఆస్తులు 28 నుంచి 29 శాతంగా ఉన్నాయి. మొత్తం దేశ జనాభాలో 0.001 శాతంగా ఉన్న అపర కుబేరుల ఆస్తి 46 కోట్ల మంది జనాభా ఆస్తికి సమానంగా ఉంది.

ఒకవైపు ఈ రకమైన వ్యత్యాసాలు, అసమానతలు పెరుగుతూ ఉంటే, మరొకవైపు నేటికీ ప్రజలు కనీస అవసరాలను తీర్చుకోలేని స్థాయిలో ఉన్నారు. మానవ అభివృద్ధి అధ్యయన సంస్థ 2021లో రూపొందించిన నివేదిక ప్రకారం, 33.3శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారు. అందువల్లనే మన దేశం ఆకలి సూచికలో ప్రపంచంలో 102వ స్థానంలో ఉంది. మంచినీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు లేక పారిశుధ్య సమస్యలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 2200 క్యాలరీల కంటే తక్కువ తీసుకునే వారి నిష్పత్తి 1993–94 మధ్య 58 శాతం ఉంటే, 2011–12 మధ్య 68 శాతానికి పెరిగింది. సరైన పోషకాహారం లేక, వైద్య సౌకర్యాలు అందక అయిదేళ్లలోపు పిల్లలలో 5.4 లక్షల మంది మరణిస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు ఇంతకంటే రుజువులు అవసరం లేదు.


ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అయిదు రకాల ఆర్థిక హక్కులు రాజ్యాంగబద్ధంగా కల్పించాలన్న చర్చను ముందుకు తెస్తున్నారు. ప్రతి పౌరుడికీ విద్య, వైద్యం, ఆహారం, ఉపాధి, సామాజిక భద్రత వంటి హక్కులకు రాజ్యాంగబద్ధమైన గ్యారెంటీ ఉండాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. అయితే ఈ ఆర్థిక హక్కులు తీర్చటానికి కావలసిన ఆర్థిక వనరులను దేశంలో పైభాగంలో ఉన్న 1 శాతం ధనికులపై రెండు శాతం సంపద పన్ను, వారసత్వ పన్ను విధించడం ద్వారా సమకూర్చుకోవచ్చని పట్నాయక్‌ సూచిస్తున్నారు. ఆయన పేర్కొన్న హక్కులకే పరిమితం కాకుండా రాజ్యాంగం ప్రకటించిన ప్రజాస్వామ్య పాలన అవకాశాల లోను, ఆర్థిక అవకాశాల లోను కూడా అన్ని సమూహాలకు తగిన అవకాశాలు, ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే ఓటు హక్కు ద్వారా రాజకీయ సమానత్వం కనబడుతున్నప్పటికీ పార్లమెంటులోను, శాసనసభలోను ప్రాతినిధ్యం దగ్గర అదే రకమైన రాజకీయ సమానత్వం ఉండటం లేదు.

రాజ్యాంగ పీఠిక ‘‘భారత ప్రజలమైన మేము’’ అని ప్రారంభమై అంతిమంగా ‘‘మాకు మేము సమర్పించుకుంటున్నాం’’ అని ముగుస్తుంది. కాబట్టి రాజ్యాంగ రక్షణ బాధ్యత అంతిమంగా ప్రజలదే.

ప్రొఫెసర్ పట్టా వెంకటేశ్వర్లు

ఈ వార్తలనూ చదవండి:

వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ఏఐ ఫీచర్ తొలగింపు..

మరో ఏఐ మోడల్‌‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ

Updated Date - Jul 17 , 2026 | 03:08 AM