తొలి తెలుగు థీసిస్ ఎక్కడ?
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:25 AM
తెలుగులో తొలి సిద్ధాంత గ్రంథం ఏది, ఎవరిది? అంటే విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు కొంతమందైనా సమాధానం చెప్తారు గానీ, అదెక్కడుంది, దాన్నెవరు చూశారు? అంటే మాత్రం సమాధానం దొరకదు...
తెలుగులో తొలి సిద్ధాంత గ్రంథం ఏది, ఎవరిది? అంటే విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు కొంతమందైనా సమాధానం చెప్తారు గానీ, అదెక్కడుంది, దాన్నెవరు చూశారు? అంటే మాత్రం సమాధానం దొరకదు. ఆ సిద్ధాంత గ్రంథం పేరు ‘పదనకొండవ శతాబ్దమునాఁటి తెనుఁగుభాష’. పరిశోధకుడు చిలుకూరి నారాయణరావు (10.09.1890–22.06.1951). ఆయన 1914 ఏప్రిల్‌లో ఎమ్మే పూర్తి చేశాడు. ఆ తర్వాతి భాషా పరిశ్రమ ఫలితమే ఈ సిద్ధాంతగ్రంథం.
1979లో ‘భారతి’ పత్రికలో తెలుగులో తొలి సిద్ధాంతగ్రంథం చిలుకూరి నారాయణరావుదే అని వరుసగా మూడు వివరణలొచ్చాయ్. ఆ వివరణలకీ, తొలి సిద్ధాంతగ్రంథం వివాదాస్పదం అవ్వడానికీ రెండు కారణాలున్నాయ్. తెలుగు అకాడమీ ప్రచురించిన ‘తెలుగు పరిశోధన సంహిత’ (1975) అనే పుస్తకంలో చిలుకూరి నారాయణరావు సిద్ధాంతగ్రంథ వివరాలు లేకపోవడం తక్షణకారణం. కె.వి.ఆర్. నరసింహం తాను 1945లో రాసిన సిద్ధాంతగ్రంథాన్ని 1965లో పుస్తకంగా ముద్రిస్తూ రాసుకున్న పీఠికలో ‘‘తెలుగులో మొట్టమొదటి పిహెచ్.డి. పట్టము పొందఁజేసిన...’’ అని పేర్కొనడం రెండోది. చాలామంది చిలుకూరి నారాయణరావుదే తొలి సిద్ధాంతగ్రంథమని 1975 నాటికే చాలాచోట్ల ప్రస్తావించినా, తెలుగు అకాడమీ ప్రచురణలో ఆ వివరాలు తప్పించడం పెద్ద తప్పు. పర్యవేక్షకుడు లేకుండా సమర్పించిన సిద్ధాంతగ్రంథమిది. దీనికి పరీక్షకులు ఎవరో ఎక్కడా నమోదైనట్టు లేదు. ఇన్ని వివాదాలకు కారణం నారాయణరావు 1928 నాటి పిహెచ్.డి. పుస్తకంలోగానీ, ‘ఆంధ్రభాషాచరిత్రము’ రెండు సంపుటాల్లోగానీ, ఇతర రచనల్లోగానీ తన సిద్ధాంతగ్రంథ వివరాలు తగినన్ని చెప్పకపోవడమే.
చిలుకూరి నారాయణరావు తన సిద్ధాంత గ్రంథాన్ని పుస్తకంగా శ్రీసాధన ముద్రాక్షరశాల (అనంతపురం, 1928)లో హార్డుబౌండుతో ముద్రించాడు. పుస్తక ముఖపత్రంపై ఉన్న అక్షరాలు చదవడానికి వీల్లేనంతగా వెలిసిపోయాయి. లోపటి ముఖచిత్రంపై ‘‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ–పిహెచ్.డి. బిరుదమునకుఁగాను చెన్నపుర విశ్వవిద్యాలయమువారికి సమర్పించినది’’ అని ఉంది. దీన్నే యథాతథంగా విశ్వవిద్యాలయానికి సమర్పించారని అనుకుందామంటే, అప్పటికి మద్రాసు విశ్వవిద్యాలయంలో స్థానిక భాషల్లో సిద్ధాంత గ్రంథాలు సమర్పించే వెసులుబాటు లేదు.
నిడదవోలు వెంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, తంగిరాల వెంకటసుబ్బారావు, జి.యస్. మోహన్, ఘట్టమరాజు అశ్వత్థనారాయణ లాంటి ఎందరో నారాయణరావుదే తొలి పిహెచ్.డి. అని రాసినా వాళ్ళెవ్వరూ ఆ సిద్ధాంతగ్రంథం చూడలేదు. ఒక్క ఒ.వి. అన్న పేరుతో రాసినవారు మాత్రమే (భారతి, 1979 ఏప్రిల్) పుస్తకం లోపలి ముఖపత్రంపై ఉన్నది యథాతథంగా ఉదహరించారు. ఆయన కూడా ఆంగ్లగ్రంథం చూడలేదు. నారాయణరావు మనుమడైన ఆచార్య జి.యస్. మోహన్ ‘‘ఆంగ్లభాషలో సిద్ధాంతవ్యాసం వ్రాసి...’’ అని అన్నారుగానీ, ఆయనా తనకళ్ళతో ఆంగ్ల సిద్ధాంతగ్రంథాన్నిగానీ, తెలుగులో వచ్చిన 1928 ముద్రణనుగానీ చూడలేదు.
తెలుగుశాఖల్లో తొలి సిద్ధాంతగ్రంథాలు సమర్పించిన చాలామందికి అదే విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలొచ్చాయ్. కానీ, తెలుగు భాషాచరిత్రపై తొలి సిద్దాంతగ్రంథం రాసిన నారాయణరావుకి విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగం రాకపోవడం ఆశ్చర్యకరం. తెలుగు ప్రాకృత జన్యమనే నారాయణరావు వాదాన్ని ఉద్యోగ మౌఖికపరీక్షలోని బెంగాలీ అధ్యాపకుడు ఒప్పుకోకపోవడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవికి దూరమయ్యాడు. అయినా నారాయణరావు తన వాదానికే కట్టుబడ్డాడు. తను నమ్మిన సిద్ధాంతం విషయంలో కృషి చేయడం, ఆ మాటకు కట్టుబడడం అకడమిక్ జీవితాల్లో పాటించాల్సిన ఆదర్శం. కట్టమంచి రామలింగారెడ్డి ‘‘In scholarly distinction and originality he occupies a first rank. Unfortunately, from a worldly point of view, he has not been the success he deserved to be, and that is due to the conditions of service and recognition in our country’’ అని అనడం ఈ విషయాన్నే నిరూపిస్తోంది. అందుకే ఉద్యోగమివ్వలేకపోయినప్పటికీ కట్టమంచి అతని పరిశ్రమని గుర్తించి, తాను ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడే నారాయణరావు రాసిన ‘ఆంధ్రబాషాచరిత్రము’ అనే బృహద్గ్రంథాన్ని రెండు సంపుటాలుగా ముద్రించాడు. తెలుగు, ప్రాకృత జనితమనే ప్రతిపాదనని నిరూపించడానికి తర్వాతితరం సాంప్రదాయిక పండితులు తగిన పరిశ్రమ చేయలేదు. విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పదవి రాకపోవడంవల్ల నారాయణరావు పరిశోధనల్ని ఆ కోణంలో శిష్యులద్వారా కొనసాగించలేకపోయాడు. దాంతోపాటూ సిద్ధాంతగ్రంథమూ ఎక్కువ ప్రచారంలోకి రాకుండా పోయింది.
నారాయణరావు తన సిద్ధాంతగ్రంథంలో నన్నయ కాలంనాటి భాషకు సూత్రాలు రాసి, సోదాహరణంగా అన్వయించి చూపాడు. సిద్ధాంతగ్రంథం సమర్పించడంతో అతని పరిశోధన ఆగిపోలేదు. తెలుగుభాషా చరిత్ర రాయ డానికి ఈ సిద్ధాంతగ్రంథం పునాది అయ్యింది. తెలుగుభాష మూలాలు, ఇతర ద్రావిడ, ఇండో–యూరోపియన్ భాషలతోగల సంబంధాలు; విస్తృతగ్రంథ పరిశీలనలతో కూడిన సోదాహరణ విశ్లేణలు, అనుబంధాలతో కలిపి 1780 పుటలతో రెండు సంపుటాలుగా ఆంధ్రవిశ్వకళాపరిషత్తు 1937లో ముద్రించింది. స్థూలంగా చెప్పాలంటే సిద్ధాంతగ్రంథం నన్నయకాలంనాటి భాషకు, 11వ శతాబ్దంనాటి తెలుగుకు పరిమితం. కానీ ‘ఆంధ్రభాషా చరిత్రము’ శతాబ్దాల తెలుగుభాషా పరిణామాన్ని వివరిస్తుంది. 1936 నాటికి ద్రావిడభాషలపై చేసిన అధ్యయన ఫలితాలు ‘ఆంధ్రభాషాచరిత్రము’లో ప్రతిఫలిస్తాయ్. ఆ మేరకు కొంత అదనపు సమాచారం ఈ పుస్తకాల్లో దొరుకుతుంది.
1928లో ప్రచురించిన సిద్ధాంతగ్రంథం ‘ఆంధ్రభాషాచరిత్రము’ పుస్తకంలో పదకొండో ప్రకరణంగా రెండో సంపుటంలో చిన్నచిన్న మార్పులతో పూర్తిగా పునర్ముద్రితమైంది. ఈ భాగానికి ముందు ఇరవైపుటల్లో నన్నయ పూర్వపుభాషను శాసనాల ఆధారంగా నారాయణరావు పరిచయం చేశాడు. చిలుకూరి నారాయణరావు సొంత దస్తూరీతో మార్పులు రాసుకున్న సిద్ధాంతగ్రంథ ప్రతి నాకు దొరికింది. అందులో రాసుకున్న కొన్ని మార్పులు తర్వాత పదేళ్ళకు ముద్రించిన ఈ పుస్తకంలో కన్పిస్తాయ్. దీని పీఠికలో ‘‘ఈ గ్రంథమందలి ‘పదునొకండవు శతాబ్దమునాఁటి తెనుఁగుభాష’ యను నధ్యాయ మాకృషికి ఫలము’’ అనే ఒక్కమాట తప్పా ఆ భాగం తన పిహెచ్.డి. పరిశోధనలో భాగమనే విషయం కూడా చెప్పలేదు. నారాయణరావు పిహెచ్.డి.లోని ఆంగ్లపీఠిక ఆంధ్రభాషాచరిత్రములో లేకపోవడంతో దాని పూర్వాపరాల సమాచారం కొంతైనా దొరికే అవకాశం లేకుండా పోయింది.
‘మనసు’ ఫౌండేషన్ ముద్రించిన చేకూరి రామారావు సర్వలభ్యరచనల వెతుకులాటలో చేరాతలకోసం 1986–95 మధ్య ఆంధ్రజ్యోతి సాహిత్యానుబంధాల శోధనలో అవధానం నాగరాజారావు రాసిన ‘తొలి తెలుగు పిహెచ్.డి.’ అనే వ్యాసమూ అందులో సిద్ధాంతగ్రంథ లోపలి ముఖచిత్రం నా కంటపడ్డాయ్ (20.07.1992, ఆంధ్రజ్యోతి). సీనియర్ సాహిత్య పరిశోధక విమర్శకుడు ఘట్టమరాజు ద్వారా ఫోన్ నంబరు సంపాదించి, ఆశతో, కొంత ప్రయాసతో అవధానం నాగరాజరావు నమ్మకం పొందాక, నా జూనియర్ సునీల్ కుమార్‌రెడ్డి, ఆంధ్రభారతి శాయి సహకారంతో సిద్ధాంతగ్రంథాన్ని చేతుల్లోకి తీసుకోగలిగాను. ఎమెస్కో సంపాదకుడు డి. చంద్రశేఖర్‌రెడ్డి పూనికతో 1928 నాటి ఈ పుస్తకం 2024లో ఎమెస్కో ముద్రణగా వచ్చింది. అలా తొలి తెలుగు సిద్ధాంతగ్రంథం 98 ఏళ్ళ తర్వాత పునర్ముద్రణ అయ్యింది. తెలుగుభాషా చరిత్రపై జరిగిన పరిశోధనలకు దారిచూపి, రెండేళ్ళల్లో శతజయంతి జరుపుకోవాల్సిన తొలి తెలుగు సిద్ధాంతగ్రంథ సమాచారం తెలుగువాళ్ళకు ఇప్పటికీ దొరక్కపోవడం శోచనీయం.
చిలుకూరి నారాయణరావు డి.లిట్. పట్టాకోసం ‘Dravidian Meters’ అనే పరిశోధనగ్రంథం ఆంగ్లంలో సమర్పించినా (15.10.1937) డి.లిట్. పట్టా రాలేదు. 1937లో రాసిన డి.లిట్. గ్రంథమే ఆంగ్లంలో ఉన్నప్పుడు అంతకు పదేళ్ళముందు అదే విశ్వవిద్యాలయానికి సమర్పించిన పిహెచ్.డి.ని తెలుగులో రాశారనుకోవడం కుదరదు. ఆంగ్లంలో రాసి, సమర్పించిన తొలితెలుగు సిద్ధాంతగ్రంథం అదే సమయంలో తెలుగులోనూ ముద్రించబడింది అనుకోవడం తప్పా వేరే దారిలేదు. ఈ సిద్ధాంతగ్రంథాన్ని ఆంగ్లంలో సమర్పించారా లేదా? ఆంగ్లంలో అయితే దాని శీర్షిక ఏంటి? అదెక్కడుంది? అనే చిక్కుముళ్ళు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయ్.
టి. సతీశ్
93916 14443
ఈ వార్తలు కూడా చదవండి
ఓట్చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం