ఎఫ్‌సీవో భూములపై నిషేధం తొలగించాలి
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:22 AM
చుక్కల భూముల సమస్యకు 2017లోనే చట్టం తీసుకొచ్చినా, ఇప్పటి వరకూ పూర్తిగా పరిష్కారం కాలేదు. అలాంటి సమస్యే ఉత్తరాంధ్రలోని ఫెయిరీ చెక్ ఆపరేషన్ (ఎఫ్‌సీవో) భూములది. ఇది విజయనగరం జిల్లాలో...
చుక్కల భూముల సమస్యకు 2017లోనే చట్టం తీసుకొచ్చినా, ఇప్పటి వరకూ పూర్తిగా పరిష్కారం కాలేదు. అలాంటి సమస్యే ఉత్తరాంధ్రలోని ఫెయిరీ చెక్ ఆపరేషన్ (ఎఫ్‌సీవో) భూములది. ఇది విజయనగరం జిల్లాలో 1980 నుంచి ఉంది. ఎస్టేట్‌ల రద్దు చట్టం–1948 ప్రకారం, ప్రభుత్వం 1948 నుంచి 1951 వరకు జమీందారీ (ఎస్టేట్) గ్రామాల్లో భూములను సర్వే చేసి, రైతులకు సెటిల్‌మెంట్ పట్టాలు ఇచ్చింది. అలా చేసినప్పుడు ప్రతి గ్రామానికీ ఒక రిజిస్టర్ తయారు చేశారు. ఆ రిజిస్టర్‌లో సర్వే నెంబర్, పాత సర్వే నెంబర్, భూమి విస్తీర్ణం, భూమి తరం, ఇనాం భూమి/ గవర్నమెంట్ భూమి/ భూమి రకం(తరం), భూమికి చెల్లించాల్సిన శిస్తు, పట్టాదారు (యజమాని) పేరు మొదలైన వివరాలు ఉంటాయి. ఈ రిజిస్టర్‌ను సర్వే ల్యాండ్ రికార్డు (SLR), రీ సర్వే రిజిస్టర్/ రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ (RSR), సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్ (SFA) పేరుతో పిలుస్తారు. ఇలాంటి గ్రామాలు కోస్తా తీరంలో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఉన్నాయి. ఎక్కువ గ్రామాలు విజయనగరం, పిఠాపురం, నూజివీడు సంస్థానాల్లో ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నాయి.
ఎస్టేట్ రద్దు చట్టం ప్రకారం గ్రామాల్లో సర్వే, సెటిల్‌మెంట్ చేసినప్పుడు అప్పటికి భూమిపై సాగులో ఉన్నవారు ఆధారాలు చూపితే సెటిల్‌మెంట్ పట్టా ఇచ్చి, రిజిస్టర్‌లో వారి పేరు రాశారు. ఒక భూమికి యజమాని/ హక్కుదారు ఎవరు అని నిర్ణయించడానికి అతి ముఖ్యమైన రికార్డు అదే. అలా సర్వే జరిగినపుడు, కొంత మంది, రైతులు/సాగుదారులు దశాబ్దాల నుంచి సాగులో ఉన్నా, తెలియనితనం వల్ల, ముఖ్యంగా చదువు లేకపోవడం వల్ల, సర్వే అధికార్లకు భూమి తమ సాగులో ఉన్నట్టు ఆధారాలు చూపలేకపోయారు. ఆ భూమిని గయ్యాలు (ప్రభుత్వ భూమిగా) నమోదు చేశారు. విచిత్రం ఏమిటంటే సర్వేకు ముందు, తరువాత కూడా వారే భూమిపై సాగులో ఉన్నారు. అలా వేలాది ఎకరాలు గయ్యాలు భూమిగా తప్పుగా నమోదయింది. ముఖ్యంగా పాత విజయనగరం జిల్లాలోని 19 మండలాల్లో ఇలాంటి భూములు 300 పైబడిన గ్రామాల్లో ఉన్నాయి.
సరైన ఆధారాలు చూపలేకపోయిన వారి సమస్యను గుర్తించిన ప్రభుత్వం, 1978–82 కాలంలో అలాంటి గయ్యాలు భూముల విషయంలో యజమానులను/సాగుదారులను గుర్తించడానికి ఫెయిర్ చెక్ ఆపరేషన్ (ఎఫ్‌సీవో) పేరుతో మళ్లీ గ్రామాల్లో విచారించి, 1950లో గయ్యాలుగా నమోదైన భూములపై సుదీర్ఘకాలంగా సాగులో/ఆక్రమణలో ఉన్న రైతులను ఎఫ్‌సీవో రిజిస్టర్‌లో పట్టాదారులుగా నమోదు చేసింది. అయితే గయ్యాలు భూముల్లో ఉన్న కొంతమంది రైతులకు 1960 నుంచి 1977 వరకు ‘డి’ పట్టాలు మంజూరు చేశారు. తమ సాగులో ఉన్న భూమికి ఏదో ఒక హక్కు పత్రం వస్తోంది కదా అని రైతులు ఆ పట్టాలు తీసుకున్నారు. అలాంటి వారిని ఎఫ్‌సీవో సర్వేలో సెటిల్‌మెంట్ పట్టాదారులుగా గుర్తించి రిజిస్టర్‌లో నమోదు చేశారు. అలా ‘డి’ పట్టాలు పొందినవారినే కాకుండా 1950కు ముందు, ఆ తర్వాత కూడా భూమిపై కొనసాగిన వారిని కూడా ఎఫ్‌సీవో రిజిస్టర్‌లో పట్టాదారులు (సెటిల్‌మెంట్ పట్టాదారు)గా నమోదైనవారు (ఇరు కేటగిరీలవారు) వారి భూములను అమ్ముకుంటూ వచ్చారు.
2008లో ‘డి’ పట్టాలు నిషేధపు(22–ఎ) జాబితాలో పెట్టి, ఆ లిస్టులు రిజిస్ట్రేషన్ శాఖకు తహసీల్దార్‌లు పంపించినా, అధికారులు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్‌లు చేశారు. కానీ 2015 తర్వాత హైకోర్టు తీర్పు ఆధారంగా ప్రభుత్వం 22–ఎ భూముల విషయంలో పటిష్ఠమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ భూముల రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయాయి. తదుపరి రెవిన్యూ అధికారులు ఎఫ్‌సీవో భూముల విషయమై తమకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ రైతులను త్రిశంకుస్వర్గంలోకి నెట్టేశారు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోవడానికి, అవసరార్థం అమ్ముకోలేక వేలాది రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరిలో కనీసం 70శాతం పేద రైతులే. 2013 భూసేకరణ, పునరావాస చట్టంలో గయ్యాలు భూమిలో ఉన్నా సరే, ఆక్రమణదారుకు కూడా దగ్గరలో ఉన్న పట్టాదారు భూమికి ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారో అదే విధంగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ‘డి’ పట్టా భూములను కూడా మంజూరు చేసిన 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని 2023లో ప్రభుత్వం చట్టం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయాన్ని అబేయన్స్‌లో పెట్టింది.
చాలా కాలంగా ఎఫ్‌సీవో భూముల విషయమై వేలాది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వివిధ పార్టీల నాయకుల దృష్టికి రాలేదా?! ఎఫ్‌సీవో రిజిస్టర్‌లో నమోదు చేసిన భూములను పట్టా భూములుగానే గుర్తించి, బేషరతుగా ఆ భూములను 22–ఎ జాబితా నుంచి తొలగించాలి. అలాగే 1950కి ముందు నుంచి భూమిపై ఉండి, ఎఫ్‌సీవో సర్వేకి ముందు ‘డి’ పట్టాలు పొందిన భూములను కూడా జిరాయితీ భూములుగా పరిగణించి వాటిని కూడా 22–ఎ జాబితా నుంచి తొలగించాలి. వేల కోట్ల రూపాయలు, భూముల రూపంలోనూ, రుసుముల రాయితీ రూపంలోనూ, స్వదేశీ–విదేశీ, పారిశ్రామికవేత్తలకు, వేగవంతమైన సులభతరం వ్యాపారం పేరుతో ధారబోస్తున్న పాలకులు... రైతుల స్వాధీనంలో ఉన్న ఎఫ్‌సీవో భూముల విషయంలో ఉదారంగా ఉంటే నష్టమేమీ ఉండదు. రైతే దేశానికి వెన్నెముక అని పదే పదే చెప్పడం కాదు, వారికి వెన్నుదన్నుగా నిలవాలి. ఇందుకు అన్ని పక్షాలు సహకరించాలి.
మారిశెట్టి జితేంద్ర
రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..