Share News

Pasunuri Sridhar Babu Interview: అనేక నేనులుగా విస్తరించడం అనివార్యమైంది

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:07 AM

పసునూరు శ్రీధర్‌బాబు స్వరం తన సమకాలీన కవుల కంటే భిన్నమైనది. అది అవుట్ స్పోకెన్ కాదు. ఒక ఇంటీరియర్ మోనోలాగ్. మనిషి లోపలి సంక్షోభం, అశాంతి, అలజడి, శూన్యత, మౌనం, దుఃఖం వంటి...

Pasunuri Sridhar Babu Interview: అనేక నేనులుగా విస్తరించడం అనివార్యమైంది

పసునూరు శ్రీధర్‌బాబు స్వరం తన సమకాలీన కవుల కంటే భిన్నమైనది. అది అవుట్ స్పోకెన్ కాదు. ఒక ఇంటీరియర్ మోనోలాగ్. మనిషి లోపలి సంక్షోభం, అశాంతి, అలజడి, శూన్యత, మౌనం, దుఃఖం వంటి వ్యక్తిగత భావ కేంద్రకం తన కవిత్వం. ప్రేమ తావులు, నదుల హొయలు, పాలపుంతలు, ప్రేమ మూర్తులు తన కవిత్వమంతా విశాలంగా ఆవరించుకుని వుంటారు. అర్బన్ మొరాలిటీ, ఎమోషనల్ ఎంప్టీనెస్ తన కవిత్వమంతా నది మీద వెన్నెలలా పరచుకుంటుంది. ‘అనేకవచనం’ నుండి ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ మీదుగా ‘ఏకాంతం ఒక అతిథి’ దాకా తనదొక ప్రత్యేకమైన మార్గం. ఈ ఏకాంత అతిథితో మాటా ముచ్చట.

సమాజం బాహ్య విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీరు మనిషి లోపలి శూన్యాన్ని, అశాంతిని ఎంచుకోవడానికి ప్రేరణ ఏమిటి?

కవిత్వంలో ఎంచుకోవడం ఒకటుంటుందని నేననుకోను. లోపలి శూన్యం వ్యక్తి కేంద్రంగా విస్తరిస్తుంది. ఇందులో మీరంటున్న బాహ్య విలువలు ఆత్మిక అనుభూతులతో సంఘర్షించడం వల్ల కలిగే అశాంతి ఉంటుంది. ఇక్కడ వైయక్తికం ఎక్కడుంది? Deeper self నుంచి దారి చేసుకుంటూ రావడం వల్ల కవిత్వ వాక్యం ఆత్మాశ్రయంగా కనిపిస్తుంది. తరచి చూస్తే తడి అంతా సామాజికమే. ఉపరితల అవగాహనతో కవిని exclude చేయలేం కదా. ఈ అశాంతి శూన్యం ఒకప్పుడు మండుతున్న చెట్టులా ఉంటుంది. మరొకప్పుడు విత్తనం నుంచి వేర్లు లోపలికి చొచ్చుకుపోతున్నట్లుంటుంది. ఈ paining pleasure కవిత్వానికి ప్రేరణ. అది భాషను తవ్వి తీసుకుంటుంది. ఆ process ఒక తాదాత్మ్య స్థితి. అందుకే, కవిత్వం నాకొక spiritual activity అని 1999లో ‘అనేకవచనం’ కవిత్వం సంపుటికి రాసుకున్న ‘అనిర్వచనం’ లోనే చెప్పుకున్నాను. ఇప్పటికీ అంతే.

ఎమోషనల్ ఎంప్టీనెస్ (భావోద్వేగ శూన్యత) గురించి మీరు రాసేటప్పుడు అది చదువరిని ఒక రకమైన ఆత్మపరిశీలనలోకి నెడుతుంది. ఆధునిక మనిషికి ఈ ‘శూన్యం’ నుండి విముక్తి ఉందంటారా?

భావోద్వేగ శూన్యత గురించి రాసిన సందర్భాలున్నాయి మీరన్నట్టు. కానీ, అది జీవితానికి అర్థం లేదు, ప్రయోజనం లేదనే nihilistic approach నుంచి వచ్చినవి కావు. మీ ప్రశ్న వినగానే నా ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ సంపుటి లోని ‘లేదు’, ‘మళ్ళీ వద్దు’ వంటి కవితలు గుర్తొస్తున్నాయి. ప్రేమరాహిత్యం, విలువలు లుప్తం కావడం వంటి సంవేదనలు చదువరిని ఆత్మపరిశీలనలోకి నెట్టగలిగితే కవిత్వ పరమార్థం నెరవేరినట్టే. మోరల్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ కూలిపోతున్నప్పుడు సమాజం కొత్త విలువల్ని నిర్మించుకుంటుంది. మనం మోస్తూ తిరిగే ‘నేను, నాది’ అనే గండు శిలలభారం నుంచి మనిషిని విముక్తం చేసేదే శూన్యత అంటుంది బౌద్ధం. ఆత్మను rigid గా చూడకుండా పరిమళంగా విచ్ఛిన్నమయ్యే పూవులానో ప్రవాహంలానో చూడగలగాలి. అలాంటి శూన్యతలో అనివార్యంగా కరుణ వికసిస్తుంది. అది విముక్తే కదా! అందుకే, బౌద్ధం ఇవాళ్టి అవసరం అనిపిస్తుంది నాకు కవిత్వంలో, జీవితంలో.


మీకవితా వాక్యం ఒక ‘స్కైలైన్’ లాగా పదునుగా ఉంటుంది. అనవసరమైన అలంకారాలను పక్కన పెట్టి, భావాన్ని నగ్నంగా (Raw) వదలడం వెనుక మీకున్న సౌందర్య దృక్పథం (Aesthetics) ఏమిటి?

Aesthetics అన్నది కవిత్వంలో perceptionకు సంబంధించిన విషయమని నేననుకుంటాను. సౌందర్యాత్మకతను నేను అలంకారంగా చూడడం లేదు. ‘Ways of seeing it’ సునిశితమవుతున్న కొద్దీ మీరంటున్న స్కైలైన్ వాక్యం పుడుతుందేమో! ఒక అలజడి అలలై చెలరేగి మళ్ళీ సద్దుమణిగాక, ఆ నిశ్చల నిశ్శబ్దం మీద ఘనీభవిస్తొందొక వాక్యం. కవి తన సమాధిలో అంతవరకూ ఆగి ఆ వాక్యాన్ని తెచ్చుకోవాలి. అతిభావోద్వేగం, rhetoric, సైద్ధాంతిక నినాదాల వద్దే ఆగిపోతే ఆ సోయగం చిక్కదు. ఇక్కడ నేను దృక్పథాన్ని వ్యతిరేకించడం లేదు. సౌందర్యమే దృక్పథమనీ చెప్పడం లేదు. ఏది వచనంలో చెప్పాలి, ఏది కవిత్వమవుతుందో తెలుసుకునే ప్రయత్నం నిరంతరం సాగాలి. వేయి కవితలు రాశాక కూడా. వచనంలో కవిత్వం పలికితే బాగుంటుంది. కానీ, కవిత్వంలో వచనం మూలిగితేనే చిరాకు.

భాషకు అందని భావాలను అక్షరాల్లోకి తర్జుమా చేసేటప్పుడు, భాష మీ భావాల తీవ్రతను తగ్గిస్తుందని ఎప్పుడైనా అనిపించిందా?

హైకూ రచన అంటే సత్యాన్ని తెలుసుకోవడం కాదు, సత్యంలో ఉండడం అంటారు జెన్ తాత్వికులు. హృదయాన్ని దివ్య ప్రేమ దిశగా నడిపిస్తారు సూఫీ కవులు. Celebration of fragmentation గురించి చెబుతూ వచ్చారు ఉత్తరాధునికులు. నన్ను నేను కవిత్వంలో వెతుక్కుంటున్న 90లలోని అస్తిత్వ ఉద్యమాలలో నేనొక శకలమై, వికలమై నిశ్శబ్దంలోకి – మౌనంలోకి కాదు – కూరుకుపోయానేమో! సత్యానికీ, ప్రేమకీ స్వీయ అస్తిత్వంతో దారులు వేసుకునే ప్రయత్నంలో నాలో వాలిన ప్రతి ప్రాకృతిక శకలానికీ నా గొంతునివ్వడం ఒక ఆత్మిక క్రియగా మారింది. అలా అనేక నేనులుగా విస్తరించడం అనివార్యమైందేమో అనిపిస్తుంది ఇప్పుడీ ప్రయాణాన్ని సమీక్షించుకుంటే. అందుకే, నా మొదటి సంపుటి ‘అనేకవచనం’ అయింది. అందులోని మొదటి కవితలోనే మీరు భాష గురించి అడిగిన ప్రశ్నకు జవాబు ఉందిలా: అన్నింటికన్నా భాషే నన్ను ఎక్కువగా బాధించింది. ఇప్పుడీ ‘ఏకాంతం ఒక అతిథి’లోనూ ...thought is a matter/ చేజారిపోతోంది/ నాలోంచీ/ నీలోంచీ/ భాషలోంచీ... అన్నాను.


ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా మీ స్వస్థలం. కానీ మీరు ఏ అస్తిత్వ ఉద్యమంలోనూ పూర్తిగా పాలుపంచుకున్నట్టు కానీ, వెన్నుదన్నుగా నిలబడినట్టు కానీ కనిపించదు. అప్పడప్పుడు కొన్ని కవితలు మినహాయింపు. ఎందుకని?

నిజమే, మా నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లానే. నేను చూసిన రెండు బలమైన ఉద్యమాల్లో ఒకటి మండల్ కమిషన్ వ్యతిరేక పోరాటం. రెండోది తెలంగాణ ఉద్యమం. బీసీల అస్తిత్వ ఉద్యమాల విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా తిరిగాను. తెలంగాణ ఉద్యమంలో ఒక జర్నలిస్టుగానే కాకుండా, తెలంగాణవాదిగానూ ప్రత్యక్షంగా పాల్గొన్నాను. తెలంగాణ వేదనను వ్యాసాల్లో చెప్పాను. కానీ, అది కవిత్వంలో నేరుగా ప్రతిఫలించలేదు. అణచివేత, వివక్ష చేసిన గాయాలు నా కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తాయి. కొన్ని కవితల్లో అవి ప్రస్ఫుటంగా, శీర్షికలతో పాటుగా ఉండడం వల్ల మీకు మినహాయింపులుగా కనిపించి ఉండవచ్చు. ఏమైనా, సామాజిక కవిత్వమంటూ వేరుగా ఉండదు. వైయక్తికమూ సామాజికమే అని మన సాహిత్యకారులు చెబుతూనే ఉన్నారు.

‘‘స్త్రీ దేహాన్ని తాకిన చేతులతో మంచి కవిత్వమైనా రాయాలి, లేదంటే చేతులు ముడుచుకుని కూర్చోవాలి’’ అని ఒక కవితలో అన్నారు కాదు! మంచి కవిత్వానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

ఇంద్రియాలతో స్వీకరించే ప్రతి అనుభవంతో మనం మన లోపలి అగాధాల్లోకి కొట్టుకుపోతాం. ‘You cannot stir a flower without troubling a star’ అని ఫ్రాన్సిస్‌ థాంప్సన్‌ చెప్పిన మాట మరీ మెటఫరికల్‌ కాకపోవచ్చేమో అనిపిస్తుంటుంది Quantum Entanglement అనే ఆలోచనతో ఊయలూగుతుంటే. When nothing exists in isolation, even a private feeling becomes a shared truth. లోపలి అగాధంలోంచి మళ్ళీ పైకి ఎగసి వచ్చినప్పుడు ఒంటికి అంటుకున్న తడికి భాష ఇవ్వగలిగితే అది మంచి కవిత్వం అవుతుందనిపిస్తుంది.

‘అనేకవచనం’తో పోలిస్తే మీ ఇటీవలి కవిత్వ సంపుటి ‘ఏకాంతం ఒక అతిథి’లో మీ భాష చాలావరకు సంస్కృత భారాన్ని వదిలించుకుంది...


నిజమే. మీరన్నట్లు అనేకవచనం రోజుల్లో శాబ్దిక మాయ వెంటాడేది. రకరకాల ప్రభావాల్లోంచి సొంత మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నంలో భాష సహజంగానే సరళంగా మారుతుందనిపిస్తుంది. ఈ మార్పు చాలా మంది కవుల్లో కనిపిస్తుంది. తెలుస్తున్నకొద్దీ భాష తేలికవుతుందని అంటారు జెన్ బౌద్ధులు. భాష మీది ప్రేమతో కూడా కవిత్వంలోకి వస్తాం. కానీ, భాష సహచరిగా మారింతర్వాత గొప్పలకు పోవాల్సిన పని లేదు. భాషను దురుపయోగం చేస్తే లేనిపోని గందరగోళం. దాన్ని మినిమైజ్ చేయాలన్నది సంకల్పితమే. Ornate diction నువదులుకోవడం వల్ల కవిత్వానికి మేలు జరుగుతుంది. భాషను ఒత్తిడి చేయకూడదు. ఒక్కోసారి కొన్ని నిశ్శబ్దాల్ని అలా వదిలేయాలి.

మీ కవితలు చదువుతున్నప్పుడు పాఠకుడు అసౌకర్యానికి గురవుతాడు—కానీ అది హింసాత్మక అసౌకర్యం కాదు; ఒక ఆత్మీయ ఒంటరితనం లాంటి అసౌకర్యం. పాఠకుడిని ఈ స్థితికి నెట్టడం మీ రచనా ప్రక్రియలో భాగమేనా?

కవిత్వం ఏదో రకంగా అసౌకర్యాన్నే కలిగిస్తుంది. కవిత్వం రాయడానికి ప్రేరేపించే అసౌకర్యమే అది. కవిత్వం సృజిస్తున్నప్పుడు నా ఏకాంతానికి నేనే అతిథిని. ఆ స్థితిలోకి పాఠకుడిని లాక్కోవాలని ఆరాటపడతాను. ఆ తరువాత నేనక్కడ ఉండను. మంచి కవిత పాఠకుడిని తనదైన వాతావరణంలోకి తీసుకువెళ్తుంది. అప్పుడే కవిత్వంలో వసించడం సాధ్యమవుతుంది. De-coding మొదలుపెడితే ఉభయ భ్రష్టత్వం.

సమకాలీన తెలుగు కవిత్వంలో శబ్దం, నినాదం, వాదం ఎక్కువైన వేళ—మీరు మౌనం, విరామం, ఖాళీ స్థలాన్ని (White Space) ఎంచుకోవడం ఒక ప్రతిఘటనా విధానమా?

ఖాళీ స్థలం కూడా ఖాళీతో నిండి ఉంటుంది. కవిత్వం అంటేనే నిశ్శబ్దంలోకి వెళ్ళడం. అక్కడి వరకు వెళ్ళేంత వరకే ఈ చప్పుళ్ళు. ఆ తరువాత కవిత్వమే ఉంటుంది. ఇది ప్రతిఘటన కాదు, విధానమే.

కలలో మెలకువ కోసం ఆరాటం, మెలకువలో మళ్ళీ కలల కోసం అన్నారు కదా! ఈ తండ్లాట, ఈ పెనుగులాట అంతా మీ కవిత్వం లో కనిపిస్తుంది. సరే! కానీ ఈ తండ్లాట ఆశించే శాంతి మీకు కవిత్వం లో లభించిందా?

Poetry is an act of peace అంటాడుగా నెరుడా. జీవితంలో aggression ఉంటుంది. కవిత్వంలో reconciliation ఉంటుంది. Noise (rhetoric, decoration, ego, and fetish) cancellation ఉన్నప్పుడు కవిత్వంలో శ్వాస ఉంటుంది. శాంతి ఉంటుంది... తండ్లాట, తండ్లాటకూ మధ్య.

ఇంటర్వ్యూ: వంశీకృష్ణ

ఇవి కూడా చదవండి:

జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన

కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?

Updated Date - Jan 12 , 2026 | 01:07 AM