Share News

మానవీయ కోణంలో ఆలోచించి కనీస పింఛన్‌ పెంచాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:32 AM

ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి ఈపీఎస్‌ పెన్షన్‌ పథకం అమలుచేస్తోంది. దేశవ్యాప్తంగా పదవీ విరమణ చేసిన విశ్రాంత కార్మికులు...

మానవీయ కోణంలో ఆలోచించి కనీస పింఛన్‌ పెంచాలి

ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి ఈపీఎస్‌ పెన్షన్‌ పథకం అమలుచేస్తోంది. దేశవ్యాప్తంగా పదవీ విరమణ చేసిన విశ్రాంత కార్మికులు 84 లక్షల మంది ఉన్నారు. వారిలో 36 లక్షల మంది వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్‌ పొందుతున్నారు. ఇది కార్మికులకు ఏ మూలకూ సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక బాధ్యతగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్‌ అందిస్తున్నాయి.

గత 30 సంవత్సరాల గణాంకాలు పరిశీలిస్తే ఈపీఎస్‌ కార్పస్‌ ఫండ్‌ పది లక్షల కోట్ల ఆదాయంలో వడ్డీ విలువ మూడు లక్షల కోట్లు ఉన్నది. 2013లో భగత్‌సింగ్‌ కోషియార్‌ కమిటీ కార్మికులకు కనీస పెన్షన్‌ మూడు వేల రూపాయలకు పెంచమని చెప్పింది. కాని ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్‌ వెయ్యి రూపాయలుగా అమలు చేసింది. ఇది కార్మికులకు నిరాశ కలిగించింది. కనీస పెన్షన్‌ను వెయ్యి రూపాయల నుంచి 7,500లకు పెంచాలని పదవీ విరమణ పొందిన కార్మికులు దేశవ్యాప్తంగా పీఎఫ్‌ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ మైదానంలో ఆందోళనలు నిర్వహిస్తూ కేంద్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు గణాంకాలతో కూడిన వినతిపత్రాలు అందజేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈపీఎఫ్‌ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. కార్మికులకు పెన్షన్‌ పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏ మాత్రం భారం పడదు. ప్రభుత్వం పీఎఫ్‌ కార్పస్‌ ఫండ్‌లో పదివేల కోట్లు కేటాయిస్తే మూడు వేల రూపాయల పెన్షన్‌ను కార్మికులు సులభంగా పొందగలరు. ఆరు నెలల సర్వీసు ఉన్న కార్మికులు ఉద్యోగం విరమిస్తే విత్‌డ్రాయల్‌ బెనిఫిట్‌ వెనక్కి ఇవ్వరు. ఇదంతా ప్రభుత్వానికి మిగులే కదా? ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలించి కార్మికులకు న్యాయం చేయాలి.

బి.వి.సుబ్బన్న,

అనంతపురము

ఈ వార్తలనూ చదవండి:

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

Updated Date - Jul 10 , 2026 | 12:32 AM