ఇంధన పంటలకు ఇదే తరుణం!
ABN , Publish Date - Jul 19 , 2026 | 02:34 AM
వచ్చే పదేళ్ల కాలంలో భారత్‌లో అమ్మే అన్ని మోటారు వాహనాలూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే కావాలి. ఒక దశాబ్దకాలంలో మనం దశలవారీగా డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగిస్తూ, వందశాతం ఈవీలకు మళ్లగలిగితే..
వచ్చే పదేళ్ల కాలంలో భారత్‌లో అమ్మే అన్ని మోటారు వాహనాలూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే కావాలి. ఒక దశాబ్దకాలంలో మనం దశలవారీగా డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగిస్తూ, వందశాతం ఈవీలకు మళ్లగలిగితే.. మనకు ఏడాదికి 25 కోట్ల టన్నుల భారీ స్థాయి ముడిచమురు అవసరం ఉండదు.
బొగ్గు, చమురుపై ఆధారపడటం మానవాళి చరిత్రలో స్వల్పకాలిక దశ మాత్రమే. చివరికి మనకి బొగ్గు, చమురు, గ్యాస్ వనరులు ఖాళీ అవుతాయి. సౌరశక్తిని, జీవపదార్థాన్ని (బయోమాస్) ప్రత్యామ్నాయ ఇంధనంగా మార్చటం మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంది. సౌర విద్యుదుత్పత్తి, స్టోరేజీ బ్యాటరీల ద్వారా ఇప్పుడు మనం ఆ ఇంధన స్వప్నానికి మునుపెన్నడూ లేనంత చేరువలోకి వచ్చాం. జీవ పదార్థాన్ని వినియోగ ఇంధనంగా సమర్థవంతంగా మార్చుకోవటానికి కొత్త సాంకేతికతలు ఇప్పుడు మనకో అవకాశాన్నిస్తున్నాయి.
మన వ్యవసాయ సాగుభూమి 170–180 మిలియన్ హెక్టార్లు. మొత్తం ప్రపంచ సాగునేలలో ఇది సుమారు 11శాతం. ఏడాది పొడవునా పంటలకు అనుకూలంగా ఉండేలా పుష్కలమైన సూర్యరశ్మి, ఉష్ణోగ్రతలు మనకున్నాయి. మన రుతుపవనాలు కావలసినంత వర్షపాతాన్ని అందిస్తాయి. మన భూములు సారవంతమైనవి. 1950లో భారత్ సుమారు 5.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. దీనివల్ల మనం దిగుమతులపై భారీగా ఆధారపడ్డాం. అలాంటిది, ఇప్పుడు మనకు భారీ మిగులు ఉంది. 2024–25లో రికార్డు స్థాయిలో 35.8 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేశాం. దిగుబడుల సమయంలో, మన ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) 8 కోట్ల మెట్రిక్ టన్నుల వరకు గోదాములలో నిల్వ చేస్తోంది. ప్రస్తుతం మన ధాన్యం గిడ్డంగులలో 6 కోట్ల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయి. ఆహారధాన్యాలను ఇలా మనం పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్నా, వినియోగంలో సమాజం పోకడలు మాత్రం మారిపోయాయి. ప్రజల ఆహారపు అలవాట్లు మారటం, వైవిధ్యభరితం కావటంతో బియ్యం, గోధుమల తలసరి వినియోగం తగ్గిపోయింది. దీంతో మార్కెట్‌లో వాటికి డిమాండ్ పరిమితమైంది. అయినా కూడా ఎప్పుడో కొరతల కాలంలో ప్రవేశపెట్టిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూపంలో మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి ప్రభుత్వం బలవంతంగా ధాన్యం కొనాల్సి వస్తోంది. వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లోకి ఇబ్బడిముబ్బడిగా సరఫరా చేస్తోంది. పీడీఎస్‌కి సరఫరా చేసిన ఆహార ధాన్యాలలో సుమారు 40 శాతాన్ని లబ్ధిదారులు మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రీసైక్లింగ్‌తో ఇవి చాలా సందర్భాలలో తిరిగి ఎఫ్‌సీఐకి చేరుతున్నాయి. మరోవంక, ఎంఎస్‌పీ పేరుతో అర్థరహిత ప్రోత్సాహకం ఇస్తుండటంతో రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలకు మళ్లటానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.
ఇంధన పంటల పెంపకానికి సరైన రీతిలో రూపకల్పన చేసి అమల్లోకి తెస్తే, అన్ని సమస్యలనూ ఒక్కసారిగా పరిష్కరించగలదు. రైతులకు ఆదాయం పెరగటం, ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గించటం, గ్రామీణ పారిశ్రామికీకరణను ప్రోత్సహించటం, ఇంధన భద్రత కల్పించటం, చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించటం, పర్యావరణాన్ని పరిరక్షించటం.. ఇవన్నీ ఆ ఒక్క మార్పుతో సాధ్యమవుతాయి. ఉదాహరణకు, హైబ్రిడ్ సూపర్ నేపియర్ గ్రాస్‌ను నీటి వనరులున్న వరి సాగు భూముల్లో పండించటం. ఆ గడ్డి పెంపకానికి ఆ తరహా భూములు అనువైనవి. దీనివల్ల, రైతులు ఎకరాకు ఏడాదికి సుమారు 160 మెట్రిక్ టన్నుల తాజా గడ్డిని పండించగలరు. దీన్నుంచి 8 టన్నుల కంప్రెస్ చేసిన బయోగ్యాస్ (సీబీజీ)ను ఉత్పత్తి చేయవచ్చు. ఇది ఎల్‌పీజీ(వంటగ్యాస్)కి ప్రత్యామ్నాయం. అంతేకాదు, జీవ ఇంధన నూనె, జీవ కర్బనం (బయోచార్), జీవ ఇంధన ఎరువు వంటివి ఉత్పత్తి చేసి అమ్ముకోవచ్చు. ఈ రకంగా రైతులు ఎకరాకు రూ.80,000 నుంచి 1,00,000 నికర ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించనవసరం లేదు. రైతులకు గ్యారంటీగా, స్థిరంగా మంచి ధర లభించేలా భరోసాకు చర్యలు తీసుకుంటే చాలు (ఉదాహరణకు, తాజా నేపియర్ గడ్డి ఎం.టికి రూ.700–800, ఎండు రకానికి టన్నుకు రూ.3,000 వరకు). కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతిలో ముడిసరుకు లభ్యతకు ఢోకా లేకుండా సీబీజీ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి. ప్రభుత్వం ఇప్పటికే అటువంటి పరిశ్రమలకు పెట్టుబడి వ్యయ (క్యాపెక్స్) రాయితీలు, సీబీజీ కొనుగోలుకు హామీ ఇవ్వటం వంటి రూపాల్లో ప్రోత్సాహకాలను ఇస్తోంది. మనం చేయవలసిందల్లా ఈ ప్రక్రియను విస్తృత స్థాయికి విస్తరించటం. కాంట్రాక్ట్ వ్యవసాయం, ఉత్పత్తుల సేకరణకు విధివిధానాలను రూపొందించటం, ముడిసరుకును పరిశ్రమలకు అంతరాయం లేకుండా సరఫరా చేయటం, రైతులకు న్యాయమైన ధర వచ్చేట్లు భరోసా ఇవ్వటం. ఈపాటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేస్తే, పదుల లక్షల ఎకరాల పల్లపు భూమిలో వరి లాంటి పంటలకు బదులు ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు.
మనం భారత్‌లో 11.5 కోట్ల ఎకరాలలో వరి పండిస్తున్నాం. ఇందులో రెండు శాతం– సుమారు 25 లక్షల ఎకరాల భూమిని గనక నేపియర్ గ్రాస్ సాగుకు పూర్తిస్థాయిలో మళ్లించగలిగి, దాన్ని కంప్రెస్ చేసిన బయోగ్యాస్ (సీబీజీ)గా మార్చగలిగితే సూర్యరశ్మి పుష్కలంగా ఉన్న మన భూముల్లో 2 కోట్ల టన్నుల సీబీజీని ఏటా ఉత్పత్తి చేయగలం. భారతదేశానికి వంటగ్యాస్ దిగుమతి అవసరం ఉండదు. ప్రస్తుత ధరల ప్రకారం– సుమారు రూ.1,50,000 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోగలం. భూమి ఉత్పాదకత పెరిగినకొద్దీ, మనం ఇంధన పంటల్ని ఎక్కువ ప్రాంతాలకు విస్తరించవచ్చు. ఆహార భద్రతకు ఢోకా లేకుండానే ఇవన్నీ చేయవచ్చు.
అదే విధంగా, భారత్‌లో 21 కోట్ల ఎకరాల అటవీ భూమి ఉంది. మన వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన ఇంధన చెట్లను అడవుల్లో పెంచవచ్చు. ఉదాహరణకు, పాప్లర్(కాటన్ వుడ్), విల్లో(కొండ గన్నేరు), యూకలిప్టస్ (నీలగిరి), సరుగుడు, గుమ్మడి టేకు(గహర్), మాంగియం (మక్కం), సుబాబుల్ తదితరాలు. ఒక ఎకరం అటవీ భూమిలో ఏటా ఎకరాకు 5 టన్నుల జీవ పదార్థాన్ని (బయోమాస్) సాధారణంగా ఉత్పత్తి చేయవచ్చు. జీవ పదార్థాన్ని ఇంధనంగా పూర్తిస్థాయిలో మార్చటానికి ఇప్పుడు సాంకేతికతలు(పైరోలిసిస్, ఎంజైమ్‌లు) అందుబాటులో ఉన్నాయి. అటవీ భూమిలో సుమారు 10శాతం గనక ఇంధన వృక్షాల పెంపకానికి కేటాయించగలిగితే బయోఇథనాల్, జీవ ఇంధన నూనె, జీవ కర్బనం లేదా సుమారు 2.5 కోట్ల టన్నుల దిగుమతి నూనెకు సమానమైన విలువగల రసాయనాల్ని మనం ఉత్పత్తి చేయగలం.
మన భూ విస్తీర్ణం, సారవంత నేలలు, ఉష్ణమండల వాతావరణం, ప్రస్తుత సాంకేతికత, విస్తృత స్థాయి వల్ల సగటు వ్యయం తగ్గటం... ఇవన్నీ మనం హైడ్రోకార్బన్ల దిగుమతి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను విముక్తం చేసే అద్భుతావకాశాన్నిస్తున్నాయి. ఒక కీలక విధాన నిర్ణయం అమలు ‘ఇన్ని రకాల లాభాలను సమాజానికి అందించటం’ అరుదుగా మాత్రమే జరుగుతుంది. మనం ఈ అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోవాలి.
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్
లోక్‌సత్తా వ్యవస్థాపకులు
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!