Share News

Rural Employment Guarantee Scheme: ఉపాధి హామీ అవకతవకలకు స్వస్తి

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:39 AM

గ్రామీణ ప్రాంతాల్లో కనీస ఉపాధిని చట్టబద్ధం చేస్తూ ఉపాధి హామీ పథకం ప్రారంభం అయింది. 2007–14 మధ్య 1660 కోట్ల పని దినాలకు 2.13 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి 1.53 కోట్ల గ్రామీణ ఆస్తుల...

Rural Employment Guarantee Scheme: ఉపాధి హామీ అవకతవకలకు స్వస్తి

గ్రామీణ ప్రాంతాల్లో కనీస ఉపాధిని చట్టబద్ధం చేస్తూ ఉపాధి హామీ పథకం ప్రారంభం అయింది. 2007–14 మధ్య 1660 కోట్ల పని దినాలకు 2.13 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి 1.53 కోట్ల గ్రామీణ ఆస్తుల కల్పన జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 2014–15 నుంచి 2025–26 వరకు 3029 కోట్ల పనిదినాలకు 8.54 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి దాదాపు 9 కోట్ల గ్రామీణ ఆస్తుల సృష్టి జరిగింది. అంటే, ఈ పథకం ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వం తమ పాలన 7 సంవత్సరాలకు సగటున సంవత్సరానికి రూ.30,500 కోట్లు ఖర్చు చేస్తే, ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాల పాలనలో సగటున సంవత్సరానికి 77,000 కోట్లు ఖర్చు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ హయాంలో ఇప్పటి వరకు ఉపాధి హామీ క్రింద అందిన నిధులు 87 వేల కోట్లు (సీసీ రోడ్లు, కాలువలు, మరుగుదొడ్లు, ఫార్మ్ పాండ్లూ, అమృత్ సరోవర్, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, గోకులం షెడ్లు కోసం). ఈ నిధులతో 262 కోట్ల పనిదినాలకు 52 వేల కోట్లు ఉపాధి హామీ వేతనాలు, 31 వేల కోట్లు మెటీరియల్ కాంపోనెంట్, 4 వేల కోట్లు సిబ్బంది వేతనాలు చెల్లించారు.

రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలపై ఇరవై సూత్రాల అమలు (వికసిత్ భారత్– స్వర్ణాంధ్రప్రదేశ్) సమగ్ర సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ పథకం అమలులో సంస్కరణలు అవసరం కనిపించింది. 2019–24 మధ్య ఉపాధి కూలీలుగా బోగస్ పేర్లతో కార్డులను భారీగా సృష్టించారు. కేవైసీ అమలు చేస్తే రాష్ట్రంలో 11 లక్షల బోగస్ కార్డులు దొరికాయి. వీటితో నిధులు దోచేశారు. తప్పుడు మస్టర్లతో పనిచేయడానికి రాని వారికి చెల్లింపులు చేశారు. పనిచేయడానికి వచ్చినా నిర్ణీత సమయం పని చేయలేదు. పనిచేయకుండానే చేసినట్లు రికార్డులలోకి ఎక్కించారు. పని తక్కువ చేసి ఎక్కువగా రికార్డులలో నమోదు చేశారు. ప్రామాణికతకు అనుగుణంగా పనులలో నాణ్యత లేదు. అలాగే వ్యవసాయ సీజన్‌లో కూలీలు దొరకక రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పటివరకు గత 20సంవత్సరాలలో దేశంలో 10.67 లక్షల కోట్లు (ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు లక్ష కోట్లు పైగా) ఖర్చు చేస్తే, ఆస్తుల సృష్టి ఆ మేరకు జరగలేదు.


ఉపాధిహామీ పథకంలో బోగస్ కార్డులు, చెల్లింపులకు చెక్ పెట్టి గ్రామాలలో ఉపాధి, నాణ్యమైన ఆస్తుల కల్పన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇవి నేటి పరిస్థితులకు అనుగుణంగా సత్ఫలితాల కోసం అవసరమైన నిర్ణయం. ‘‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (VB–G RAM G)–2025’’ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పనతో పాటు నాణ్యమైన ఆస్తుల సృష్టికి దోహదపడే విధంగా, నిధుల దుర్వినియోగాన్ని నివారిస్తూ, ఉన్నతమైన లక్ష్యంతో పారదర్శకంగా నిధులు వినియోగించే ఉద్దేశ్యంతో చేసిన చట్టం.

ప్రస్తుతం ఉన్న ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల ఉపాధి హామీని, 125 రోజులకి పెంచడం ఒక కీలక సంస్కరణ. అలాగే, ఉపాధి హామీ పథకం కింద పని కోరిన వ్యక్తికి 15 రోజుల్లోగా ఉపాధి కల్పించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భత్యం చెల్లించాల్సిన నిబంధనను కొత్త బిల్లు యథాతథంగా కొనసాగిస్తోంది. వ్యవసాయ కాలంలో కూలీల కొరతను దృష్టిలో ఉంచుకొని, ఈ సీజన్‌లో 60 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేసే అవకాశం కల్పించింది. దీని ద్వారా గ్రామీణ కార్మికులకు ప్రభుత్వ పథకం కింద 125 రోజులు, వ్యవసాయ సీజన్‌లో అదనంగా 60 రోజుల ఉపాధి లభిస్తుంది. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 వ్యయ నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. దీంతో ఈ పథకం క్రింద వినియోగించే నిధుల పరిమాణం పెరిగి గ్రామీణ ఉపాధి విస్తరణకు, నాణ్యమైన ఆస్తుల సృష్టికి అవకాశం కలుగుతుంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్ లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తుంది.

తప్పుడు లావాదేవీలు, దుర్వినియోగాలను పూర్తిగా అరికట్టేందుకు ఈ బిల్లు ఆధునిక సాంకేతికత వినియోగాన్ని ప్రతిపాదిస్తోంది. అవి– లావాదేవీలకు బయోమెట్రిక్ ధృవీకరణ; ప్రణాళిక, పర్యవేక్షణకు భౌగోళిక సమాచార సాంకేతికత; రియల్‌టైమ్ పర్యవేక్షణకు మొబైల్ యాప్ ఆధారిత డ్యాష్‌బోర్డులు; వారానికోసారి ప్రజలకు వెల్లడించే సమాచార వ్యవస్థ. ఈ చర్యల ద్వారా పనిచేయకుండానే చెల్లింపులు, నకిలీ లావాదేవీలు, ఉపయోగం లేని పనులు పూర్తిగా తొలగిపోతాయి.

లంకా దినకర్

చైర్మన్, ఇరవై సూత్రాల కార్యక్రమం

Also Read:

చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!

Updated Date - Jan 06 , 2026 | 12:39 AM