Share News

పల్లె కథా భారతి

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:30 AM

గడిచిన ఆరేడేళ్ల కాలంలో కథా ప్రక్రియకు సంబంధించి తెలుగు సాహిత్య యువనికపై ఎండపల్లి భారతి అనే వేగుచుక్క పొడిచింది. 2018లో ‘ఎదారి బతుకులు’ పేరిట 30 కథల సంపుటి,...

పల్లె కథా భారతి

గడిచిన ఆరేడేళ్ల కాలంలో కథా ప్రక్రియకు సంబంధించి తెలుగు సాహిత్య యువనికపై ఎండపల్లి భారతి అనే వేగుచుక్క పొడిచింది. 2018లో ‘ఎదారి బతుకులు’ పేరిట 30 కథల సంపుటి, 2021లో ‘బతుకీత’ పేరుతో 20 కథల సంపుటి, 2023లో ‘జాలారి పూలు’ పేరిట మరో 20 కథల సంపుటి గాక, అదే ఏడాది ‘జక్కీకు’ నవల, గత ఏడాది ‘దేవరహస్యాలు’ కథా సంపుటి వెలువరించి కథా స్రవంతితో అలజడి సృష్టించింది. ఎలిమెంటరీ స్కూలు దాటని ఒక పల్లెపడుచు, అందులోనూ మాదిగపల్లె ఆడపిల్ల, పన్నెండేళ్లకే పెళ్ళై సంసార సాగరంలో నెట్టబడ్డ ఒక వెనుకబాటుకు గురైన ప్రాంతపు ఆడపిల్ల, ఇంత తక్కువకాలంలో ఇన్ని కథలు రాయటమే కాదు 40 వేల కాపీలు అమ్ముడయ్యే ‘నవోదయం’ పత్రిక సంపాదకవర్గ సభ్యురాలిగా ఉంది, ఒక సినిమాతోపాటు, మరికొన్ని లఘు చిత్రాలు నిర్మించిందంటే నమ్మలేం. కాని అది నిజం. గతంలో నామిని ‘మిట్టూరోడి’ భాషను చూసి చిత్తూరు జిల్లా భాషలో ఇంత మాధుర్యముందా! అనుకొని చిత్తయిన పాఠకులు ఎండపల్లి భారతి మదనపల్లె ప్రాంతపు (దిగువ బురుజు) మాండలికానికి అబ్బురపడ్డారు, ఆస్వాదించారు. భారతి కథల్లో తాత్వికత, కథనంలో కళాత్మకత, జీవం, జనజీవిత విస్తృతి ఉన్నాయి. బూతు మాటలు, సామెతలు కథలో అలవోకగా ఇమిడిపోవటమేగాక అశ్లీలత ఛాయలు ఎక్కడా కనపడవు. కులవివక్ష, లింగవివక్ష అత్యంత సహజంగా చూపటంలో భారతి కథన కౌశలం అపూర్వం. గ్రామీణ జీవితంతో సంబంధం ఉన్న పాఠకులకు మన పక్కన రోజూ జరిగిన విషయమంత సహజంగా, పల్లె జీవితంతో సంబంధంలేని పట్టణ వాసులకు అబ్బురంగా అన్పించే కథలు ఇవి.

‘ఎదారి బతుకులు’ పుస్తకానికి ముందుమాటలో ఇండస్‌ మార్టిన్‌ అన్నట్లు, ‘‘ఈ భూ ప్రపంచకం మొత్తం మీద ఏ మూలకి వెళ్లినా ఆడోళ్లు దిగనాసితనంలోకి తోసెయ్యబడ్డాళ్లే. ఈ దేశపు ఆడోళ్లు మరికాస్త ఎక్కువ తోసెయ్యబడ్డవాళ్లే. ఇందులో మళ్లీ మా దళితగూడెం ఆడోళ్లు బయట సమాజంలో కులం పేరుతో, ఇంట్లో మొగాళ్ల చేతుల్లో ఆడంగితనం పేరుతో, మిగతా కులాల ఆడోళ్ల మజ్జనేమో కులంతోపాటు బీదరికాన్నిబట్టీ మొత్తంగా ఈసడించుకోబడుతున్నారు.... మా గూడెపు మొగోడు తనతోపాటు సమానంగా బువ్వ సంపాదిచ్చే, తనకన్నా ఎక్కువగానే గుడిసెను భద్రం చేసుకునే దళిత స్త్రీలపట్ల చూపించే ‘మగతనం’ భారతి కథల్లో మిగతా స్త్రీవాద సాహిత్యంలోని నిందా దృక్పథంతో కాకుండా నిస్సహాయత వ్యక్తం చేస్తూ వివక్షను ఎత్తిచూపుతుంది’’.


ఏ ప్రక్రియలో అయినా క్లుప్తత సుందరంగా ఉంటుంది. రాయటంలోనూ, మాట్లాడటంలోనూ ‘‘తక్కువ’’ చాలా ఎక్కువమందిచే ఆకర్షింపబడుతుంది. భారతి రాసిన కథల్లో నేను చదివిన 72 కథల్లో ఒక్క ‘మా ఇంటికొచ్చిన నల్లపెట్ట’ అనే కథ మాత్రమే ప్రింటులో 17 పేజీలుంది. మిగిలిన 71 కథలూ నాలుగైదు పేజీలే. భారతి కథల్లో కన్పించే ఈ క్లుప్తసుందరత కూడా పాఠకుల్ని ఆకర్షించటానికి ఒక కారణం కావచ్చు.

టమాటా (అవగూద కాయలు) పంట పేరిట జూదం, పురుగు మందు పేరిట భూమితల్లి కడుపు విషంతో నింపటం, దుడ్లుపెట్టి నీళ్లు కొనే కాలంలో చొమ్ము (చెంబు) నీళ్లు పుట్టని వైనం, నీళ్ల కడవెత్తమంటే అంతలావు మొగున్ని మోస్తారు గాని నీళ్ల కడవ మొయ్యలేరా అని చెతురాడే ఆడాళ్లు, ఇత్తడి బిందె కొన్న మల్లమ్మని చూసి ‘‘మా తాగుబోతు నాబట్ట ఎంత నోరుకొట్టుకొని చెప్పినా పైసా మిగిలిస్తే కదా కూలి దుడ్లంతా నా సాడు తాగేదానికే సరిపోతుండే’’ అని బాధపడే ఇల్లాలు, ‘‘నేనూ నా బిడ్డా కడుపు కట్టుకుని కూడేసిన దుడ్లతో తెచ్చిన ఇత్తలి బిందె నక్కా ముక్కాట కోసం నీ ఎదాన పెట్టుకుంటివే’’ అని వాపోయిన మల్లమ్మ, కసువుకి పోయి రెడ్డికి చిక్కి ‘‘ఓయప్పా నేను ఈ పొద్దే బయట ఉన్నాను. నా దగ్గరకొచ్చి ఏమన్నా అయితే చెడ్డపేరు. మూడుదినాలైనాక ఈటికే వస్తా నీ పని గడపతానని’’ తప్పించుకున్న ఆడది, సావు గుంత కాడ దానమిచ్చిన వడ్లను తెచ్చి సంకట చేసి తిన్నంక సావు బియ్యం తినకూడదని ఆనెంక తెల్సుకున్న ఆమెకి ‘‘సావు బియ్యమూ బతుకు బియ్యమూ అని వుండవు. కాలే కడుపును సల్లార్చే బియ్యమే వుంది’’ అని ఓదార్చిన బోయ కొండవ్వ... ఇలా పల్లెలో ప్రతి మనిషీ, పల్లె చుట్టూ జరిగే ప్రతి ఘటనా భారతి కథల్లో కదురుకున్నాయి. ఈ కథల కాలంలో వచ్చిన కరోనా, పెద్దనోట్ల రద్దు కూడా కథలుగా మారాయి. సమస్త పల్లె జీవితాల్ని సవిస్తారంగా కథల రూపంలో మన ముందు పరిచింది ఎండపల్లి భారతి.


ప్రచారం వలనో, మార్కెట్‌ మాయాజాలం వలనో, ఇతరేతర కారణాల వలనో లక్షల పుస్తకాలు అమ్ముడుపోవచ్చు. కాని అవి పాఠకుల మన్నన పొందిన దాఖలాలు లేవు. యాదృచ్ఛికంగా భారతి ఒక్క కథను చదివినా మిగిలిన కథల్ని ఆ కథే చదివిస్తుంది. మిగిలిన పుస్తకాల్ని కొనిపిస్తుంది. సాహిత్య ప్రక్రియల్లో కథ, కవిత్వం పాఠకుల్ని కోల్పోతున్న వర్తమాన కథా స్రవంతిలో ఇలా చదివించిన రచయిత్రి భారతే!

చెరుకూరి సత్యనారాయణ

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News

Updated Date - Feb 09 , 2026 | 02:30 AM