స్త్రీలపై హింసను అంతం చేద్దాం
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:41 AM
స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా నిర్వహించే ‘అంతర్జాతీయ ప్రచారోద్యమం’ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు ప్రపంచవ్యాప్తంగా...
స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా నిర్వహించే ‘అంతర్జాతీయ ప్రచారోద్యమం’ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు ప్రపంచవ్యాప్తంగా జరగనుంది. దీన్ని 16 రోజుల కార్యాచరణ అని కూడా అంటారు. స్త్రీలపై, బాలికలపై జరిగే అన్ని రకాల హింసను రూపుమాపడం ఈ ప్రచారోద్యమం ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం ఈ ప్రచారోద్యమం– హింసకు గురైన మహిళలకు రక్షణ, వైద్యం, మానసిక, న్యాయ సహాయం అందించడం, నిందితులకు శిక్ష పడేలా చూడడం అనే అంశాలపై జరగాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ ప్రచారోద్యమం నేటితో ప్రారంభమై డిసెంబర్ పదో తేదీన ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ వరకు కొనసాగనుండడం విశేషం. మహిళలపై ఇంటా బయట జరిగే శారీరక, మానసిక, ఆర్థిక హింస, దోపిడీతో పాటు, బాలికలపై జరుగుతున్న అనేక రకాల హింస, సోషల్ మీడియా వేధింపులు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, కుల, మత, లింగ అసమానతలు తొలగిపోయి వారంతా స్వేచ్ఛగా, సమానత్వంతో జీవించాలి. స్ర్తీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రభుత్వాలు, కోర్టులతో పాటు మొత్తం యంత్రాంగం స్పందించాలి.
సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు, గౌరవప్రదమైన కుటుంబ జీవితం, సమాన వేతనం, బాలబాలికల దశ నుంచి పెరిగిపోతున్న హెచ్చుతగ్గులు... మొత్తంగా మహిళలపై కొనసాగుతున్న పురుషాధిపత్య ధోరణులు, వైషమ్యాలను రూపుమాపాలి. ఇది మనందరి బాధ్యత. ఒకప్పుడు భాగ్యసీమగా ఉన్న మన భారతం నేడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడానికి ప్రధాన కారణం స్త్రీ, పురుష అసమానతలేగాక, మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడమే. వారి శ్రమకు, నైపుణ్యానికి, ప్రతిభకు స్థానం కల్పించకుండా, వారిని గుర్తించకుండా ఉండడమే. మన దేశంలోని స్త్రీలు కుటుంబంలో, పని ప్రదేశాల్లో, బయట సమాజంలో నిర్భయంగా, స్వేచ్ఛగా, హింసకు గురికాకుండా ఉన్నప్పుడే సమాజ పురోగతి సాధ్యమవుతుంది.
స్త్రీలను శృంగార ప్రతీకలుగా చూపించే వ్యవస్థ రోజురోజుకూ పెరుగుతున్నది. దీనివల్ల వారిపై హింస మరింతగా పెరుగుతోంది. ఇలాంటి విష భావజాలాన్ని అంతం చేయాల్సిన బాధ్యత ఎవరిది? జెండర్ దృక్పథంతో చూడలేని సమాజాన్ని, ప్రభుత్వాలను మార్చాల్సిన బాధ్యత ఎవరిది? బాల్య దశ నుంచి పాఠ్యపుస్తకాల్లో మనం పిల్లలకు నేర్పించాల్సిన, అర్థం చేయించాల్సిన అంశాల్లో పూర్తిగా విఫలమైతే భవిష్యత్ తరాలు ఎక్కడినుంచి నేర్చుకుంటాయి? చెప్పకనే అంతర్లీనంగా కులం, మతం, లింగ భావజాలం గురించి నేర్పుతున్న పాఠాలు... లింగ సమానత్వం, కుల, మత సమానత్వం గురించి నేర్పుతున్నాయా? ఇవన్నీ వదిలేసి, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని గగ్గోలుపెడుతూ, పోక్సో లాంటి చట్టాలు ఎన్ని తీసుకువచ్చినా ఉపయోగం లేదు. ఉన్న జాడ్యాలను మూలాలతో సహా తీసివేయకుండా, అమలు కాని చట్టాలను ఎంత ప్రత్యేకంగా ప్రవేశపెట్టినా లాభం ఉండదు. ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి అవగాహన కలిగించే ఇలాంటి ప్రాముఖ్యమైన రోజులు, ప్రచారోద్యమాలు జరిగినప్పుడైనా మనం మన బాధ్యతను గుర్తెరగాలి. మా ‘దళిత స్త్రీ శక్తి’ సంఘం గత 20 సంవత్సరాలుగా ఈ ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తున్నది. సమాజంలోని మహిళలపై, ముఖ్యంగా దళిత, ఆదివాసీ స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసను రూపుమాపే దిశగా కృషి చేస్తున్నది. అందులో భాగంగానే ఈ ప్రచారోద్యమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో అనేక సభలు సమావేశాలు, మానవహారాలు నిర్వహిస్తూ... హింస లేని సమాజం రూపొందాలని, అది మన ద్వారానే సాధ్యమవుతుందని ప్రచారం చేస్తోంది. మహిళ వ్యక్తిగా కాకుండా సంఘటిత శక్తిగా ఎదగాలి. వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయాలి. ఈ 16 రోజుల ప్రచారోద్యమానికి ప్రజలంతా చేయి కలుపుతారని ఆశిస్తున్నాం. హింస లేని, కుల, మత అసమానతలు లేని సమాజాన్ని తీసుకురావడం మనందరి బాధ్యత.
ఝాన్సీ గెడ్డం
దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రణాళిక: మంత్రి ఉత్తమ్