రైతు భాగస్వామ్యం లేని ‘ఈ–నామ్’
ABN , Publish Date - May 23 , 2026 | 03:04 AM
దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో 2016లో కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెట్ (National Agriculture Market – eNam)ను ప్రారంభించింది...
దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో 2016లో కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెట్ (National Agriculture Market – eNam)ను ప్రారంభించింది. భౌతిక మార్కెట్లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించి, రైతులకు దేశవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో నేరుగా వ్యాపారం చేసే అవకాశాన్ని కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులోను, అమ్మకాలలోను పారదర్శకత తీసుకురావడం కోసం, రైతులకు మెరుగైన ధరలు అందించే ప్రధాన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది.
ఈ వేదిక వల్ల రైతులకు ధర నిర్ణయంలో పారదర్శకత ఉంటుంది. ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా పోటీ ధరలు దొరుకుతాయి. దేశవ్యాప్తంగా మార్కెట్ యాక్సెస్, బ్యాంక్ ఖాతాల్లో నేరుగా చెల్లింపులు వంటి సదుపాయాలు ఉంటాయి. కేంద్రం ప్రతి మార్కెట్‌కి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.75 లక్షల వరకు సహాయం చేస్తున్నది. నాణ్యత పరీక్షకు ల్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, కంప్యూటర్లు, గ్రేడింగ్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటును చేపట్టింది.
అయితే దేశవ్యాప్తంగా ఈ ఈ–నామ్ విజయగాథలో తెలంగాణ పేరు మాత్రం ప్రముఖంగా లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 197 నియంత్రిత వ్యవసాయ మార్కెట్లలో కేవలం 57 మాత్రమే ఈ–నామ్‌తో అనుసంధానమయ్యాయి. ఇది కేవలం 28.93శాతం మాత్రమే. డిజిటల్ మార్కెట్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా ఇంకా సమగ్రంగా విస్తరించలేదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. జిల్లాల వారీగా కూడా తీవ్ర అసమానతలు ఉన్నాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 100శాతం మార్కెట్లు ఈ–నామ్‌లో చేరగా, వరంగల్, మహబూబాబాద్, వనపర్తి జిల్లాల్లో 60–75శాతం వరకు పురోగతి ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఇది 20–40శాతానికి పరిమితమైంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అమలు ప్రారంభం కాలేదు.
రైతుల భాగస్వామ్యం కూడా ఆశించిన స్థాయిలో లేదు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ, కేవలం 18.23 లక్షల మంది మాత్రమే ఈ–నామ్‌లో నమోదు అయ్యారు. అదేవిధంగా 6,371 మంది ట్రేడర్లు, 5,161 కమిషన్ ఏజెంట్లు, 137 రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO)లు మాత్రమే ఇందులో భాగమయ్యారు. దీన్నిబట్టి డిజిటల్ వ్యవసాయ మార్కెటింగ్‌లో ఇంకా పెద్ద విభాగం రైతులు బాగస్థులు కాలేదని అర్థమవుతూంది.
వ్యాపార పరంగా చూస్తే తెలంగాణలో ఈ–నామ్ ద్వారా రూ.30,164 కోట్ల విలువ గల 79.65లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం నమోదైంది. ఇందులో పంటల వారీగా వరి 39.62శాతం వాల్యూమ్‌తో ఆధిపత్యం చాటుకుంది. మొక్కజొన్న 12.82శాతం, పసుపు 11.14శాతం, పత్తి 8.42శాతం, మిరప 5.16శాతం, ఎర్రశెనగ 4.33శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఆదాయపరంగా పసుపు, మిరప, పత్తి పంటలు ఎక్కువ విలువను అందించాయి. ఇది పరిమాణం కంటే విలువ ఆధారిత పంటల ప్రాధాన్యత పెరుగుతోందని సూచిస్తోంది.
ఇంకా ఒక కీలక అంశం అంతర్రాష్ట్ర వాణిజ్యం. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ–నామ్ ద్వారా జరిగిన వ్యాపారం కేవలం 385.21 క్వింటాళ్లు, రూ.35.11 లక్షలకే పరిమితమైంది. దీన్నిబట్టి ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం అయిన జాతీయ మార్కెట్ ఏకీకరణ ఇంకా పూర్తి కాలేదని తెలియజేస్తోంది.
ఈ పరిస్థితికి కారణాలు స్పష్టమే. రైతుల్లో డిజిటల్ అవగాహన లోపం ప్రధాన అడ్డంకి. ఈ–నామ్ విధానాలపై సరైన అవగాహన లేకపోవడం, కమిషన్ ఏజెంట్లపై ఆధారపడే పాత వ్యవస్థ కొనసాగుతుండటం, మార్కెట్లు గ్రామాలకు దూరంగా ఉండటం, నాణ్యత పరీక్ష సదుపాయాల కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్లిష్టత, ఆన్‌లైన్ బిడ్డింగ్‌పై అనిశ్చితి, ఇంటర్నెట్ సమస్యలు వంటి వన్నీ కలిసి రైతుల భాగస్వామ్యాన్ని తగ్గిస్తున్నాయి.
తెలంగాణలో ఈ–నామ్‌ను నిజమైన విజయంగా మార్చాలంటే, మిగిలిన మార్కెట్లను త్వరగా అనుసంధానం చేయాలి. గ్రామీణ స్థాయిలో డిజిటల్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నాణ్యత పరీక్షలను విస్తరించాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO)ల పాత్రను బలోపేతం చేయాలి. ముఖ్యంగా రైతులో నమ్మకం పెంపొందించాలి.
ఉదయ్‌కుమార్. జి
జర్నలిస్ట్
ఇవి కూడా చదవండి..
ఆ పెళ్లికి వెళితే నన్ను బతకనీయరు.. మీడియాపై ట్రంప్ సెటైర్లు