ఉద్యోగుల ఆరోగ్య భద్రత ఈహెచ్‌సీటీ బాధ్యత!
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:18 AM
మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థానంలో సమగ్రమైన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కావాలని రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)...
మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థానంలో సమగ్రమైన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కావాలని రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) రూపుదిద్దుకుంది. కానీ రాష్ట్ర విభజన ఆందోళనల నేపథ్యంలో ఆ పథకం అమలులోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో 2017 నుంచి దాదాపు రెండేళ్ళు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం సమర్థవంతంగా అమలు చేసినా, ఆస్పత్రులకు చెల్లింపులు ఆలస్యం కావడంతో బకాయిలు పేరుకుపోయి అవి నగదు రహిత వైద్యాన్ని నిలిపివేశాయి.
ఈహెచ్ఎస్ అమలు డిమాండ్ తీవ్రంగా ఉండటంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 8న ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ)ను ఏర్పాటు చేస్తూ జీవో 186జారీ చేసింది. మరుసటి రోజే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అది అమలుకు నోచుకోలేదు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ‘ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తాం’ అని మేనిఫెస్టోలో ప్రకటించింది. జేఏసీ ఆందోళనల ఫలితంగా రెండున్నరేళ్ళ తరువాత ఈహెచ్‌సీటీ ఏర్పాటు చేసి, హెల్త్ కార్డులపై వైద్యం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ పథకం అమలు చేయాలంటే సంవత్సరానికి రూ.1056 కోట్లు ఖర్చు అవుతుందని, సగం ఉద్యోగులు, పెన్షనర్లు భరిస్తే, మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మెజారిటీ సంఘాలు ఆమోదం తెలపడంతో ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి 1.5శాతం చందా వసూలు చేయాలని నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి జరిపిన చర్చల్లో జూన్ 1 నుంచి ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం అమలు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా అధికారుల మధ్య సమన్వయం లోపించి విధివిధానాలు ఖరారు చేయడంలో జాప్యం జరిగింది.
అయితే ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా, మార్గదర్శకాలు విడుదల చేయకుండానే ఆర్థికశాఖ మే నెల వేతనాల్లో 1.5శాతం కోత విధించడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం అప్రతిష్ఠ పాలైంది. సీఎస్ జోక్యం చేసుకుని జూన్ 1న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి రెండు రోజుల్లో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని, సంఘాల ప్రతినిధులు ఇచ్చే సూచనల ఆధారంగా పది రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని వివరణ ఇచ్చారు. కానీ మూడు వారాలు గడుస్తున్నా ట్రస్ట్ సభ్యుల నియామకం జరగలేదు. మార్గదర్శకాల జీవోలు విడుదల కాలేదు.
ఈహెచ్‌సీటీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంటుందని, ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి మినహాయించిన మొత్తాన్ని, దానికి సమానమైన ప్రభుత్వ వాటాను అదేరోజు ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తామని, ట్రస్ట్ ద్వారానే ఆస్పత్రులకు చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో అనుభవాలను బట్టి స్కీములో మార్పులు చేసుకునే అధికారం కూడా ట్రస్ట్‌కే ఉంటుందన్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీలు చేసేది కేవలం వ్యాపారం. కానీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉద్యోగులు, పెన్షనర్ల భాగస్వామ్యంతో కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటవుతున్న సంస్థ. లాభాపేక్ష లేకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా, నిజమైన అవసరంలో ఉన్న ఉద్యోగి లేదా పెన్షనర్‌కు రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించడం ట్రస్టు ప్రాథమిక బాధ్యత. ఈహెచ్‌సీటీ పాలకవర్గం ఆ మేరకు నిబద్ధతతో వ్యవహరించినప్పుడే ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరుతుంది.
చావ రవి
యూటీఎఫ్ అధ్యక్షుడు
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..