Share News

ఎమర్జెన్సీ చరిత్రకు సాహిత్య ఆర్కైవ్స్ ‘చీకటి రోజులు’

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:26 AM

దేశంలో ప్రకటిత ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు. నాటి భయద వాతావరణాన్ని చిత్రిస్తూ దేశవ్యాప్తంగా తర్వాత ఎన్నో రచనలు, సినిమాలు వచ్చాయి. వాటిలో తొలి సృజనాత్మక రచన అంపశయ్య నవీన్ ‘చీకటి రోజులు’. నాటి దురాగతాలు...

ఎమర్జెన్సీ చరిత్రకు సాహిత్య ఆర్కైవ్స్ ‘చీకటి రోజులు’

దేశంలో ప్రకటిత ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు. నాటి భయద వాతావరణాన్ని చిత్రిస్తూ దేశవ్యాప్తంగా తర్వాత ఎన్నో రచనలు, సినిమాలు వచ్చాయి. వాటిలో తొలి సృజనాత్మక రచన అంపశయ్య నవీన్ ‘చీకటి రోజులు’. నాటి దురాగతాలు అనేక రూపాల్లో నేడు పునరావృతమౌతున్న సందర్భంలో ఆ నవల ఇంగ్లీష్‌ అనువాదాన్ని ‘డైరీ ఆఫ్ యాన్ అన్‌సీన్ విట్‌నెస్’ పేరుతో ‘స్పీకింగ్ టైగర్ బుక్స్’ ఇంగ్లిష్‌లో ప్రచురించింది. ఆ సందర్భంలో పుస్తకం అనువాదకురాలు కల్పనా కన్నబిరాన్‌తో సంభాషణ:

అంపశయ్య నవీన్ రచనలు చైతన్య స్రవంతి టెక్నిక్‌లో రాసినవీ, డెబ్భై యేళ్ళ తెలంగాణ చరిత్రని నమోదు చేసినవీ ఇతరత్రా ప్రసిద్ధమైనవి ఉండగా ‘చీకటి రోజులు’ నవలనే ఎందుకు అనువదించాలని అనిపించింది?

రాజ్యహింస, ఆధిపత్యాల కింద నలిగే మనిషి దుస్థితి చుట్టూ, జీవన వేదన చుట్టూ తిరిగే సృజనాత్మక రచనలపైన నాకు మొదట్నుంచీ ఆసక్తి. వ్యవస్థీకృత అవినీతి చుట్టూ ఉన్న సృజనాత్మక రచనల్ని గతంలో అధ్యయనం కూడా చేశాను. నేను సాహిత్య విద్యార్థిని కాదు – న్యాయశాస్త్రం, జ్యూరిస్‌లిటరేచర్స్ (jurisliteratures) దృష్టి కోణం నుంచి నేను సాహిత్యాన్ని చేరుకుంటాను. కోర్టు రూమ్‌లో వెలువడే తీర్పులు నాకు సాహిత్యం. న్యాయ పరిభాషలోని పదాలు, వాటి కనిపించే/ కనిపించని అర్థాలు, న్యాయం కోసం అక్కడ తచ్చాడే రక్త మాంసాలతో నిండిన ప్రజలు, వాళ్ళ భౌతిక మానసిక బాధలు, పౌరుల హక్కులపై స్వేచ్ఛపై తక్షణం చోటు చేసుకునే పరిణామాలు... వీటన్నిటికీ కోర్టు రూమ్ నిలువెత్తు సజీవ రూపం అని నేను భావిస్తాను. దీనితో పాటు, సామాజిక విప్లవోద్యమాల్లో పనిచేసినవారి కోసం న్యాయకోవిదుడిగా మా నాన్నగారు తన జీవితకాలంలో చేసిన వాదోపవాదాల నుంచి, రాజ్యాంగ విలువల పట్ల ఆయన చూపిన నిబద్ధత నుంచి లభించిన ఎరుక నాకు ఉండనే ఉంది. కోర్టు గదుల్లో వినిపించిన ఆధిపత్య వ్యతిరేక ప్రతిఘటన స్వరాల సాహిత్యం సైతం నాకు ఆయన్నుంచి అందివచ్చింది. ఈ మేధోపరమైన రాజకీయ నిమగ్నతే నన్ను నవీన్ ‘చీకటి రోజులు’ నవల వైపు చూసేలా చేసింది.

కోర్టు కేసులకు సంబంధించిన ఆర్కైవ్‌లు మనకు ఒక విలువైన కథనాన్ని అందిస్తాయి. అయితే సాహిత్య ఆర్కైవ్ మన కోసం ఈ చరిత్రను ఒక ప్రత్యేకమైన రీతిలో మరింత విస్తృతంగా ఆవిష్కరిస్తుంది. నా దృష్టిలో సాహిత్య ఆర్కైవ్‌లో ‘చీకటి రోజులు’కు ఉన్న ప్రత్యేక స్థానం ఇదే. ఈ నవల్లో ప్రతి వ్యక్తి కథకూ కేంద్రంలో న్యాయం అనే ఒక భావన, అలాగే సాధారణ ప్రజల ఆకాంక్షలకు జరిగిన ద్రోహంపై అంతర్లీనంగా రగులుతున్న ఆగ్రహం ఉన్నాయి. అసాధారణమైన వీరోచిత సంఘటనలకు, ‘తిరుగుబాటు’ సందర్భాలకూ మాత్రమే పరిమితం కాకుండా, వాటికి బయట ఆ ప్రమేయాలకు అతీతంగా ఎటువంటి ప్రత్యేకతలూ లేని అతి సాధారణ జీవితాలపై రాజ్యం అమలుజేసే అణచివేత ఎంత క్రూరంగా ఉంటుందో దాని యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ఈ రచన చూపిస్తుంది. విస్తృతమైన పాఠకలోకంతో పంచుకోవాల్సిన భావోద్వేగాలతో ముడిపడి, హృదయాన్ని తాకే కథ ఇందులో ఉన్నది అన్న నమ్మకం నన్ను ఈ అనువాదానికి పురిగొల్పింది. ఈ విషయంలో కూడా నా తండ్రే మార్గదర్శకుడు: ‘‘అంపశయ్య నవీన్ గారి ‘చీకటి రోజులు’ మనకు ఆ కాలానికి సంబంధించిన ఒక సజీవమైన, స్పష్టమైన చిత్రణను అందిస్తుంది’’ అని ఆయన అనేవారు.


‘స్పీకింగ్ టైగర్స్’ ఈ పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసింది?

నా ప్రచురణలకు ఎప్పుడూ ఏజెంట్స్ లేరు. నేను ప్రచురణకర్తకు నేరుగా నా ప్రతిపాదన/ మాన్యుస్క్రిప్ట్‌ పంపుతాను. స్పీకింగ్ టైగర్‌ వారు నేరుగా రచనలు అంగీకరిస్తారన్న విషయం నాకు నచ్చింది. కాబట్టి ఈసారి కూడా అదే చేశాను. రవి సింగ్ కొన్ని నెలల్లోనే చాలా సానుకూలంగా స్పందించారు. ఎడిటర్ ద్యుతి రాయ్ కూడా ఈ ప్రక్రియలో చాలా ఇన్వాల్వ్ అయి పనిచేశారు.

ఏ భారతీయ భాషలోనైనా ఎమర్జెన్సీ మీద వచ్చిన తొలి నవల ఇది. ఆ కాలాన్ని చీకటి రోజులుగా వర్ణించిన తొలి రచయిత కూడా నవీనే. తర్వాత ఆ మాట దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రాచుర్యం పొందింది. అంత ప్రసిద్ధి పొందిన టైటిల్‌ని మీరు ఎందుకు మార్చారు? మీ టైటిల్‌తో మొత్తం సమాజమంతా అనుభవించిన యాతనని ఒక వ్యక్తి వెతగా కుదించినట్లైంది కదా!

ఇది చర్చనీయాంశమే. మొదట్లో నేను ‘డార్క్ డేస్’ లేదా ‘డార్క్ టైమ్స్’ అనే శీర్షికలు అనుకున్నాను. అయితే, ‘సాక్షిగా నిలబడటం’ అనే చర్య ఈ నవలలో నన్ను బలంగా ఆకట్టుకున్న అంశం. రాజ్యం అమలుచేసే నిఘా గురించి, నిర్బంధం గురించి చదవడం మనకు అలవాటే; కానీ వాటికి సాక్షిగా నిలబడటంలో అలుముకునే వేదనాభరితమైన మూగ నిశ్శబ్దం గురించి మాత్రం అంతగా చదవం. నవలలో ప్రధాన పాత్ర ఎదుర్కొనే దుస్థితి అతనొక్కడిదే కాదు. అతను ఆ చీకటి కాలాన్ని మనందరికీ అర్థమయ్యేలా, చదవగలిగేలా భావితరాల కోసం మన ముందుంచుతున్నాడు. ‘‘జాగ్రత్త! అప్రమత్తంగా ఉండండి! ఎంత వ్యక్తిగత మూల్యం చెల్లించాల్సి వచ్చినా, తమకు సాధ్యమైన ఏ మార్గంలోనైనా సత్యాన్ని చెప్పే సాక్షులు ఉంటారు’’ అని చేసే ఒక హెచ్చరిక యిది. ఈ శీర్షిక విషయంలో నిర్ణయం తీసుకునే ముందు నవీన్ గారితో కూడా చర్చించాను. ఈ విషంలో అనువాదకురాలు తన పదాలను జాగ్రత్తగా తూకం వేసుకుని, తుది నిర్ణయం తీసుకోవాల్సిందే అని నేను భావిస్తున్నాను.

ఇవాళ ఈ నవల అనువాదానికి వున్న ప్రాసంగికత గురించి మీరేం అనుకుంటున్నారు?

ఒక విధంగా ‘చీకటి రోజులు’ నవల అనువాదాన్ని ప్రారంభించడమే చాలా కష్టంగా అనిపించింది. నాలుగేళ్ల కాలంలో ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాను; కొన్ని పేజీలు చదివి మళ్లీ పక్కన పెట్టేశాను. అయినా మళ్లీ మళ్లీ దాన్ని చేతిలోకి తీసుకుంటూనే ఉన్నాను. చదువుతూ ఉండగా కాలం నడక ఆగిపోయినట్టుగా అనిపించేది. అది నన్ను చాలా కలవరపరిచేది. కానీ మళ్లీ మళ్లీ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటూ ఉండగా, కాలానికి పడిన బ్రేకులు నిజానికి బ్రేకులు కావని అర్థమైంది. అది నిర్బంధ శిబిరంలో కాలాన్ని అనుభవించే ఒక ప్రత్యేకమైన భావన అనీ అక్కడి ‘జీవితం గతి’ అలా ఉందనీ అర్థమైంది.


నేను ఈ నవలకు పదే పదే దగ్గర కావడానికి మరో కారణం కూడా ఉంది. వాస్తవానికీ కల్పనకీ మధ్య గీత చాలా సన్నగా ఉంటుందని నాకు తెలుసు. నేను నా యవ్వనంలోనే దాన్ని చూశాను. హింసలు, అదృశ్యమవడాలు, అక్రమ అరెస్టులు నాకు కొత్తేమీ కాదు. అలాంటి జీవితాన్ని అనుభవించినవారినీ, దానిని ఎదిరించినవారినీ, దాని నుంచి దూరంగా వెళ్లిపోయినవారినీ నేనెరుగుదును.

భార్గవ కమిషన్ ముందు గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌కు సాక్ష్యమిచ్చిన హింసాబాధితుడు ఈ. భిక్షపతి, విచారణ జరుగుతున్న సమయంలో మా ఇంట్లో ఉన్నారు. ఆయన సమక్షంలోనే నలుగురిని కాల్చి చంపారు. మేము కౌమార దశలో ఉన్నప్పుడు, ఆయన సమక్షంలో కూర్చొని, ఆయన తాను చూసిన విషయాల గురించీ ప్రజల గురించి మాట్లాడుతుంటే విన్నాం. ఆ తర్వాత భిక్షపతిని నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయనను మాత్రం ఎన్నడూ మరచిపోలేదు. ఇప్పటికీ ఆయన నా జ్ఞాపకంలో ఎంతో స్పష్టంగా నిలిచి ఉన్నారు. ఆయన గొంతు, ఆయన రూపం, నిశ్శబ్దంగా నెమ్మదిగా ఇంట్లో అటూ ఇటూ తిరిగే ఆయన తీరు... అన్నీ నాకు గుర్తున్నాయి.

అందుకే ఈ నవల్లోని శ్రీనివాసరావు కథను ఇంగ్లీషులోకి మళ్లీ చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. అతను మనం సాధారణంగా ఊహించే నాయకుడేమీ కాదు. తన పిరికితనాన్నీ, భయాన్నీ తానే నిందించుకుంటాడు. అయినప్పటికీ, తాను చూసినదాని నుంచి ముఖం తిప్పుకోకుండా దాన్ని నమోదు చేస్తాడు. భయంతో, జ్వరంతో, వికారం కలుగుతున్నా, పట్టుదలగా సాక్షిగా కొనసాగుతాడు.

అనువాదం కొనసాగుతున్న కొద్దీ, ఈ నవలకు మన కాలంలో ఉన్న ప్రాసంగికత ఏమిటి? అన్న ప్రశ్న నన్ను వెంటాడుతూనే వుంది. గత పది సంవత్సరాలుగా నేను చేస్తున్న పనితో దీనికి సంబంధం ఉంది అనిపించింది. ఇవ్వాళ మనం ఒక మెజారిటేరియన్‌ ఆధిపత్యవాద పాలనలో జీవిస్తున్నాం. 1970ల మధ్యకాలం నాటి పరిస్థితులే పునరావృతమౌతున్నాయి. వాటికి వ్యతిరేకంగా కొత్త శక్తితో ప్రతిఘటన కూడా సాగుతోంది. అప్పట్లో నిఖిలేశ్వర్‌ గారు కోర్టులో చదివిన ‘భయం’ కవిత, ఈరోజు మన రాజకీయ సంభాషణలో మళ్లీ కేంద్రస్థానానికి వచ్చింది. జైళ్లలో ఉన్న చైతన్యవంతమైన ప్రతిఘటనకారుల గొంతుల్లో, దేశమంతటా వరుసగా వెల్లువెత్తుతున్న అనేక జంతర్‌ మంతర్‌ నిరసనల్లో ఆ కవిత మళ్లీ వినిపిస్తోంది. అందుకే ఫాసిస్టు హిందుత్వ పాలన సాగుతున్న ఈ కాలంలో ‘చీకటి రోజులు’ నవల మళ్లీ ప్రాసంగికతను సంతరించుకుంటోంది. జరుగుతోన్నదానికి మనం సాక్షులుగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తించి యాభై సంవత్సరాల క్రితమే రచయిత ఈ నవల రాశారు. అదే దాని ప్రత్యేకత.

ఇంటర్వ్యూ : ఎ.కె. ప్రభాకర్

భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని

Updated Date - Aug 31 , 2026 | 01:26 AM