ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య పాఠాలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:14 AM
న్యాయవిరుద్ధంగా జరుగుతోన్న ప్రజాస్వామిక ఎన్నికలను ఎందుకు బహిష్కరించకూడదు? ఈ ప్రశ్న గుసగుసలుగా వినిపిస్తోంది. దీనిపై బహిరంగ చర్చ జరగాలి. ఆ చర్చ ‘ఎన్నికలతో ఎందుకు ఇబ్బంది పడాలి?’ అన్న ప్రశ్నతో...
న్యాయవిరుద్ధంగా జరుగుతోన్న ప్రజాస్వామిక ఎన్నికలను ఎందుకు బహిష్కరించకూడదు? ఈ ప్రశ్న గుసగుసలుగా వినిపిస్తోంది. దీనిపై బహిరంగ చర్చ జరగాలి. ఆ చర్చ ‘ఎన్నికలతో ఎందుకు ఇబ్బంది పడాలి?’ అన్న ప్రశ్నతో ఆరంభమవ్వాలి. తులనాత్మక రాజకీయాలపై మౌలిక కృషికి ప్రసిద్ధుడైన పోలిష్–అమెరికన్ రాజనీతి శాస్త్రవేత్త ఆడమ్ ప్రెవోర్స్కీ ప్రజాస్వామిక ఎన్నికలను గట్టిగా సమర్థించారు. ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చిన నిర్వచనం సుప్రసిద్ధమయింది. ‘ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి, తొలగించడానికి వీలుండే ఒక వ్యవస్థ’ అని ప్రజాస్వామ్యాన్ని ఆయన నిర్వచించారు. సుపరిపాలన, న్యాయబద్ధమైన ప్రజా ప్రాతినిధ్యం, సామాజిక సామరస్యం ప్రజాస్వామ్యంతోనే సమకూరుతాయని మనం స్వతస్సిద్ధంగా విశ్వసిస్తాం. అయితే పోటీదాయక ఎన్నికలు ఈ గుణాత్మక పరిస్థితులకు దోహదం చేయకపోవచ్చని ప్రెవోర్స్కీ అంటారు. అయినప్పటికీ ఓటర్లను, నాయకులను, రాజకీయ పార్టీలను చికాకుపరిచే, ఇబ్బంది పెట్టే ప్రజాస్వామిక ఎన్నికలు విధిగా జరగాలని, అనేకానేక విభజనలు, అసమానతలతో సతమతమవుతున్న సమాజాలు అంతర్యుద్ధం దురవస్థల పాలవకుండా సామరస్య పూర్వకంగా మనుగడ సాధించేందుకు అవి విశేషంగా తోడ్పడుతాయని ఆయన నొక్కి చెప్పారు. అధికారంలో ఉన్నవారు పదవీ వైభవాన్ని కోల్పోయేందుకు అంగీకరిస్తారు, ఎన్నికలలో ఓడిపోయినవారు పరాజయాన్ని ఆమోదిస్తారు, అధికార మార్పిడి ఎన్నికల ద్వారా శాంతియుతంగా జరగడమే అందుకు కారణమని ప్రెవోర్స్కీ అన్నారు. 1977 చరిత్రాత్మక లోక్‌సభ ఎన్నికలలో సంభవించిన మార్పే అందుకు నిదర్శనం.
ఎన్నికల సమగ్రత (ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ) ఒక పరిమితికి మించి పతనం కానప్పుడే అధికార బదిలీ శాంతియుతంగా జరిగేందుకు ఆస్కారమున్నది. అయితే ఎన్నికల సమగ్రతను నిష్పాక్షికంగా నిర్ణయించే ప్రమాణాలు ఏమిటి? ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన 11 అంశాలపై పిప్పానోరిస్, రిచర్డ్ ఫ్రాంక్ ఫెర్రాన్ మార్టినెజ్ కోమా అనే రాజనీతి శాస్త్రవేత్తల విశ్లేషణ ఎన్నికల సమగ్రతను నిర్ధారించేందుకు తోడ్పడుతుంది. వాటిలో ఒకటి ప్రచార నిధులు. ఈ అంశం మన ఎన్నికలను ఎంతగా ప్రభావితం చేస్తుందో మరి చెప్పనవసరం లేదు. నిధుల లభ్యత విషయంలో పాలక ప్రతిపక్షాల మధ్య అసమానతలు ఎన్నికల సమగ్రతకు చేటు చేస్తున్నాయి. 2014 అనంతరం మరో మూడు అంశాల– తటస్థ ఎన్నికల అధికారులు, పారదర్శక ఎన్నికల నిర్వహణ పద్ధతులు, మీడియా కవరేజ్– లో మన ఎన్నికల సమగ్రత క్రమంగా ఆమోదయోగ్య స్థాయి నుంచి బాగా దిగజారిపోతోంది. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, డీలిమిటేషన్‌తో పాటు ప్రతిపక్షాలను నిలువునా చీల్చివేయడం మొదలైన చర్యలతో మన ఎన్నికల సమగ్రత మరింతగా భ్రష్టమవుతోంది. కోట్లాది వయోజనులకు ఓటు హక్కును నిరాకరించడం, పాలకపక్షం ప్రయోజనాలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చివేయడం ఎన్నికల సమగ్రతకు ఎలా తోడ్పడుతాయి?
భారత ప్రజాస్వామ్య ఎన్నికలు ఒకప్పుడు ఈ పురానవ భూమికి గర్వకారణంగా ఉండేవి. ఇరుగుపొరుగు దేశాలకు అసూయ పుట్టించేవి. సుదూర ప్రజాస్వామిక దేశాలకు అబ్బురం కలిగించేవి. అదంతా పాతకథ. ఇప్పుడు మన ఎన్నికల సమగ్రత కనీస ఆమోదయోగ్య స్థాయి నుంచి బాగా కిందకు జారిపోయింది. నిక్కచ్చిగా చెప్పాలంటే అధికారపక్షం తాను ఎన్నికలలో గెలిచితీరాలనుకుంటే గెలిచి తీరుతుంది. అలా గెలిచేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించుకోగలదు. ఈ కారణంగానే ప్రతిపక్ష నాయకులు మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. తుది ఫలితం ముందుగానే నిర్ణయించబడిన ప్రజాస్వామిక పోటీలో వారు పాల్గొని తీరవల్సిందేనా? ఇదొక మంచి ప్రశ్న. ప్రజాస్వామిక పోటీ నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవడం, పూర్తిస్థాయిలో ఎన్నికలను బహిష్కరించడం ఆ ప్రశ్నకు సరైన సమాధానం కాదు, కాబోదు. అటువంటి ప్రతిపాదనను మన ప్రతిపక్షాలు తిరస్కరించాలి. అందుకు మూడు సహేతుకమైన కారణాలు ఉన్నాయి.
మొదటిది ఒక నైతిక వాదన. పాలకపక్షం మోసపూరితంగా ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నప్పటికీ ప్రతి ఎన్నికలలోనూ పోటీ చేసి తీరాలన్న సరళమైన ప్రజాస్వామిక తర్కంకాదిది. ఎన్నికల ప్రచార నైతికతకు ప్రాధాన్యమిచ్చే వాదన అది. పార్టీల పరస్పర విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడకపోవడం, సమాజంలో శాంతి సామరస్యాలను కాపాడడం మొదలైనవి ఎన్నికల ప్రచారంలో విధిగా అనుసరించాల్సిన కనీస నియమాలు. ప్రజాస్వామిక నిబద్ధత ఆ నైతిక పద్ధతులను అనుసరించాల్సిన ఆవశ్యకతను నిర్దేశిస్తుంది. ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నారని ప్రతిపక్షాలు విశ్వసిస్తుంటే ఆ వాస్తవాన్ని ప్రజలూ పూర్తిగా నమ్మేలా చేయడం వాటి విధ్యుక్త ధర్మం. గత సార్వత్రక ఎన్నికలలోను, ఆ తరువాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోను ‘ఓట్ చోరీ’ జరిగిందని కాంగ్రెస్ పార్టీ నెత్తీ నోరు కొట్టుకుని ఆందోళన చేస్తోంది. కాంగ్రెస్ వాదనలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంతమాత్రాన సామాన్య ఓటర్లు ఆ ‘ఓట్ చోరీ’ అభియోగాన్ని ఆమోదిస్తున్నారనే నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ఎటూ పాలకులకే అనుకూలంగా వ్యవహరించే జన మాధ్యమాల తీరుతెన్నుల మూలంగా ఎన్నికలలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై ప్రజల అవగాహన అరకొరగా మాత్రమే ఉంటోంది. ఈ పరిస్థితి నిరుత్సాహం కలిగిస్తున్నప్పటికీ ఓటర్లు స్వయంగా ఎన్నికల్లో నిష్పాక్షికత, పారదర్శకతను డిమాండ్ చేసే పరిణత స్థాయికి ప్రజాభిప్రాయాన్ని నిర్మించడం ప్రతిపక్షాల బాధ్యత. విపక్షాలకు ప్రజాస్వామిక నైతికత నిర్దేశిస్తున్న కర్తవ్యమది.
రెండో వాదన వ్యూహాత్మకమైనది.. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు న్యాయవిరుద్ధంగా ఉన్నప్పటికీ ఆ ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనడమే వివేకవంతమవుతుంది. ఎన్నికలను బహిష్కరించడం బాధ్యతాయుతమైన చర్య కాబోదు. ప్రపంచ దేశాల అనుభవం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎన్నికల బహిష్కరణ అనేది పోలింగ్‌లో పాల్గొనే ఓటర్ల సంఖ్యను అత్యధిక స్థాయిలో తగ్గించి తీరాలి. లేని పక్షంలో నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ఉద్దేశించిన బహిష్కరణ వ్యూహం నిష్ఫలమవుతుంది. అంతేకాదు, ప్రజలు తమను ఆమోదించరనే భయ సంకోచాలతోనే ప్రతిపక్షాలు ఎన్నికలలో పాల్గొనడం లేదని పాలకులు ఆరోపించేందుకు ఆ వ్యర్థ వ్యూహం ఆస్కారమిస్తుంది. చెప్పవచ్చినదేమిటంటే ఎన్నికలలో పాల్గొనడమనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అనేక అవకాశాలను కల్పిస్తుంది. విపక్షాలు ఎట్టి పరిస్థితులలోను వాటిని జారవిడుచుకోకూడదు. తమ పాలన చట్టబద్ధమైనదని ప్రపంచానికి చెప్పుకోవడానికై నిరంకుశ పాలకులు ప్రతిపక్షాల పట్ల ఔదార్యం చూపడం కద్దు. ఎన్నికలలో పాల్గొనేలా విపక్షాలను పురిగొల్పుతారు, చెప్పుకోదగ్గ విజయాలు వాటికి లభించేట్టు కూడా జాగ్రత్త వహిస్తారు! ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ ఎన్నికలలో పాల్గొనడమనేది కార్యకర్తలను సమీకరించేందుకు, నిధులు సమకూర్చుకునేందుకు, పార్టీని కాపాడుకుని, మద్దతుదారుల నుంచి భావి నాయకులను రూపొందించేందుకు విపక్షాలకు విశేషంగా తోడ్పడుతుంది. విపక్షాలు ఎన్నికలలో పాల్గొనడం ద్వారా ఎన్నికల అక్రమాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించి వారిలో ప్రజాస్వామిక చైతన్యాన్ని పెంపొందించే అవకాశం విపక్షాలకు లభిస్తుంది. స్వేచ్ఛగా సక్రమంగా జరగవనే కారణంతో ఎన్నికలలో పాల్గొనకపోవడమనేది వివేకవంతమైన చర్య కాదు, కాబోదు.
చాలా కాలంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, తూర్పు యూరోపియన్ దేశాలకు మన ప్రజాస్వామ్యాన్ని ఒక ఆదర్శ నమూనాగా చూపుతున్నాం. అయితే వాటి నుంచి మనమూ విజ్ఞతాయుతమైన ప్రజాస్వామిక పాఠాలు నేర్చుకోవల్సిన సమయమాసన్నమయింది. న్యాయవిరుద్ధ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయాలో అలీనా బటూరా (2020లో బెలారస్ అధ్యక్ష ఎన్నికలను అధ్యయనం చేసిన మానవ హక్కుల పరిశోధకురాలు) స్పష్టంగా చెప్పారు. ఎన్నికలలో పాల్గొన్న బెలారస్ ప్రతిపక్షాలు తమ నిరంకుశ పాలకుడిని అధికారం నుంచి తొలగించలేకపోయినప్పటికీ ఎన్నికలలో ప్రభుత్వం పాల్పడిన అక్రమాలపై ప్రజలకు అవగాహన కలిగించాయి. దేశ పౌరులలో ప్రజాస్వామిక చైతన్యాన్ని పెంపొందించాయి. మరీ ముఖ్యంగా స్వదేశంలోనూ అంతర్జాతీయ సమాజంలోనూ తమ పాలకుడి చట్టబద్ధతను ప్రశ్నార్థకం చేశాయి.. ఎన్నికల వంటి ప్రజాస్వామిక ప్రక్రియలో అన్యాయం ఎంత ఎక్కువగా ఉందనే దానికంటే ఆ అన్యాయాన్ని అందరికీ తెలిసేలా బహిర్గతం చేసేందుకు అవకాశం ఉన్నదా లేదా అనేది చూడడం ముఖ్యం. ఎన్నికల బహిష్కరణ విషయమై నిర్ణయం తీసుకోవడంలో మన ప్రతిపక్షాలు ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు.
ఇక చివరగా ఒక చారిత్రక వాదనను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అడ్డూ అదుపూ లేని నియంతలు సైతం తమ పాలనను ప్రజలు అంగీకరిస్తున్నారని చెప్పుకునేందుకు శతథా ప్రయత్నిస్తారు. ప్రజా ఉద్యమాల ఉధృతి నుంచి తమను తాము కాపాడుకోవడమనేది నియంతృత్వ పాలకులకు మరీ ముఖ్యం. ఇది 21వ శతాబ్దం కదా. ప్రజాస్వామ్యం గురించి మొక్కుబడి మాటలు ఇంకెంత మాత్రం సరిపోవు. ప్రదర్శనాత్మక ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఇంకెంత మాత్రం విశ్వసించరు. ఇప్పుడు మన దేశంలో ఎన్నికల సమగ్రత మున్నెన్నడూ లేనంతగా తక్కువ స్థాయిలో ఉన్నది. ఈ శోచనీయ పరిస్థితి వల్ల, పాలకుల అధికార భద్రతకు ముప్పు వాటిల్లదు. అయితే సమీప భవిష్యత్తులోనే అగ్నిపర్వతంలా బద్ధలయ్యే ప్రజాగ్రహం నుంచి పాలకులను అది కాపాడలేదు. ఇది తథ్యం. ఇటీవల హంగరీ ఎన్నికలలో జరిగింది ఇదే కాదూ?. 1977లో ఇందిరాగాంధీ అనూహ్య అపజయం చాటిన సత్యం కూడా అదే కదా. ఈ క్షణాన అసంభవంగా కనిపిస్తున్న ఈ తిరుగులేని వాస్తవం మన ప్రస్తుత పాలకుల విషయంలోనూ సంభవించే అవకాశాన్ని కొట్టివేయలేము.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్