Share News

స్వతంత్ర వ్యవస్థలు లేని స్వాతంత్ర్యానికి అర్థముందా?

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:17 AM

‘రాజ్యాంగంలో అత్యున్నత పదవిని నిర్వర్తిస్తున్న ప్రధానమంత్రి ఒక పవిత్రమైన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు, అలాంటి వారి నిర్ణయాలకు దురుద్దేశాలను ఆపాదించవచ్చా?’ అంటూ భారతదేశ సోలిసిటర్ జనరల్...

స్వతంత్ర వ్యవస్థలు లేని స్వాతంత్ర్యానికి అర్థముందా?

‘రాజ్యాంగంలో అత్యున్నత పదవిని నిర్వర్తిస్తున్న ప్రధానమంత్రి ఒక పవిత్రమైన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు, అలాంటి వారి నిర్ణయాలకు దురుద్దేశాలను ఆపాదించవచ్చా?’ అంటూ భారతదేశ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా వాదించారు. దీనికి నేపథ్యం ఏమిటంటే– భారత ప్రధాన ఎన్నికల అధికారిని, ఇతర ఎన్నికల అధికారులను నియమించే హైపర్ కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండేవారు. ఈ విధానానికి స్వస్తిపలికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఒక క్యాబినెట్ మినిస్టర్‌ను నియమించుకునేలా భారత పార్లమెంటు 2023లో చట్టాన్ని చేసింది. ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని హైపవర్ కమిటీ నుంచి తొలగించవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది, అలా చేయడం వల్ల ఏకపక్ష నిర్ణయాలకు అవకాశాలు పెరిగినట్లు కాదా...’ అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ప్రధానమంత్రి నిర్ణయాలకు దురుద్దేశాలు ఆపాదించవచ్చా’ అన్న వ్యాఖ్యను సొలిసిటర్ జనరల్ ఈ సందర్భంగానే చేసారు.

సొలిసిటర్ జనరల్ లాంటి వ్యక్తులకు కూడా శాస్త్రీయ అవగాహన లోపించడం చాలా విచారకరం. పరిపాలన నియమ నిబంధనల బట్టి సాగుతుందా లేక అధికారాన్ని చేపట్టిన వ్యక్తులపై ఉండే నమ్మకాన్ని బట్టి జరుగుతుందా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సెలెక్షన్ కమిటీ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించకుండా ప్రధానమంత్రి వ్యక్తిత్వాన్ని ప్రస్తావించడం ఒక వింత. అంతటితో ఆగక ‘కేంద్ర క్యాబినెట్‌లో ఎవరెవరు మంత్రులుగా ఉండాలో నిర్ణయించేటప్పుడు కూడా ఒక న్యాయమూర్తిని లేదా రిటైర్డ్ జడ్జిని ప్రధానమంత్రి సంప్రదించాలా’ అంటూ తుషార్ మెహతా అసందర్భ వ్యాఖ్యలు చేశారు.

మెహతా పరిభాషలో, ప్రధానమంత్రిని పూర్తిగా విశ్వసించేటట్లయితే పార్లమెంటు వ్యవస్థ అవసరం లేదు, పార్లమెంటులో బిల్లులపై చర్చ అవసరమే లేదు. ప్రధానమంత్రి నోటి మాటనే శాసనంగా రాసుకోవచ్చు. మంత్రులు, న్యాయవ్యవస్థ కూడా అక్కర్లేదు. అందరూ ప్రధానమంత్రి ఆదేశాలను అమలుపరిస్తే సరిపోతుంది. వెరసి, ఇలాంటి వ్యవస్థ రాచరిక పరిపాలనను స్థిరపరుస్తుంది.


భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నడవకపోతే దేశ ప్రజాస్వామ్యం ఒక బూటకమే. ఎన్నికల వ్యవస్థను శాసించే ప్రధాన అధికారిని, ఎన్నికల అధికారులను ఏకపక్షంగా నిర్ణయించినప్పుడు అది దాని ఉనికి కోల్పోయినట్లే. ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు కలిసి తీసుకునే నిర్ణయాలలో నిష్పక్షపాతం సాధ్యమవుతుందా? ప్రతిపక్ష నాయకుడి మాట అరణ్యరోదనగా మిగిలిపోదా? ఇలాంటి వ్యవస్థను పార్లమెంటు చట్టం ద్వారా సృష్టించడం ఘోరమైన తప్పిదం! ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తే సుప్రీంకోర్టులో ఎద్దేవా చేసే విధంగా సొలిసిటర్ జనరల్ మాట్లాడటం గర్హనీయం.

భారత ప్రజల అదృష్టవశాత్తు ఎన్నికల బాండ్ల వ్యవస్థను సుప్రీంకోర్టు 2024లో రద్దు చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతి అధికారికంగా రహస్యమైపోయింది. నిస్సిగ్గుగా సదరు వ్యవస్థను సమర్థించుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ సుప్రీంకోర్టు ఏ మాత్రం వెరవకుండా ఆ వ్యవస్థను రద్దుచేసి, ఇక నుంచి ఎన్నికల బాండ్లను విడుదల చేయవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ప్రైమ్‌మినిస్టర్ కేర్స్ (పీఎం కేర్స్‌) అనే అత్యవసర నిధుల విధానం అమల్లో ఉన్నది. దాని ద్వారా ఖర్చు పెట్టే విధానం మొత్తం పూర్తిగా గోప్యంగా సాగుతున్నది. స్వతంత్ర వ్యవస్థలో రహస్యానికి తావుండకూడదు. అలాంటప్పుడు పీఎం కేర్స్‌ నిధుల వినియోగం వ్యవహారం కూడా ప్రజా బాహుళ్యంలో అందుబాటులో ఉండాలి.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి వ్యవస్థ పంజరంలో చిలుక మాదిరిగా ప్రభుత్వ పెద్దలు చెప్పిందే పలుకుతుందని ఎప్పటి నుంచో ఆరోపణ ఉండనే ఉంది. దానికి తోడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) వంటి వ్యవస్థలు కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులపై, ప్రభుత్వానికి మింగుడుపడని వ్యక్తులపై విరుచుకుపడి ప్రభుత్వానికి లొంగిపోయే వరకు వేటాడుతున్న సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


శాసన నిర్మాణానికి ఆనవాలుగా ఉన్న భారత పార్లమెంట్‌లో ఏ మాత్రం సుహృద్భావ వాతావరణం లేదు. దీనికి ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా ఎలాగూ మా మాట వినరు కాబట్టి మేము ఎందుకు సహకరించాలి అన్నట్టు పార్లమెంటులో రభస చేయటమూ అంగీకారం కాదు. ఇదే అదనుగా ప్రభుత్వం కూడా అనుకున్న విధంగా చట్టాలను రూపొందిస్తూ పోతున్నది. న్యాయస్థానాలలో వాదోపవాదాలు జరుగుతున్నా, పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది. కొత్త న్యాయ సూత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా స్వదేశంలోనే ఎలాంటి న్యాయవిచారణ లేకుండా ఎంతకాలమైనా సరే పౌరులను జైలులో పెట్టే విచక్షణాధికారాలు ఏర్పరచుకున్నారు. నాలుగవ ఎస్టేట్‌గా పిలువబడే మీడియాను కేంద్రం ఏ మాత్రం విశ్వసించడం లేదన్న సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చారు. ప్రధానమంత్రి మధ్యవర్తుల ద్వారా సమాచారాన్ని ఇవ్వరు, నేరుగా ప్రజలతోనే సంప్రదింపులు చేస్తారు అంటూ సరాసరి ఐఎఫ్ఎస్ ఆఫీసర్లతో చెప్పించారు. అందుచేతనే కాబోలు ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ మాత్రమే నిర్వర్తిస్తూ ఈ మధ్యలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ జంతర్‌ మంతర్ నిరసనలపై సెల్ఫీ వీడియోని ప్రచారం చేశారు కానీ, మీడియా ముందు తమ అభిప్రాయాలను పంచుకోలేదు. ఈ విధంగా ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థలు తమ స్వతంత్రతను కోల్పోయినప్పుడు భారత ప్రజాస్వామ్యంతో పాటు 80 ఏళ్ల స్వాతంత్ర్యమూ ప్రమాదంలో పడ్డట్లే.

జి. తిరుపతయ్య

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 01:17 AM