ఎన్నికల ఘర్షణల్లో బహుజనులే బలి..!
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:39 AM
‘సమర సింహారెడ్డి గారు... చల్లం గుండాలి, మీరు హాయిగ ఉండాలి. భరత సింహారెడ్డి గారు... మీరు బాంబులివ్వాలి. మేము బాంబు లేయాలి. మీ చేతిలోని కత్తులం. మీ కాలి కింది చెప్పులం. మీరు ఉస్కో, ఉస్కో, ఉస్కో అంటే...
‘సమర సింహారెడ్డి గారు... చల్లం గుండాలి, మీరు హాయిగ ఉండాలి. భరత సింహారెడ్డి గారు... మీరు బాంబులివ్వాలి. మేము బాంబు లేయాలి. మీ చేతిలోని కత్తులం. మీ కాలి కింది చెప్పులం. మీరు ఉస్కో, ఉస్కో, ఉస్కో అంటే ఉరికే వేట కుక్కలం’. ఇది ప్రముఖ కవి, రచయిత గోరేటి వెంకన్న మూడు దశాబ్దాల క్రితం రాయలసీమ ఫ్యాక్షన్ ముఖచిత్రంపై రాసిన పాట. పాట సారాంశం అంతా కరుడుగట్టిన వర్గ రాజకీయాల కోసం, ఆధిపత్య కులాల బలాబలాల బరిలో తెగిపడ్డ తలల గూర్చి, కరిగిపోయిన నల్ల పూసల పుస్తెల గురించే. రాయలసీమ ఫ్యాక్షనిజానికి సామాజిక, ఆర్థిక, చారిత్రక, రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి అని చరిత్రకారులు విశ్లేషిస్తారు. ఫ్యాక్షనిజాన్ని.. పాలెగాళ్ల వ్యవస్థకు ప్రతిరూపంగా వర్ణిస్తారు.
తొలుత విజయనగర రాజులే పన్నుల వసూళ్లు, శాంతిభద్రతలను కాపాడేందుకు పాలెగాళ్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాజు చెప్పిన పని చేయటమే వారి విధి. దీంతో పాటు నీటి లభ్యత లేకపోవడం, కరవు పరిస్థితులు, నిరక్షరాస్యత, ఉపాధి లేకపోవడం వంటివి కూడా ఫ్యాక్షన్ పుట్టుకకు కారణాలు. తరువాత బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో పాలెగాళ్లు సొంత సైన్యం కలిగివుండి, అధికారం చెలాయించేవాళ్లు. కొందరు బ్రిటిష్ ప్రభుత్వానికి దాసోహం కాగా, ఇంకొందరు స్వాతంత్ర్యం కోసం ఎదురు తిరిగారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది ఎదురొడ్డిన చరిత్రే. అలాంటి పాలెగాళ్ల సంస్కృతే తరువాత రాజకీయ రూపం ధరించింది.
ఏళ్ళు గడిచినా, ఇప్పటికీ రాయలసీమ ముఖచిత్రంలో ఫ్యాక్షనిజం పూర్తిగా పోలేదు. దాని నకళ్ళు, అడుగుజాడలు కొన్ని ప్రాంతాల్లో జడలు విప్పుతూనే ఉన్నాయి. అయితే నాటి పెత్తందారులు వ్యక్తిగత కక్షలు, గ్రామాల్లో ఆధిపత్యాలు, పంతాల కోసం బడుగులను, బలహీనులను చేరదీసి, పెంచి పోషించేవారు. కర్రలు, కత్తులు, బాంబులు ఇచ్చి తిప్పేవారు. ప్రత్యర్థులపై ప్రతీకారానికి కాలు దువ్వి పంపేవారు. 1970–80 లలో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఫ్యాక్షన్ వ్యతిరేక ఉద్యమాలు జరిగేవి. పోరాట కమిటీలు పెట్టేవారు. అయితే మారుతున్న ఆధునిక సమాజంలో విద్య, ఉపాధి అవకాశాలు, టెక్నాలజీ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో నాటి ఫ్యాక్షన్ కక్షలు చాలా మేరకు తగ్గాయి. చట్టాలు, పోలీసు వ్యవస్థ బలోపేతం కూడా ఈ కక్షలు తగ్గేందుకు తోడ్పడ్డాయి. ఇప్పటికీ కొందరు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య ముసుగులో అదే ఫ్యాక్షన్ పాత్రను పోషిస్తున్నారు. అవసరాల కోసం, రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం కోసం, ఎన్నికల్లో అల్లర్లు, హింస కోసం అనుచరులను వాడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలలో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్తతలు చూస్తుంటే, పెత్తందారీ వర్గం పట్టు కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో కడిమెట్ల, ఎర్రకోట, రాళ్ళదొడ్డి, సిరాలదొడ్డి, గువ్వల దొడ్డి గ్రామాలలో నాలుగు దశాబ్దాలుగా సంస్థాగత ఎన్నికలన్నీ ఏకగ్రీవాలే. ఎలాంటి పోటీ ఉండదు. అంటే ఆ ప్రాంత రాజకీయ పెత్తందారీ కనుసన్నలలోనే ఎన్నికల బొంగరం తిరుగుతుందని అర్థం. తాజాగా పుంగనూరు, రాయచోటి, పులివెందుల, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు ఈ కోవలోకే వస్తాయి. అయితే ఈ ఘర్షణల్లో బలిపశువులు మాత్రం బహుజనులే. కింది కులాల అమాయకత్వం, నిరక్షరాస్యత, ఆర్థిక అవసరాలు వంటి ఎన్నో బలహీనతలను ఆసరా చేసుకుని ఇలాంటి దుందుడుకు చర్యలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు చట్టాలు, పోలీసు వ్యవస్థ ప్రేక్షకపాత్ర పోషించేందుకు సిద్ధంగా లేదు. చట్టానికి చేతులు బారు అన్నట్లు నేరాలకు పాల్పడినవారు మూల్యం చెల్లించక తప్పదు. ఈ సందర్భంగా ఘర్షణ వైఖరిలో లభించే ప్రతిఫలానికి ఒక్కటే కొండ గుర్తు. ఏ సంఘటనలోనైనా పెద్ద తలలకు దెబ్బలు తగలవు. అనుచరులకే దెబ్బలన్నీ. ఎద్దుల కుమ్ములాటల్లో లేగదూడ కాళ్ళు విరిగినట్లు... కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా పల్లకీ మోసే బోయిలవి మాత్రమే. కాబట్టి బహుజనులు అప్రమత్తంగా ఉండాలి. నాయకుని ప్రేమించటం అంటే కుటుంబ సభ్యులను జైళ్లకు పంపటం కాదని తెలుసుకోవాలి. ఇది ఎన్నికల ప్రక్రియకు మాత్రమే వర్తించదు. అడుగడుగునా జీవిత సమరంలో బహుజనులు బహుపరాక్‌గా ఉండక తప్పదు.
పోతుల బాలకోటయ్య
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు