Share News

ఎల్‌నినో ఉపద్రవాన్ని ఇలా ఎదుర్కొందాం

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:45 AM

రానున్న ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరమేకాక వచ్చే సంవత్సరం కూడా దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్నాయని, ప్రజలేకాక జంతుజాలం కూడా తీవ్ర క్షామ పరిస్థితులను ఎదుర్కోవలసి...

ఎల్‌నినో ఉపద్రవాన్ని ఇలా ఎదుర్కొందాం

రానున్న ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరమేకాక వచ్చే సంవత్సరం కూడా దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్నాయని, ప్రజలేకాక జంతుజాలం కూడా తీవ్ర క్షామ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని పర్యావరణ శాస్ర్తజ్ఞులు చేస్తున్న హెచ్చరికలు మనం కొంతకాలంగా వింటున్నాం, స్వయంగా అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పటికే బావులు, చెరువులు, కాల్వలు, నదులు కూడా ఎండిపోయి నేల పగుళ్లను ప్రదర్శిస్తున్నది. భూగర్భ జల మట్టాలు కూడా రోజురోజుకూ పాతాళానికి పడిపోతున్నాయి.

వర్షాభావం వల్ల పశువులకు తాగునీటి కొరత ఏర్పడితే వాటి పాడి ఉత్పాదకత, పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. నీటి కొరత వల్ల పాడి పశువుల్ని, వాటి పాకల్ని సరిగా శుభ్రం చేయకపోతే అంటురోగాలు ప్రబలి పశువులకు తీవ్ర అసౌకర్యాన్ని, ప్రాణహాని కూడా కలగవచ్చు. ఇక వన్యప్రాణుల పరిస్థితి మరీ దారుణంగా ఉండవచ్చు. ప్రస్తుతం కూడా దాహార్తితో ఏనుగులు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాలలోకి ప్రవేశించి, పంటలకు, పశువులకు, ఆస్తులకేగాక ప్రజల ప్రాణాలకు కూడా తీవ్రహాని కలిగిస్తున్నాయి. లేదా ప్రజల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి.

క్షామాన్ని తగ్గించేందుకు అనేక మార్గాలున్నాయి. ప్రతి పాఠశాలలో, కాలేజీలో విద్యార్థులకు ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే నీటికొరత సమస్యను వివరించాలి. విందులు, వేడుకల వంటి కార్యక్రమాలలో నీటి వినియోగాన్ని తగ్గించే మార్గాలను నిర్దేశించాలి. గత వేసవిలో కర్ణాటక ప్రభుత్వం– శుభ్రపరచడానికి ఎక్కువ నీరు అవసరమయ్యే ప్లేట్లు, సాసర్లు, కప్పుల వాడకాన్ని విందులలో నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా విస్తళ్లు, లేదా ఇతర డిస్పోజబుల్స్‌ను వాడవలసిందిగా ప్రజలకు సూచించింది. అవసరమైతే మన తెలుగు రాష్ట్రాలలో కూడా దుర్భిక్ష రోజుల్లోనైనా ఇలాంటి విధానాలు అమలు చేయడం శ్రేయస్కరం. ఇళ్లలో వాటర్‌ ప్యూరిఫయ్యర్ల నుంచి విడుదలయ్యే నీటిని గృహ సంబంధిత అవసరాలకు వాడుకోవాలి. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో నీటి వృథాను అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలి. ప్రజా సదస్సులు, కరపత్రాలు, వాల్‌ పోస్టర్లు, టీవీ కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాల ద్వారా ప్రజలను ప్రభుత్వం చైతన్యపరచాలి. ఎక్కువ సాగునీరు అవసరమయ్యే వరి వంటి పైర్ల సాగును తగ్గించి, చిరు ధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహించాలి.

కొర్రలు, రాగులు, అరికెలు, ఊదలు, సామలు, జొన్నల వంటి గింజధాన్యాల వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. పూల తోటలు, పండ్ల తోటల సాగు సమయంలో నీరు వాతావరణంలోకి ఆవిరైపోకుండా వీలైన ప్రతిచోటా ప్లాస్టిక్‌ షీట్లతో మడులను కప్పి ఉంచి, నేలలో తేమను కాపాడాలి.


నీరు, మేత వనరులు ఉన్నచోట పశుశాలలను ప్రభుత్వాలే నిర్వహించి రైతులను ఆదుకోవాలి. అరటి ఆకుల వ్యర్థాలు, అరటి కాండాలు, మారేడు, నేరేడు, మామిడి, రావి, మర్రి, సుబాబుల్ ఆకులనేకాక, జలవనరులలో కలుపుగా పెరిగే గుర్రపుడెక్కను కూడా పరిమితంగా పశువుల మేతకు ఉపయోగించవచ్చు. అవసరమైతే ఎండు మేత, సైలేజ్‌(మాగుడుగడ్డి)ని ఇతర రాష్ట్రాలు, పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారానైనా మన పశుసంపదను, తద్వారా పాడిపరిశ్రమను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు, సహకార సంఘాలు తీసుకోవాలి.

సాగునీటి కాల్వలు, పంట కాల్వల నుంచి నీరు దిగువకు వేగంగానూ, వృథాగానూ తరలిపోకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తే పశువులకేకాక వన్య ప్రాణులకు కూడా తాగునీరు లభిస్తుంది. కొత్తగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడంతోపాటు పాత గుంతలను కూడా పునరుద్ధరించాలి. పారిశ్రామిక వ్యర్థాలు, నగర వ్యర్థాలు జలవనరులను కలుషితం చేయకుండా కఠినమైన నియంత్రణ చర్యల్ని ప్రభుత్వాలు అమలు చేయాలి. జనావాసాల వ్యర్థ జలాలను శుద్ధిచేసి పంటలకు, తోటలకు, పశువులు తాగటానికి యోగ్యకరంగా మార్చే వ్యవస్థలను ప్రోత్సహించాలి. అవసరమైతే రైల్వే ట్యాంకర్లు, రోడ్డు ట్యాంకర్లతో ఇతర ప్రాంతాల నుంచి శుభ్రమైన నీటిని క్షామపీడిత ప్రాంతాలకు తరలించి ప్రజలకు, పశువులకే కాక వన్యప్రాణుల దాహార్తిని కూడా తీర్చే కృషి జరగాలి. వన్యమృగాలకు నీటి ఆవాసాలలో నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలి.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనావృష్టి, అతివృష్టి, అకాల వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా ఇటీవల కొన్ని నెలలుగా విపరీతంగా పెరిగింది. ఈ ఉపద్రవాల వల్ల కలిగే నష్టాలను కొంతవరకైనా భర్తీ చేసుకోవడానికి ప్రజలందరూ తమ జీవితాలకే కాక, పశువులకు, పంటలకు, ఆస్తులకు కూడా బీమా చేయించుకోవాలి. ఇందుకు ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని కొంత వరకైనా భరోసా పొందాలి.

డా. ఎంవీజీ అహోబలరావు

ఈ వార్తలనూ చదవండి:

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

Updated Date - Jul 10 , 2026 | 12:45 AM