Share News

ఏరోజుకారోజు

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:59 AM

అవతలి ఒడ్డుకెళ్ళడానికి చేతిలో చిల్లిగవ్వ లేక బతుకు నావ ముందు తలొంచుకు నిలబడిపోయిన దిక్కుమాలిన రోజుని...

ఏరోజుకారోజు

అవతలి ఒడ్డుకెళ్ళడానికి

చేతిలో చిల్లిగవ్వ లేక

బతుకు నావ ముందు

తలొంచుకు నిలబడిపోయిన

దిక్కుమాలిన రోజుని

ఏదోలా రేవు దాటించడానికి

పగటివేషంగట్టే పనిలో భాగంగా

పాచి మొహంతోనే

నా శరీరాన్ని నేను

కొత్తగా తొడుక్కుంటాను

పనిలేని హృదయాన్ని

తలగడ కింద వదిలేసి

ముఖానికి మాత్రం

అవసరాన్నిబట్టి

ఆడబోయే నాటకాన్నిబట్టి

రంగు పులుముకుంటాను

రాత్రయ్యాక

రంగు కడిగేసుకున్న

నా సొంత ముఖాన్ని

చీకటి అద్దంలో

తృప్తిగా తడుముకుంటాను

నిజం తప్ప మిగిలినవన్నీ

పళ్లికిలిస్తూ ఒట్టి గత్తరలా

చేతికి తగులుతుంటాయి

మాసిపోయిన బట్టలిప్పేసి

దండెం మీదికి విసిరేసినట్టు

మైల పనులతో అలసిపోయిన

శరీరాన్ని తీసి పక్కకిసిరేశాక

ఏదో మూలన

అనాథ శవంలా నా శరీరం

ఆ పక్కనే

మూతికి గుడ్డ కట్టిన

చిన్న రాగి పాత్రలాంటి

కుక్కిమంచంలో

మూడు గుప్పిళ్ళ మట్టుకు

నిస్తేజంగా నా అస్థికలు.

మిరప మహేష్

99480 39026

ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 12:59 AM