Share News

ఈసీఐ నేరం ఒప్పుకొన్నా న్యాయం జరిగేనా?

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:14 AM

ఓటర్‌ మహాశయులకు, ముఖ్యంగా ఓటర్‌ జాబితాల నుంచి పేర్ల తొలగింపు బాధితులకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దీపావళి కానుక నొకదాన్ని ఇచ్చింది. పండుగకు రెండు రోజుల ముందు జారీ చేసిన...

ఈసీఐ నేరం ఒప్పుకొన్నా న్యాయం జరిగేనా?

ఓటర్‌ మహాశయులకు, ముఖ్యంగా ఓటర్‌ జాబితాల నుంచి పేర్ల తొలగింపు బాధితులకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దీపావళి కానుక నొకదాన్ని ఇచ్చింది. పండుగకు రెండు రోజుల ముందు జారీ చేసిన ఆదేశంలో– సర్‌ ప్రక్రియ అమలు ఇంకా అధికారికంగా పూర్తికాని ఏడు రాష్ట్రాలలోని ఓటర్లకు రాయితీలు కల్పించింది. తద్వారా సర్‌ వ్యతిరేక ఉద్యమకారులు చేస్తున్న విధానపరమైన డిమాండ్లలో చాలావాటిని ఈసీఐ అంగీకరించింది. సమస్యేమిటంటే ఓటర్‌ జాబితాల నుంచి పేర్ల తొలగింపునకు గురైన ఓటర్లలో కొద్దిమందికి మినహా అందరికీ దీపావళి డిస్కౌంట్‌ వోచర్‌ గడువు ముగిసిపోయింది. నిజం చెప్పాలంటే ఈసీఐ ఆదేశం తన నేరాన్ని అంగీకరించడమే. సర్‌ పేరిట ఓటర్‌ జాబితాల నుంచి కోట్లాది ఓటర్ల పేర్లను న్యాయవిరుద్ధంగా తొలగించడమే ఆ అపరాధం. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు బహిర్గతమవడం దరిమిలా విధానపరమైన అవకతవకల విషయమై ఈసీఐ వైఖరిలో మార్పు చోటుచేసుకున్నది.

ఏడు రాష్ట్రాల– ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, తెలంగాణ, నాగాలాండ్‌– ఎన్నికల ప్రధానాధికారులకు ఈ నెల 6న భారత ఎన్నికల సంఘం రాసిన లేఖ సర్‌ విషయంలో ఆ రాజ్యాంగ సంస్థ బహిరంగంగా తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవడంలో ఒక అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఆ ఏడు రాష్ట్రాల ముసాయిదా సర్‌ ఓటర్‌ జాబితాల నుంచి పేర్లు తొలగించిన 4.52 కోట్ల మంది ఓటర్లకు అనేక ఉపశమనాలను కల్పించింది. అఖిల భారత స్థాయిలో ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌, డూప్లికేట్‌’ కారణాలతో మొత్తం 13.3 కోట్ల మంది పేర్లను తొలగించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తావిత ఏడు రాష్ట్రాలలో ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించేందుకు నిర్దేశించిన గడువును కూడా రద్దు చేశారు. గడువులోగా ఆ ఫారాలను సమర్పించలేకపోయినవారు ఇప్పటికీ వాటిని సమర్పించే వెసులుబాటు ఉన్నది. నివాసం మారినవారు ఫారం–6 సమర్పించడంలో ఉన్న ప్రయాసలకు లోనుకావలిసిన అవసరం లేదు. తమ కొత్త చిరునామా వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి. అలాగే మురికివాడల తొలగింపు వంటి కారణాల వల్ల ఇళ్లు కోల్పోయినవారూ ధ్రువపత్రాల కోసం అధి కారుల చుట్టూ తిరగడం వంటి ప్రయాస పడనవసరం లేదు. బీఎల్‌ఓలే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికను సమర్పిస్తే వారి పేర్లను కూడా ఓటర్ల జాబితాలో చేర్చేలా ఈసీఐ వీలు కల్పించింది. ఈసీఐ ఆదేశంలో విస్తృత ప్రభావం చూపే రెండు ఉపసంహరణలు అంతర్భూతంగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఓటర్ల జాబితాల నుంచి అన్యాయంగా తొలగించిన ఏ ఓటర్‌ పేరు అయినా తిరిగి జాబితాలోకి రావడానికి ఒకే ఒక మార్గం ఉందని ఈసీఐ పట్టుబడుతూవచ్చింది. తాను ‘కొత్త ఓటర్‌’నని తప్పుగా ప్రకటించి ఫారం–6 నింపి సమర్పించాలి. సదరు ఓటర్‌కు ఒక కొత్త ఓటర్‌ ఫొటో గుర్తింపుకార్డు నెంబర్‌ను కేటాయిస్తారు. ఈ నెంబర్‌తోనే జాబితాలో అతడి పేరును చేర్చుతారు. సదరు ఓటర్ల దరఖాస్తులను ఓటర్ల నమోదు నిబంధనలలోని రూల్‌ 21(1) ప్రకారం అధికారులు పరిశీలిస్తారు. పొరపాటున లేదా అజాగ్రత్తగా వదిలివేసిన పేర్లను చక్కదిద్దేందుకు ఈఆర్‌ఓలు తగుచర్యలు తీసుకుంటారు. మరో మార్పు ఏమిటంటే ఓటర్‌ జాబితాలలో పేర్లను తిరిగి చేర్చిన వారికి పాత ఓటర్‌ ఫొటో గుర్తింపుకార్డు నెంబర్‌ను ఇవ్వాలని ఈసీఐ నిర్దేశించింది. ఇది స్వాగతించవలసిన విషయం. ఈ రెండు మార్పులు భారత ఎన్నికల సంఘం వైఖరిలో వచ్చిన మార్పులను స్పష్టం చేస్తున్నాయి.


సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో ఈసీఐకి తనపై విమర్శలలో వాస్తవికతను గ్రహించడం అనివార్యమయింది. ఢిల్లీలో సర్‌ ప్రక్రియ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ సమాచార హక్కు కార్యకర్తలు అంజలి భరద్వాజ్‌, అమృతా జోహ్రి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ‘ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌, డూప్లికేట్‌’ (ఏఎస్‌డీడీ) జాబితాలో ఉన్నవారిని ఫారం 6ను నింపమనడం ‘పొరపాటు’, ‘అసమంజ సత్వం’ అవుతుందని సీజేఐ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ఓటర్‌ జాబితా నుంచి తొలగించిన వ్యక్తులను మళ్లీ ఫారం 6 నింపి కొత్త ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాలని నిర్దేశించడం తప్పుకాదా? ఒక ఓటర్‌ తన నివాసాన్ని మార్చుకుంటే ఆ కొత్త చిరునామా వివరాలను మాత్రమే తెలియజేసే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఎన్యుమరేషన్‌ ఫారాలను నిర్దేశిత గడువులోగా సమర్పించలేదని ఓటర్‌ జాబితాల నుంచి తొలగింపునకు గురైన వ్యక్తులు, ఆ తరువాత అదే ఫారాలను సమర్పించే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు?’ అంటూ ఈసీఐని నిశితంగా ప్రశ్నించింది. సర్‌ జాబితా నుంచి తొలగించిన ఏఎస్‌డీడీ కేటగిరీ ఓటర్లు ఎన్యుమరేషన్‌ ఫారం లేదా ఫారం–8 ద్వారా ఓటర్‌ జాబితాలో తమ పేరు తిరిగి నమోదు చేసుకునేందుకు అనుమతించాలని ఈసీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు అభ్యంతరాలు, ఆదేశాలకు ఈసీఐ చురుగ్గా ప్రతిస్పందించలేదు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసింది. పైగా ఒక విడ్డూరమైన వివరణ జారీ చేసింది. సర్‌ ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైనవారు ఫారం–6ను సమర్పించడం ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఈసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం సాగుతున్న సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైనవారు ఫారం–6తో పాటు మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకుంటున్నామన్న ధ్రువీకరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ‘పాత ఓటర్లు ఫారం–6 సమర్పించినట్టయితే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 31 కింద చర్యలు తీసుకోవడం ఉండదు. కేవలం చట్టవిరుద్ధంగా, తప్పుడు ధ్రువీకరణలు ఇచ్చినవారే చర్యలు ఎదుర్కోవలసివస్తుంది’ అని కూడా ఈసీఐ తన వివరణలో స్పష్టంగా పేర్కొంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, మీరు తప్పుడు ధ్రువీకరణలు ఇస్తున్నారన్న వాస్తవం మాకు తెలుసు. అయినప్పటికీ మిమ్ములను నిబంధనల ప్రకారం శిక్షించం అని ఈసీఐ అభయమిచ్చింది!


ఈసీఐ వైఖరిలో మార్పు సర్‌ వ్యతిరేక ఉద్యమానికి ఒక నైతిక విజయమే. భారత ఎన్నికల సంఘం పాత తరహాలో ప్రతి ఓటరునూ కలుపుకు వెళ్లే సానుకూల వైఖరితో మాట్లాడుతోంది. ఏమైతేనేం, సర్‌ లోపభూయిష్ఠంగా ఉన్నదన్న వాస్తవాన్ని ఈసీఐ గుర్తించింది, అంగీకరించింది. అయితే సర్‌ ప్రక్రియ అమలు ఇప్పటికే పూర్తయిన రాష్ట్రాల్లోని ఓటర్లకు ఈ కొత్త విధానాలను ఉపయోగించుకునేందుకు ఎందుకు అవకాశమివ్వడం లేదు? అన్నది జవాబు లేని ప్రశ్న. ఢిల్లీలో కంటే బెంగళూరులోనే ఎక్కువ మంది ఓటర్ల పేర్లను ఓటర్‌ జాబితాల నుంచి తొలగించారు. ఈసీఐ సరికొత్తగా కల్పించిన ఉపశమనాల నుంచి బెంగళూరు ఓటర్లు ఎందుకు లబ్ధి పొందడం లేదు? అసలు సర్‌ జాబితాల నుంచి పెద్ద ఎత్తున తొలగింపులు జరిగిన ఓటర్‌ జాబితాల ప్రాతిపదికన అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల మాటేమిటి? ఆ రాష్ట్రాలలో సర్‌ వాస్తవంగా పూర్తయింది. మరి ఆ రాష్ట్రాలలో ఇప్పటికే ఫారం–6ను సమర్పించిన వారికి ఏమి జరిగింది? వారికి వారి పాత ఎపిక్‌ కార్డు నెంబర్‌ను కేటాయిస్తారా? అసలు ప్రశ్న ఏమిటంటే– ఆ రెండు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సంభవించిన ఓట్ల తొలగింపును సరిదిద్దేందుకు ఈసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంటుందా? లేక ఈ కొత్త ఆదేశాలను కాగితాలకే పరిమితం చేసి, కేవలం కొద్దిమంది ఓటర్లు మాత్రమే తిరిగి జాబితాలోకి వచ్చారని సుప్రీంకోర్టులో ఒక నివేదిక దాఖలు చేస్తుందా?


సర్‌ ప్రక్రియ అమలు విధానాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి, సందేహం లేదు. అయితే సర్‌ నిర్మాణాత్మక లక్షణాలు యథాతథంగా ఉన్నాయి. ఇవి సార్వత్రిక వయోజన ఓటుహక్కు అనే ప్రజాస్వామిక సూత్రానికి వ్యతిరేకమైనవి. సవరించిన నిబంధనలు సైతం తమ పేరు ఓటర్‌ జాబితాలలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యతను ఓటర్‌ పైనే మోపాయి. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధం కాదా? పైగా తాము ఈ దేశ పౌరులమని నిరూపించుకోవల్సిన బాధ్యత కూడా ఓటర్లదేనని ఆ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. సవరించిన నిబంధనలు, కల్పించిన ఉపశమనాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, సర్‌ అప్రజాస్వామిక ధోరణిలో మార్పు ఉండబోదనడంలో కూడా సందేహం లేదు. ఈసీఐ తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ ఓటర్ల హక్కులను కాలరాస్తున్న లోపభూయిష్ఠ సర్‌ను పూర్తిగా రద్దు చేసేంతవరకు వీధుల్లో ప్రజల ప్రజాస్వామిక పోరాటాలు అనివార్యమవుతాయి. చెప్పవచ్చినదేమిటంటే, ఈసీఐ తన తప్పు ఒప్పుకున్నదిగానీ ఓటర్లకు సంపూర్ణ న్యాయం జరగలేదు. ఓటర్లకు కొత్తగా కల్పించిన ఉపశమనాలు నేరాన్ని అంగీకరించడం మినహా మరేమీ కావు. ఓట్ల తొలగింపు అన్యాయాన్ని అవి పూర్తిగా తొలగించలేవు. ఎందుకంటే సర్‌ స్వాభావికంగా న్యాయవిరుద్ధమైనది. దానిని పూర్తిగా రద్దు చేసి సరికొత్తగా ప్రారంభించాలి. ఇది మాత్రమే మన ప్రజాస్వామ్య పురోగతికి దోహదం చేస్తుంది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

(సమాచార హక్కు కార్యకర్తలు అంజలి భరద్వాజ్‌, అమృతా జోహ్రీ సహకారంతో)

ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 12 , 2026 | 01:14 AM