Share News

పైపై దాడులతో డ్రగ్స్‌ మాఫియా ఆగుతుందా?

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:37 AM

‘నషా ముక్త్‌ భారత్‌’ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పోరాడుతున్నాయి. పోలీసుశాఖ సహా రాష్ట్ర ప్రభుత్వ వివిధ విభాగాలు పలు అవగాహనా కార్యక్రమాలు, సదస్సులు...

పైపై దాడులతో డ్రగ్స్‌ మాఫియా ఆగుతుందా?

‘నషా ముక్త్‌ భారత్‌’ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పోరాడుతున్నాయి. పోలీసుశాఖ సహా రాష్ట్ర ప్రభుత్వ వివిధ విభాగాలు పలు అవగాహనా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నాయి. డ్రగ్స్‌ వెనుక భారీ ఆర్థిక సామ్రాజ్యం, అంతర్జాతీయ నేర ముఠాలు, సరిహద్దు ప్రాంతాల్లో అస్థిరత, ఆయుధాల కొనుగోళ్లు వంటి అనేక కోణాలు దాగి ఉన్నందున ఈ పోరాటం ఎంతో విస్తృతమైనది.

మయన్మార్‌ కేంద్రంగా సాగుతున్న సింథటిక్‌ డ్రగ్స్‌ ఉత్పత్తి, వాటి అక్రమ రవాణా భారత అంతర్గత భద్రతకు సవాలు. మయన్మార్‌, లావోస్‌, థాయ్‌లాండ్‌ దేశాల సరిహద్దులు కలిసే ప్రాంతాన్ని గోల్డెన్‌ ట్రయాంగిల్‌గా పిలుస్తారు. ఒకప్పుడు నల్లమందు, హెరాయిన్‌ ఉత్పత్తికి అపఖ్యాతి పొందిన ఈ ప్రాంతం ప్రస్తుతం మెథాంఫెటమైన్‌ వంటి సింథటిక్‌ మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరాలో అంతర్జాతీయంగా కీలక కేంద్రంగా మారింది. ప్రభుత్వ నియంత్రణ బలహీనంగా ఉన్న కొన్ని ప్రాంతాలు, సాయుధ సమూహాలు, అక్రమ వ్యాపార నెట్‌వర్క్‌లు, అంతర్జాతీయ నేర ముఠాలు పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసే సంక్లిష్ట వ్యవస్థ ఈ గోల్డెన్ ట్రయాంగిల్. ముఖ్యంగా మయన్మార్‌లో 2021 సైనిక తిరుగుబాటు తర్వాత ఏర్పడిన రాజకీయ, భద్రతా అస్థిరత వల్ల అక్రమ ఆర్థిక కార్యకలాపాలు మరింత పెచ్చుమీరాయి.

యూఎన్‌ఓడీసీ 2025 నివేదిక ప్రకారం, మయన్మార్‌ నుంచి భారత ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్‌, మిజోరాంలోకి మెథాంఫెటమైన్‌ మాత్రల అక్రమ రవాణా కొనసాగుతోంది. 2025 మేలో మిజోరాంలో 236 కిలోలకు పైగా మెథాంఫెటమైన్‌ మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఈ సమస్య తీవ్రతను చాటింది. సరిహద్దుల్లో పట్టుబడుతున్న మాదకద్రవ్యాలు అసలు వ్యాపార పరిమాణాన్ని పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చు. అందువల్ల స్వాధీనం చేసుకున్న సరుకు విలువను మాత్రమే కాకుండా, దాని వెనుక ఉన్న సరఫరాదారులు, ఆర్థిక మధ్యవర్తులు, రవాణా నెట్‌వర్క్‌లను కూడా దర్యాప్తు చేయాలి. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బు ఉగ్రవాద లేదా సాయుధ సంస్థలకు చేరడం, ఆ నిధులతో అవి ఆయుధాలు కొనుగోలు చేయడం, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడటం నార్కో టెర్రరిజం పరిధిలోకి వస్తుంది. మయన్మార్‌లోని కొన్ని సాయుధ జాతి సంస్థలు, సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే మిలిటెంట్‌ గ్రూపులు, అక్రమ వ్యాపార నెట్‌వర్క్‌ల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయి?


మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బు భారత వ్యతిరేక హింసాత్మక కార్యకలాపాలకు వినియోగమవుతున్నదా? అనే అంశాలపై లోతైన దర్యాప్తు అవసరం. డ్రగ్స్‌ వ్యాపారం వెనుక ఉన్న అసలు శక్తులను గుర్తించకుండా, నగరాల్లో చిన్నచిన్న ప్యాకెట్లు విక్రయించే వ్యక్తులను అరెస్టు చేయడంతో సమస్య ముగిసిపోదు. ఆ సరుకు ఎక్కడ తయారైంది? ఎవరు రవాణా చేశారు? లాభాలు ఎక్కడికి చేరుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ముఖ్యం. మయన్మార్‌లోని సాయుధ సమూహాలకు డ్రోన్‌ యుద్ధతంత్రం, డ్రోన్‌ నిర్వహణ, సాంకేతిక శిక్షణ అందించారనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా పౌరుడు మాథ్యూ ఆరోన్‌ వాన్‌డైక్‌, ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఏడాది అరెస్టు చేసింది. మయన్మార్‌లోని సాయుధ సమూహాలకు వీరు శిక్షణ అందించారనే కోణంలో దర్యాప్తు సాగింది. సరిహద్దుల ఆవల పనిచేసే సాయుధ సంస్థలు డ్రోన్లవంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను భద్రతా సంస్థలు నిర్లక్ష్యం చేయకూడదు.

డ్రగ్స్‌ అక్రమ వ్యాపారంలో సరుకును పట్టుకోవడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా వచ్చిన డబ్బును గుర్తించడం కూడా అంతే ముఖ్యం. అక్రమ లావాదేవీల్లో హవాలా, బినామీ ఖాతాలు, నకిలీ వ్యాపార లావాదేవీలు, క్రిప్టో ఆస్తులను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ గుర్తించలేనివి కావు. అనేక బ్లాక్‌చెయిన్‌ నెట్‌వర్క్‌లలో లావాదేవీల వివరాలు నమోదవుతాయి. అయితే వాటి వెనుక వ్యక్తులను గుర్తించడానికి, ఇతర దేశాల్లోని ఖాతాలతో సంబంధాలను నిరూపించడానికి ప్రత్యేక నైపుణ్యం కావాలి.

రాష్ట్రాల పోలీసులు, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎన్‌ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, కస్టమ్స్‌ విభాగం, ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థలు పరస్పర సమాచారాన్ని పంచుకోవాలి. ఒకే నెట్‌వర్క్‌పై వేర్వేరు రాష్ట్రాల్లో దర్యాప్తులు సాగుతున్నప్పుడు సమన్వయం కీలకం. గోల్డెన్‌ ట్రయాంగిల్‌ నుంచి ఉద్భవిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే అంతర్జాతీయ సహకారం, సరిహద్దు నిఘా, రసాయనాల అక్రమ సరఫరాపై నియంత్రణ, ఆర్థిక నేరాల దర్యాప్తు, సమాచార మార్పిడి అన్నీ సమాంతరంగా సాగాలి.

డ్రగ్స్‌ మాఫియా బలాన్ని అంచనా వేయడానికి పట్టుబడిన ప్యాకెట్ల సంఖ్య ప్రమాణం కాదు. దాని వెనుక ఉన్న ఆర్థిక సామ్రాజ్యాన్ని, రాజకీయ లేదా సాయుధ సంబంధాలపై ఉన్న ఆధారాలను, అంతర్జాతీయ సరఫరా గొలుసును ఛేదించడమే అసలు కొలమానం.

శ్రీశైలం రమేశ్ (జర్నలిస్టు)

ఇవి కూడా చదవండి..

అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..

అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 27 , 2026 | 02:37 AM