మహిళాలోకానికి స్ఫూర్తి ముత్తులక్ష్మి
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:58 AM
మొదటివారు అని వివిధ రంగాల్లో పేర్కొన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ అనేక రంగాల్లో మొదటివారిగా పేర్కొనగలవారు అరుదుగా ఉంటారు. మన దేశంలో తొలి శాసన సభ్యురాలు, పురుషుల వైద్య కళాశాలలో...
మొదటివారు అని వివిధ రంగాల్లో పేర్కొన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ అనేక రంగాల్లో మొదటివారిగా పేర్కొనగలవారు అరుదుగా ఉంటారు. మన దేశంలో తొలి శాసన సభ్యురాలు, పురుషుల వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన తొలి మహిళ, సర్జరీ విభాగంలో ప్రవేశం పొందిన తొలి భారతీయ మహిళ, సోషల్ వెల్ఫేర్ బోర్డు తొలి చైర్‌పర్సన్, శాసనసభకు తొలి ఉపాధ్యక్షురాలు, మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా కార్పొరేటర్. ఇన్ని ప్రత్యేకతలు సాధించిన స్త్రీమూర్తి డా. ముత్తులక్ష్మిరెడ్డి. ఈమె తల్లి చంద్రమాళ్ల్... దేవదాసి. ఆమెను పెళ్లి చేసుకున్నందువల్ల తండ్రి నారాయణస్వామిని వెలివేశారు.
1986 జూలై 30న జన్మించిన ముత్తులక్ష్మి ఈ వివక్షతల మధ్యే పెరిగారు. చిన్నతనం నుంచి దేవదాసి వ్యవస్థ, బాల్య వివాహాలు, పురుషాధ్యికత, ఒంటరి మహిళల వేదనలు ఆకళింపు చేసుకున్నారు. మహిళలకు ప్రవేశంలేని రోజుల్లో పుదుక్కోట రాజు తొండమాన్ సహకారంతో వైద్య కళాశాలలో చేరి, పురుష విద్యార్థులకు కన్పించకుండా ఏర్పాటు చేసిన పరదాల మధ్య కూర్చుని విద్యాభ్యాసం పూర్తిచేసి 1912లో వైద్యురాలయ్యారు. దేవదాసి కుటుంబం నుంచి వచ్చిన తల్లి... కూతురికి భద్ర జీవితం కోసం చిన్న వయస్సులోనే పెళ్లి చేయాలనుకుంది. కానీ తండ్రీకూతుళ్లు పడనివ్వలేదు. వివాహ బంధానికి దూరంగా ఉండాలనుకున్న ముత్తులక్ష్మి.. తన ఆశయాలకు ఆటంకం కల్గించడని నమ్మకం కుదిరిన తర్వాత, డా. టి.సుందరరెడ్డిని 1914లో వివాహం చేసుకున్నారు.
1947 అక్టోబర్ 8న మద్రాసు శాసనసభలో సహచర సభ్యులు రామసామిరెడ్డితో కలిసి దేవదాసీ నిర్మూలన చట్టం కోసం తీర్మానం పెట్టారు. దాన్ని సనాతనవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చర్చ అనంతరం చివరకు దేవదాసీ నిర్మూలన చట్టాన్ని శాసనసభ ఆమోదించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న కోస్తా రాయలసీమల్లోని ‘మాతమ్మ’, ‘జోగినీ’ వ్యవస్థలు, మలబార్ ప్రాంతాలలోని ‘నంగా’, కన్నడ ప్రాంతంలోని ‘బసవ’ లాంటి అనాగరిక వ్యవస్థలన్నీ రద్దయ్యాయి. ఈ కాలంలోనే బాలికల వివాహ వయస్సు 16 సంవత్సరాలకు పెంచాలని శాసనసభలో చర్చ పెట్టటమే గాక గాంధీకి ఉత్తరం రాశారు. బాలికల విద్య, వైద్యం, వితంతు వివాహాల ప్రోత్సాహం లాంటి వివిధ సామాజిక అంశాలపై విశేషంగా కృషి చేశారు.
ఇవన్నీ ఒక ఎత్తు కాగా, క్యాన్సర్ రోగుల సేవ, ఆ వ్యాధికి వైద్యం విషయాల్లో ఆమె కృషి అద్వితీయం. మద్రాసులోని అడయార్‌లో 1954లో 12 పడకలతో ఆమె ప్రారంభించిన క్యాన్సర్ వైద్యశాల ఈ రోజుకీ 600 పైగా పడకలు కలిగి, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్యశాలగా విలసిల్లుతున్నది. ఈ వైద్యశాలకు 1952లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు సంవత్సరానికి 80వేలకు పైగా రోగులకు ఈ ఆసుపత్రి వైద్యసేవలు అందిస్తున్నది. 1931లో అడయార్‌లోనే ‘అవ్వై హోం’ పేరిట ఆమె స్థాపించిన శరణాలయం మహిళలు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బతికేట్లుగా తోడ్పడుతోంది. ఇన్ని వ్యాపకాల మధ్య ఆమె ‘స్త్రీ ధర్మ’ అనే పత్రిక నడిపింది. 1930లో లండన్‌లో, 1932లో చికాగోలో ప్రపంచ మహిళా సాధికారిక సదస్సుల్లో పాల్గొని భారతీయ మహిళల స్థితిగతుల్ని ప్రపంచానికి చాటారు ముత్తులక్ష్మి. అఖిల భారత మహిళా సదస్సుకు 1931లో ఆమె అధ్యక్షత వహించారు. ‘శాసన సభలో నా అనుభవాలు’, ‘స్వీయ జీవిత చరిత్ర’ ఆమె చేసిన రచనలు. కానీ అవి అందుబాటులో లేవు.
1968 జూలై 22న జీవితం చాలించిన డా. ముత్తు లక్ష్మిరెడ్డికి 1956లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చినా, ఆమె సేవల ముందు అది చాలా చిన్నదే.
పోపూరి ఆర్తి
(నేడు డా. ముత్తులక్ష్మి వర్ధంతి)
ఇవి కూడా చదవండి
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్
12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..