పరిపూర్ణ ప్రజాస్వామిక వ్యక్తిత్వం
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:53 AM
చట్టసభల్లో చర్చలు అర్థవంతంగా సాగడానికి, ప్రజాస్వామ్య సంప్రదాయాలు పరిఢవిల్లడానికి సభాపతి పాత్ర అత్యంత కీలకం. రాజ్యాంగ పరిజ్ఞానం, న్యాయశాస్త్రంపై పట్టు, రాజకీయ అనుభవం, నిష్పాక్షిక దృక్పథం...
చట్టసభల్లో చర్చలు అర్థవంతంగా సాగడానికి, ప్రజాస్వామ్య సంప్రదాయాలు పరిఢవిల్లడానికి సభాపతి పాత్ర అత్యంత కీలకం. రాజ్యాంగ పరిజ్ఞానం, న్యాయశాస్త్రంపై పట్టు, రాజకీయ అనుభవం, నిష్పాక్షిక దృక్పథం కలగలిసిన వ్యక్తిత్వం సభాపతి స్థానానికి వన్నె తెస్తుంది. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగినవారు డాక్టర్ ఎ.చక్రపాణి.
1943 జనవరి 1న కర్నూలు జిల్లా హుస్సేన్‌పురంలో జన్మించిన చక్రపాణి బి.ఏ., ఎల్.ఎల్.బి., ఎల్.ఎల్.ఎం.తో పాటు న్యాయశాస్త్రంలో పీహెచ్డీ, ఎల్.ఎల్.డి పట్టాలు పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, అనంతరం విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయశాస్త్రంపై ఆయనకున్న పరిజ్ఞానం, రాజ్యాంగ వ్యవస్థపై అవగాహన ఆయన ప్రజాజీవితానికి బలమైన పునాదులుగా నిలిచాయి.
దామోదరం సంజీవయ్య ఆశీస్సులతో 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అదే సమయంలో మా నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పటినుంచి వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం జీవితాంతం కొనసాగిన ఆత్మీయ స్నేహంగా పరిణమించింది. నాకు కూడా అప్పటి నుంచే చక్రపాణిగారితో పరిచయం.
1976లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన చక్రపాణి 1985 వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. చీఫ్ విప్‌గా, ప్రివిలేజెస్ కమిటీ, ప్రభుత్వ హామీల కమిటీ, పిటిషన్ల కమిటీ, హౌస్ కమిటీ వంటి కీలక కమిటీలకు అధ్యక్షత వహించారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేయడంతో ఆయన శాసన ప్రస్థానంలో కీలక మలుపు ఏర్పడింది. ఆ సమయంలో ఆయన మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శాసనమండలి అనేది కేవలం రెండో సభ మాత్రమే కాదని, చట్టాలపై పునరాలోచనకు, వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలకు, ప్రజాసమస్యల లోతైన పరిశీలనకు అవసరమైన ప్రజాస్వామ్య వేదిక అని చక్రపాణి బలంగా విశ్వసించేవారు.
దాదాపు 22 ఏళ్ల విరామం తరువాత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని పునరుద్ధరించారు. 2007 ఏప్రిల్ 2న పునరుద్ధరణ అనంతర మండలి తొలి చైర్మన్‌గా చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అదే మండలికి, పునరుద్ధరణ అనంతరం తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆయన జీవితంలో ఒక విశిష్టమైన చారిత్రక ఘట్టం.
జాతీయ స్థాయిలోనూ ఆయన పార్లమెంటరీ సేవలు విస్తరించాయి. ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమావేశం స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా, స్పీకర్స్ కాన్ఫరెన్స్ సబ్ కమిటీ కన్వీనర్‌గా, పార్లమెంటరీ కమిటీల అధ్యయనానికి సంబంధించిన జాతీయ స్థాయి ఉపసంఘానికి కన్వీనర్‌గా పనిచేశారు. కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొని వివిధ దేశాల శాసన వ్యవస్థలను అధ్యయనం చేశారు. ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై ఆయనకున్న ఆసక్తికి ఈ బాధ్యతలు నిదర్శనం.
చక్రపాణిలోని మరో విశిష్టమైన కోణం ఆయన రచనా వ్యాసంగం. ‘Second Chamber of Legislature – A Must’ అనే గ్రంథం ద్వారా శాసనమండలి ఆవశ్యకతను విశ్లేషించారు. ‘Process of Amendments to the Indian Constitution’, ‘Legal Profession and a Sincere Lawyer’, ‘Anti- Arrack Movement in Andhra Pradesh’ వంటి రచనలు ఆయన అధ్యయన పరిధిని తెలియజేస్తాయి. ఆయన రచించిన ‘Andhra Pradesh Legislature - Its Origin and a Line of Historical Evolution’, ‘Privileges of Members of Parliament/Legislature’, ‘Right to Information in India – A Critique’ పుస్తకాల ఆవిష్కరణ ఇటీవలే వారి స్వగృహంలో నా చేతులమీదుగా జరిగింది.
చక్రపాణిగారి వ్యక్తిత్వంలో నాకు విశేషంగా గుర్తుండిపోయే అంశం తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల పట్ల ఆయనకున్న అపారమైన అభిమానం. ‘ఆంధ్ర జనత’ తెలుగు దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా సాధనకు జరిగిన కృషిలో చురుకుగా భాగస్వాములయ్యారు. 2011లో మారిషస్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో, 2012లో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభల్లో మేమిద్దరం పాల్గొన్నాము. శాసనమండలి చైర్మన్‌గా ఉన్న సమయంలో రాష్ట్రేతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి విద్యా, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి ఆయన ప్రత్యేక చొరవ చూపారు.
చక్రపాణిగారితో నాకున్న అనుబంధం రాజకీయ సంబంధాలకు అతీతమైనది. శాసనమండలి చైర్మన్‌గా ఉన్నప్పుడు, నేను మంత్రిగా, శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన సందర్భాల్లో ఆయన సలహాలు, సూచనలు, ప్రోత్సాహం పొందే అవకాశం లభించింది. తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సమస్యలపై ఆయనతో జరిగిన చర్చలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. పదవులు మారినా, రాజకీయ పరిస్థితులు మారినా ఆత్మీయ సంబంధాలకు ఆయన ఇచ్చిన విలువ ప్రత్యేకమైనది.
83 సంవత్సరాల వయసులో మొన్న నవంబర్ 4న చక్రపాణి అస్తమించారు. మా కుటుంబానికి ఆత్మీయ మిత్రుడిగా, ప్రజాజీవితంలో సహచరుడిగా, శాసన వ్యవస్థలో అనుభవజ్ఞుడైన మార్గదర్శిగా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.
మండలి బుద్ధప్రసాద్
శాసనసభ్యులు, అవనిగడ్డ
ఈ వార్తలూ చదవండి
పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ