‘దిమాగీ నక్సల్స్’ దాడిని ఎలా ఎదుర్కోవాలి?
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:42 AM
ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘సాయుధ నక్సలైట్లను నిర్మూలించడంలో విజయం సాధించాం. కానీ దిమాగీ నక్సల్స్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని గుర్తించి ఏకాకులను...
ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘సాయుధ నక్సలైట్లను నిర్మూలించడంలో విజయం సాధించాం. కానీ దిమాగీ నక్సల్స్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని గుర్తించి ఏకాకులను చేయాలి’ అని పిలుపునిచ్చారు. ఇది ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్టులలో ఒక భాగం నక్సలైట్లు. దేశంలో పలు కమ్యూనిస్టు పార్టీలు, అనేక ఎంఎల్ పార్టీలు, గ్రూపులు ఉన్నాయి. ఈ హెచ్చరిక, దాడి భారత కమ్యూనిస్టు ఉద్యమంపై, వారి సానుభూతిపరులు, వామపక్ష మేధావులు, పౌరహక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు, సమరశీల పోరాటాలు సాగిస్తున్న విద్యార్థి యువజనులు... ఈ అన్ని వర్గాలపై ఎక్కుపెట్టారు. విప్లవ శక్తులపై ముప్పేట దాడిగా దీనిని పరిగణిస్తున్నా, పాలకవర్గాలు కమ్యూనిస్టు భావాల మీదనే ఎందుకు, ఎలా బాహాటంగా, జయప్రదంగా దాడి చేయగలుగుతున్నాయి?
భారత కమ్యూనిస్టు ఉద్యమం మరెన్నడూ లేని విధంగా నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక ప్రముఖ ఆంగ్ల పక్షపత్రిక ‘నో లెఫ్ట్ టర్న్స్’ అనే ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. భారత వామపక్షం తన శతాబ్ది సంవత్సరంలో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించింది. ఈ శీర్షిక వామపక్ష భావజాలం ఎదుర్కొంటున్న ప్రస్తుత రాజకీయ సవాళ్లను సూచిస్తుంది.
ఇటీవలి ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు ఇప్పుడిప్పుడే కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. కమ్యూనిస్టు కంచుకోటలుగా భావించే పశ్చిమబెంగాల్, కేరళం, త్రిపుర రాష్ట్రాలలో వాటి అధికారం బీటలు వారింది. గడచిన యాభై ఏళ్లలో సీపీఎం కనీసం ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు మొదటిసారి అధికారంలో లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ‘క్రుష్చేవ్ రివిజనిజం’, ఆర్థికవాదం, సంస్కరణవాదం వంటి తప్పుడు దివాళాకోరు విధానాలను అనుసరించిన ఫలితమే ఇది. వారు కేవలం నామమాత్రపు పోరాటాలు మాత్రమే చేస్తూ ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించే బాధ్యతను పూర్తిగా విస్మరించారు. వేరొక వంక, సాయుధ పోరాటం కొనసాగించిన పార్టీ పూర్తిగా దెబ్బతింది. దండకారణ్యంలో నెత్తురుటేరులు పారాయి. వందలాది నాయకులు, కార్యకర్తలు నేలకొరిగారు. వేలాదిమంది అరెస్టయ్యారు. మరెంతోమంది లొంగిపోయారు. మారుమూల గూడెంలో నివసించే పేద గిరిజనుడు రాజ్యం సాయుధదాడికి బలైపోయాడు. నిరాశ్రయుడయ్యాడు. ఇదంతా మావోయిజం పేరుతో అక్కడ అమలైన ‘లిన్ పియావో’ అతివాద అవకాశవాద పంథా పర్యవసానమే తప్ప మరొకటి కాదు. వీరుల రక్త తర్పణంతో దండకారణ్య ఉద్యమం మరింత ఎరుపెక్కింది. ఆ మహత్తర పోరాటాల నుంచి విప్లవశక్తులు సరైన పాఠాలు నేర్చుకుని, మున్ముందుకు సాగాలని ప్రజలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు.
భారత కమ్యూనిస్టు ఉద్యమంలోని రెండు తప్పుడు ధోరణులు, క్రుష్చేవ్ రివిజనిజం, లిన్ పియావో అతివాద అవకాశవాదం... ఇవే నిజానికి ఇప్పుడు ఓడిపోయాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎన్నికలలో జరిగిన అక్రమాల గురించీ బీజేపీ ఇతర ఎంపీలను లోబరుచుకోవడంతో పాటు హిందుత్వ భావాలను రేకెత్తించి ప్రజల్ని చీల్చివేసిన తీరు గురించీ ఎల్‌డీఎఫ్ నాయకుల తప్పుడు వ్యవహారశైలి, వైఖరుల గురించీ వివరిస్తున్నారు. లక్షలాది ఓట్లు నిర్దేశిత సీట్లలో తొలగించి, కేంద్ర సంస్థలను మొహరించి, ఈసీని కూడా దించి సాగిస్తున్న అక్రమాల గురించి ఏకరువు పెడుతున్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్టు ప్రభుత్వంగా అభివర్ణిస్తూ అనేక వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. విప్లవోద్యమం పాశవికంగా అణచివేతకు గురవుతుంటే ఇది ‘కగార్ రిపబ్లిక్’ అంటూ విశ్లేషణలు, పుస్తకాలు వెలువడుతున్నాయి. కానీ ఇవేవీ సమస్య సాధనకు పరిష్కార మార్గాలను చూపడం లేదు. కేవలం సమస్య పైపైన మాత్రమే తడుముతున్నాయి.
వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఇప్పుడు కావాల్సింది లోతైన ఆత్మవిమర్శ. సమగ్రమైన సమీక్ష. ఎలాంటి ఊగిసలాటలకు, శషభిషలకు తావులేని ఆత్మపరిశీలన. ప్రతి కమ్యూనిస్టు పార్టీ, ప్రతి సంస్థ, ప్రతి ప్రజాసంఘం, ప్రతి వ్యక్తి, గ్రూపు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. అంతేకాదు, గత శతాబ్దంలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఎందుకు చీలికలకు గురై ఛిన్నాభిన్నమయిందో సామ్రాజ్యవాదుల కుట్రలు ఎలా జయప్రదంగా సాగిపోయాయో విశ్లేషించుకోవాలి. రష్యా, చైనా నాయకులు చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. ప్రపంచ కమ్యూనిస్టు విప్లవశక్తుల ఐక్యత వికసిల్లాలి. రెక్టిఫికేషన్ క్యాంపెయిన్లు విప్లవోద్యమం బలపడి పురోగమించటానికే దోహదపడతాయి.
కొన్ని కమ్యూనిస్టు సంస్థాగత నిర్మాణాలు కనుమరుగు కావచ్చు. కానీ కమ్యూనిస్టులు ఎలుగెత్తి చాటిన విలువలు, సోషలిజం సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా స్వాతంత్ర్య ఆశయాలు ప్రజల హృదయాల్లో గాఢంగా నిలిచే ఉన్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్ నిరసన కార్యక్రమాల్లో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం మార్మోగిపోయింది. విద్యార్థి యువజనులకు భగత్‌సింగ్, అంబేడ్కర్‌లు స్ఫూర్తిగా నిలిచారు. దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలు పటిష్ఠమైన ఉద్యమంగా రూపుదిద్దుకుని వామపక్షాలు మళ్లీ బలపడే అవకాశం ఉందని పాలకవర్గాలు హడలెత్తిపోతున్నాయి. మోదీ ఎర్రకోట ప్రసంగం దీనినే సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడో వరుస విప్లవాలు సమీప భవిష్యత్తులో బద్దలుకానున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కమ్యూనిస్టులపై ఉంచిన విశ్వాసాన్ని విప్లవశక్తులు నిలబెట్టుకోవాలి. ప్రజల పూర్తి అండదండలతో ‘దిమాగీ నక్సల్స్’ దాడిని శక్తిమంతంగా తిప్పికొట్టాలి.
n డాక్టర్ శ్రీనివాస్
కె.ఎస్. మెమోరియల్ కమిటీ
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం