Share News

ఇద్దరు బాబాల కథ!

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:16 AM

ఒకరు డేరా బాబా, ఇంకొకరు ప్రొఫెసర్ సాయిబాబా. డేరా బాబా హర్యానాలో ఒక ప్రసిద్ధ మత గురువు. 2015లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక మన దేశంలోని వందమంది ‘పవర్‌ ఫుల్’ వ్యక్తుల జాబితాను ప్రకటిస్తే ఆయన...

ఇద్దరు బాబాల కథ!

ఒకరు డేరా బాబా, ఇంకొకరు ప్రొఫెసర్ సాయిబాబా. డేరా బాబా హర్యానాలో ఒక ప్రసిద్ధ మత గురువు. 2015లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక మన దేశంలోని వందమంది ‘పవర్‌ ఫుల్’ వ్యక్తుల జాబితాను ప్రకటిస్తే ఆయన 96వ స్థానంలో ఉన్నాడు. హీరో, సంగీతం, కథ, మాటలు, పాటలు... వగైరాలతో కొన్ని సినిమాలు కూడా తీశాడు. 2002లో డేరా బాబా కార్యాలయంలోని మహిళా అనుచరులపై లైంగిక దాడి జరిగినట్లు ‘పూరా సచ్’ పత్రిక ప్రచురించింది. అనంతరం దాని ఎడిటర్ రామచందర్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు పడింది. తరువాత దాన్ని హైకోర్టు కొట్టివేసింది. 2002లోనే డేరా బాబా సంస్థలో మేనేజర్‌గా పనిచేసే రంజిత్‌సింగ్ హత్య జరిగింది. ఈ కేసులో సీబీఐ కోర్టు బాబాను నేరస్థుడిగా నిర్ధారించింది. ఈ తీర్పును కూడా హైకోర్టు కొట్టివేసింది. శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో 2017లో ఆయనకు ఇరవై ఏళ్లు జైలుశిక్ష పడింది.

ఈయనతో పోలిస్తే ప్రొఫెసర్ సాయిబాబా ఒక మామూలు వ్యక్తి. అమలాపురానికి చెందిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీషు పాఠాలు చెప్పుకునేవాడు. దళిత, ఆదివాసీ సమస్యల గురించి రచనలు చేసేవాడు. ఎటువంటి హింసాయుత చర్యల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఆరోపణలు లేవు. 2017లో కొన్ని విప్లవ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లుగా చెబుతూ, ఉపా చట్టం కింద ఆయనకు జీవిత ఖైదు విధించారు. తొంభై శాతం శారీరక వైకల్యంతో బాధపడుతూ ఆరేళ్లకు పైగా జైల్లో గడిపిన తరువాత... 2024లో నేరం రుజువుకాకపోవడంతో నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు, తర్వాత కొద్ది కాలానికే చనిపోయారు.


జైలు శిక్ష విధించబడ్డ ఖైదీలకు అత్యవసర కుటుంబ విధులకు హాజరయ్యేందుకు ‘పెరోల్’ అనే పద్ధతి ఉంది. సమీప కుటుంబ సభ్యుల చావు కానీ, వివాహ సందర్భాల్లో కానీ, వైద్య చికిత్సలు వగైరాల నిమిత్తం కానీ ఖైదీలను కొన్ని రోజులపాటు పెరోల్ కింద జైలు నుంచి బయటకు పంపవచ్చు. డేరా బాబా మే 26న మళ్లీ పెరోల్ కింద విడుదలయ్యారు. ముప్పైరోజుల పాటు ఆయన తన ఆశ్రమంలో ఉండవచ్చు. ఎప్పుడో ఎమర్జెన్సీకి మాత్రమే లభించే పెరోల్ అతనికి ఇప్పటికి పదహారుసార్లు దొరికింది. ఇప్పటివరకూ మొత్తం 430 రోజులు ఆయన జైలు బయటే ఉన్నాడు. గతంలో పెరోల్ మీద విడుదలై, తన మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేసినట్లు కథనాలున్నాయి. పెరోల్ వ్యవస్థ మీద ఆరోపణలు వస్తున్నా, ఆ స్థాయి వ్యక్తులకు ధారాళంగా పెరోల్ దొరకడం పట్ల చాలా మంది ఆశ్చర్యపడడం మానివేశారు. కాకపోతే, సాయిబాబా లాంటి మామూలు వ్యక్తుల విషయంలో కూడా కొంతైనా ఔదార్యం చూపించి ఉంటే బాగుండేది. జీఎన్‌ సాయిబాబా తల్లి మరణిస్తే.. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా ఆయనకు పెరోల్ దొరకలేదు. చక్రాల కుర్చీకి పరిమితమైన వ్యక్తిని తల్లి అంత్యక్రియలకు అనుమతిస్తే ఎక్కడికి పారిపోగలడు? ఆ కొద్ది గంటల్లో ఏ నేరం చేయగలడు? అంత్యక్రియల తరువాత తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడానికి ఇబ్బంది ఏమిటి?.. వంటివి అర్థం కాని ప్రశ్నలు.

వెలుగోటి రాములు

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 12:16 AM